ETV Bharat / opinion

కరోనా వేళ సాంక్రామిక వ్యాధుల విజృంభణ

author img

By

Published : Aug 20, 2020, 7:19 AM IST

సాంక్రామిక, సాంక్రామికేతర వ్యాధులతో ఏటా కోట్లమంది ప్రజల తలరాతలు చెదిరిపోతున్న దేశంలో ఆరోగ్య రంగానికి కాయకల్ప చికిత్స చేయడంలో జాప్యం అయ్యే కొద్దీ అనర్థం తప్పదు. సమధిక నిధులతో, వ్యక్తి స్థాయి ఏమిటన్న దానితో నిమిత్తం లేకుండా దేశమంతటా అందరికీ ఏకరీతి నాణ్యమైన వైద్య సేవలందించే బ్రిటన్‌ తరహా విధానం ఇక్కడా నెలకొనేదాకా ఈ వార్షిక సాంక్రామిక విషాదానికి అడ్డుకట్ట పడదు!

SEASONAL DISEASE
సాంక్రామిక వ్యాధుల విజృంభణ

కొవిడ్‌ ప్రజ్వలనంతో ఆస్పత్రులు, మహమ్మారి వైరస్‌ భీతితో ప్రజానీకం సంక్షుభిత వాతావరణంలో కూరుకుపోతున్నవేళ- సాంక్రామిక వ్యాధుల ముప్పుపై జాతిజనుల్ని ప్రధాని మోదీ తాజాగా హెచ్చరించారు. వానలతోపాటు విరుచుకుపడే సీజనల్‌ రోగాల విషయంలో అప్రమత్తంగా ఉండాలని పౌరులకు ఆయన పిలుపిచ్చారు. ఇప్పుడు దేశ రాజధాని దిల్లీలోనే కరోనా వైరస్‌కు సైదోడుగా డెంగీ, మలేరియా, చికున్‌ గన్యా, స్వైన్‌ఫ్లూ కేసులు విజృంభిస్తున్నాయి. రుతుపవనాల ప్రభావంతో వాతావరణం చల్లబడే జులై-సెప్టెంబర్‌ త్రైమాసికం వ్యాధుల ముసురుకు అనువైన కాలం. కలుషిత జలాల ద్వారా సంక్రమించే అతిసారం, కలరా, టైఫాయిడ్‌, హెపటైటెస్‌ కేసులు ఈ సీజన్‌లో దేశం నలుమూలలా పోటాపోటీగా రెచ్చిపోవడం పరిపాటి.

ఇప్పటికే 11 రాష్ట్రాల్ని వరదల బీభత్సం హడలెత్తిస్తోంది. పంటలకు, ప్రాణాలకు ఇదమిత్థంగా వాటిల్లిన నష్టమెంతో ఇంకా నిగ్గుతేలాల్సి ఉంది. ప్రవాహ ఉద్ధృతి తగ్గి వరద నీటిమట్టాలు ఉపశమించాక ముంపు ప్రాంతాల్ని విషజ్వరాలూ అంటురోగాలు కమ్మేసే పెనుముప్పు పొంచే ఉంది. సాధారణంగా వర్షాకాలంలో జూలు విదిల్చే మెదడువాపు, పచ్చకామెర్లు, డెంగీ, మలేరియా తదితరాల కట్టడి కోసం వైద్య ఆరోగ్య వ్యవస్థలు సన్నద్ధం కావాలని కొన్ని నెలల క్రితమే ప్రధానమంత్రి నిర్దేశించారు. జరిగిందేమిటి? వర్షాలకు మునుపే చురుకందుకోవాల్సిన దోమలపై పోరు, పరిసరాల పరిశుభ్రతా కార్యక్రమాలు చతికిలపడ్డాయి. కరోనాయేతర వ్యాధులు పెచ్చరిల్లకుండా తీసుకోవాల్సిన చర్యలకు ఆటంకాలు ఏర్పడ్డాయి. అధిక వర్షపాతం, చలి వాతావరణంలో కోరసాచే విషజ్వరాల నియంత్రణకు ఆరోగ్య యంత్రాంగం సిద్ధంగా లేని దశలో- సాంక్రామిక వ్యాధుల ముసురును చెదరగొట్టడం ప్రభుత్వాలకు గడ్డు సవాలే!

అర్హత లేని వైద్యులు..

స్వాస్థ్య సేవల లభ్యత, నాణ్యతల ప్రాతిపదికన అంతర్జాతీయ ర్యాంకింగుల్లో అట్టడుగు వరసకు పరిమితమైన ఇండియా, వైద్య పరమైన సవాళ్లు ఎదుర్కోవడంలో ఎంత దుర్బలమైనదో- కొవిడ్‌ సంక్షోభం సోదాహరణంగా చాటుతోంది. ఆక్సిజన్‌ సిలిండర్లు లేవని, నిపుణులైన సిబ్బంది లేరని ప్రాణాపాయ స్థితిలోని రోగుల్నీ కొన్ని జిల్లా ఆస్పత్రులు వెనక్కి పంపేస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. పరిధి, సిబ్బంది, వసతులు, కేటాయింపుల్లో వాటికన్నా చిన్న గీతలైన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల సంగతిక వేరే చెప్పేదేముంది? దేశంలో 30 శాతందాకా సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 32వేలకుపైగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఒక్క వైద్యుడితోనే నెట్టుకొస్తున్నాయి! ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు పలుచోట్ల సామాజిక, ప్రాంతీయ ఆస్పత్రుల్లో నాడి పట్టే నాథులు లేరు; లెక్కకు మిక్కిలి పీహెచ్‌సీలలో గాజుగుడ్డకు, జ్వరం మాత్రలకు సైతం నిత్యక్షామం వెక్కిరిస్తోంది. అల్లోపతీ డాక్టర్లలో సగం మందికిపైగా వైద్యపరమైన అర్హతలు లేనివారేనని కేంద్ర నివేదికలే వెల్లడిస్తున్నాయి.

బ్రిటన్ తరహా విధానం..

మౌలిక కంతల్ని పూడ్చకుండానే పీహెచ్‌సీలు, ఆరోగ్య ఉపకేంద్రాల్ని హెల్త్‌ వెల్‌నెస్‌ సెంటర్లుగా తీర్చిదిద్దుతామంటూ ఆరు నెలల కిందట కేంద్రం కొంత కసరత్తు చేసినా, చేరాల్సిన గమ్యం యోజనాల దూరాన ఉంది! కొవిడ్‌పై హరియాణా నిర్ణాయక పోరులో గురుగ్రామ్‌ ప్రాంత స్వాస్థ్య కేంద్రాల చురుకైన పాత్ర ఇటీవల పతాక శీర్షికలకు ఎక్కిరది. అటువంటి మెరుపులతోపాటు కేరళ, తమిళనాడు వంటిచోట్ల పేదరోగులకు తక్షణ వైద్యసేవలు, ఉచితంగా మందుల పంపిణీ లాంటివి అరుదైన ఉదాహరణలుగానే మిగిలిపోతున్నాయి. సాంక్రామిక, సాంక్రామికేతర వ్యాధుల ఉరవడిలో ఏటా కోట్లమంది ప్రజల తలరాతలు చెదిరిపోతున్న దేశంలో ఆరోగ్య రంగానికి కాయకల్ప చికిత్స చేయడంలో జాప్యం అయ్యేకొద్దీ అనర్థం తప్పదు. సమధిక నిధులతో, వ్యక్తి స్థాయి ఏమిటన్న దానితో నిమిత్తం లేకుండా దేశమంతటా అందరికీ ఏకరీతి నాణ్యమైన వైద్య సేవలందించే బ్రిటన్‌ తరహా విధానం ఇక్కడా నెలకొనేదాకా ఈ వార్షిక సాంక్రామిక విషాదానికి అడ్డుకట్ట పడదు!

ఇదీ చూడండి: 'మహా'లో కరోనా ఉగ్రరూపం-ఒక్కరోజే 13 వేల కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.