ETV Bharat / opinion

కొవిడ్​ వేళ.. అన్నార్తులకు అభయంగా

author img

By

Published : Jun 9, 2021, 12:21 PM IST

కొవిడ్‌ సంక్షోభ వేళ అన్నార్తుల ఆకలి తీర్చేందుకు 'ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన' అమలు కాలావధిని కేంద్రం వచ్చే దీపావళి వరకు పొడిగించింది. ఈ పథకం ద్వారా నిరుడు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సమయంలో ఎనిమిది కోట్లమంది వలస కూలీలకు తిండిగింజల సరఫరాను తలపెట్టగా, వారిలో నికరంగా అందుకున్నది 2.14కోట్ల మందేనని ఏడాది క్రితం లెక్కతేలింది. సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా గరీబ్‌ కల్యాణ్‌ యోజనను పొడిగించుకుంటూ పోతున్నందువల్ల- అధికారిక గణాంకాలకు, వాస్తవిక లబ్ధిదారుల సంఖ్యకు మధ్య పోనుపోను అంతరం విస్తరిస్తోంది!

pm garib kalyan anna yojana
కేంద్ర ఉచిత రేషన్​

కొవిడ్‌ సంక్షోభ వేళ అన్నార్తుల ఆకలి మంటలు చల్లార్చడమే ధ్యేయమంటూ 'ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన' అమలు కాలావధిని కేంద్రం వచ్చే దీపావళి వరకు పొడిగించింది. ఆ లెక్కన, ప్రధాని మోదీ భరోసా ప్రకారం- 80కోట్ల మంది పౌరులకు నవంబరు దాకా నెలకోసారి అయిదు కిలోల గోధుమలు లేదా బియ్యం ఉచితంగా అందనున్నాయి. జాతీయ ఆహార భద్రత చట్టం కింద పంపిణీ చేసే అయిదు కిలోల రేషన్‌కిది అదనం. యథాతథంగా కార్యాచరణకు నోచుకుంటే క్షుధార్తుల్ని చాలావరకు సాంత్వనపరచగల ఉదార నిర్ణయమిది!

వారి కడుపు నింపే సదుద్దేశంతో..

పనీపాటలకు అతీగతీ లేక ఉపాధి అవకాశాలు తెగ్గోసుకుపోయిన దశలో బడుగుజీవుల కడుపు నింపే సదుద్దేశంతో నిరుడు ఏప్రిల్‌ నుంచి మూడు నెలలపాటు వర్తించేలా రూ.60వేలకోట్లతో గరీబ్‌ కల్యాణ్‌ అన్నయోజన పట్టాలకు ఎక్కింది. దాన్ని దశలవారీగా పొడిగిస్తున్న కేంద్రం- 100 శాతం కోటాను ఏయే రాష్ట్రాలు వినియోగించుకున్నదీ లెక్క చెబుతోంది. క్షేత్రస్థాయిలో అందుకు దీటుగా పంపిణీ కొరవడి యోజన ప్రయోజకత్వంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేరేదైనా, ఉచిత రేషన్‌ పక్కదారి పట్టిందంటే పర్యవేక్షణ లోపాలు పెచ్చరిల్లుతున్నాయనే అర్థం.

నిరుడు దేశవ్యాప్త లాక్‌డౌన్‌ సమయంలో ఎనిమిది కోట్లమంది వలస కూలీలకు తిండిగింజల సరఫరాను తలపెట్టగా, వారిలో నికరంగా అందుకున్నది 2.14కోట్ల మందేనని ఏడాది క్రితం లెక్కతేలింది. గరీబ్‌ కల్యాణ్‌దీ తరతమ భేదాలతో అదే కథ అన్న విశ్లేషణలు, ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులకు చేరాల్సిన బియ్యం ఆఫ్రికా మలేసియాలకు అక్రమంగా రవాణా అవుతోందన్న కథనాలు- పూడ్చాల్సిన కంతలెన్నో ఉన్నాయని చాటుతున్నాయి. సరైన దిద్దుబాటు చర్యలు చేపట్టకుండా గరీబ్‌ కల్యాణ్‌ యోజనను పొడిగించుకుంటూ పోతున్నందువల్ల- అధికారిక గణాంకాలకు, వాస్తవిక లబ్ధిదారుల సంఖ్యకు మధ్య పోనుపోను అంతరం విస్తరిస్తోంది!

సాధారణ స్థితిగతులు ఎప్పటికో..!

సామాజిక ఆర్థిక రంగాలను కొవిడ్‌ మహా సంక్షోభం చావుదెబ్బ తీసింది. మహమ్మారి వైరస్‌ విజృంభణ పుణ్యమా అని, దేశంలో కొత్తగా 23 కోట్ల మందికి పైగా దుర్భర దారిద్య్రంలో కూరుకుపోయారని అజీమ్‌ ప్రేమ్‌జీ విశ్వవిద్యాలయ సమగ్ర అధ్యయనం వెల్లడించింది. మే నెలలో నిరుద్యోగిత రేటు 11.9 శాతానికి ఎగబాకినట్లు భారత ఆర్థిక పర్యవేక్షక కేంద్రం(సీఎమ్‌ఐఈ) మదింపు వేసింది. నష్టతీవ్రత పార్శ్వాలు బహిర్గతమయ్యేకొద్దీ మళ్ళీ ఎప్పటికి సాధారణ స్థితిగతుల పునరుద్ధరణ సాధ్యపడుతుందోనన్న భయానుమానాలు ముప్పిరిగొంటున్నాయి. దేశంలో 6.3 కోట్ల దాకా సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు నెలకొని ఉండగా కేంద్ర పూచీకత్తుపై అత్యవసర రుణ వసతి గరిష్ఠంగా 45 లక్షల యూనిట్లకు పరిమితమైనట్లు కేంద్రమే ప్రకటించింది. ప్రత్యేక ప్యాకేజీ అక్కరకు రాని చుట్టమై అసంఖ్యాకంగా లఘు పరిశ్రమలు ఛిన్నాభిన్నమై లెక్కకు మిక్కిలి కుటుంబాలు వీధిన పడ్డాయి.

రేషన్​కార్డులతో నిమిత్తం లేకుండా..

మునుపెన్నడూ ఎరుగనంతగా పరిస్థితి దిగజారిన దృష్ట్యా- రేషన్‌కార్డుతో నిమిత్తం లేకుండా నిత్యావసరాల పంపిణీ చేపట్టాలని నిరుడు మే నెలలోనే తెలంగాణ ఉన్నత న్యాయస్థానం సూచించింది. స్వస్థలాలకు చేరే దారి కానరాక వివిధ ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మికులకు ఉచిత రేషన్‌ ఇవ్వాల్సిందిగా మొన్నీమధ్య సుప్రీంకోర్టూ ప్రభుత్వాలకు నిర్దేశించింది. 'శతాబ్ది సంక్షోభం' యావత్‌ జాతిని, దేశదేశాలను కుదిపేస్తున్న తరుణమిది. ఈ దశలో రేషన్‌కార్డు ఉందా లేదా, ఏ ప్రాంతీయులన్న విచికిత్సలతో నిమిత్తం లేకుండా అన్నార్తులందరి ఆకలి తీర్చేలా ప్రభుత్వ విధివిధానాలను మానవీయంగా ప్రక్షాళించాలి. దారిద్య్రరేఖ, ఆహారభద్రత నిర్వచనాల్ని మార్చి పౌష్టికాహారాన్నీ ఆ పరిధిలో చేర్చే సంస్కరణలు- ఎఫ్‌సీఐ గోదాముల్లో పేరుకుపోయిన నిల్వల సద్వినియోగానికి దోహదపడతాయి. ఆ మార్పు సత్వరం సాకారమైతేనే సంక్షోభం ఉపశమించి స్వస్థ భారతావనికి మేలుబాటలు పడతాయి!

ఇదీ చూడండి: వ్యాక్సిన్ల అనిశ్చితి కేంద్రం పుణ్యమే

ఇదీ చూడండి: కోరసాచిన ఆకలి రక్కసి- పస్తులతో అల్లాడుతున్న పేదలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.