ETV Bharat / opinion

తగిన మూల్యం చెల్లించాల్సిందే!

author img

By

Published : Mar 1, 2021, 5:26 AM IST

INS to Google
తగిన మూల్యం చెల్లించాల్సిందే!

అనుచిత రీతిలో అప్పనంగా తమ శ్రమఫలాల్ని వినియోగించుకునే రోజులు పోయాయని, ఇకమీదట పొందే సేవలకు ప్రయోజనాలకు తగినంత మూల్యం చెల్లించాల్సిందేనని ఐఎన్‌ఎస్‌ (ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ) తాజాగా గూగుల్‌ సంస్థకు రాసిన లేఖలో స్పష్టీకరించింది!

సొమ్మొకరిది సోకొకరిది చందంగా ఇన్నేళ్లూ యథేచ్ఛగా పబ్బం గడుపుకొన్న సామాజిక మాధ్యమ దిగ్గజాలకు ఇప్పుడు చుక్కెదురవుతోంది. ఆస్ట్రేలియాలో, ఐరోపా సంఘం (ఈయూ)లో అనుభవమైన భంగపాటు దేశీయంగానూ పునరావృతమయ్యే సూచనలు ప్రస్ఫుటమవుతున్నాయి. అనుచిత రీతిలో అప్పనంగా తమ శ్రమఫలాల్ని వినియోగించుకునే రోజులు పోయాయని, ఇకమీదట పొందే సేవలకు ప్రయోజనాలకు తగినంత మూల్యం చెల్లించాల్సిందేనని ఐఎన్‌ఎస్‌ (ఇండియన్‌ న్యూస్‌పేపర్‌ సొసైటీ) తాజాగా గూగుల్‌ సంస్థకు రాసిన లేఖలో స్పష్టీకరించింది!

నిజం చెప్పులు తొడుక్కునేలోగా అబద్ధం భూమిని చుట్టివచ్చేస్తుందని నానుడి. ఆ తరహా అభూతకల్పనలు, ఊహాజనితాలు, మాయదారి వార్తల (ఫేక్‌ న్యూస్‌) బారిన పడే దుస్థితిని జనావళికి తప్పిస్తూ సువ్యవస్థిత యంత్రాంగంతో అనునిత్యం సమాచార యజ్ఞం కొనసాగించడమన్నది- పత్రికలు, ముద్రణ సంస్థలు నిష్ఠగా నిర్వహిస్తున్న బృహత్తర కర్తవ్యం. క్షేత్రస్థాయిలో పర్యటించి సమాచారం సేకరించడం, నిజానిజాలను క్షుణ్నంగా పరిశీలించి యథార్థమేమిటో నిర్ధారించుకోవడం, సాధికారికంగా వార్తాకథనాలు ప్రచురించడం... ఈ యావత్‌ ప్రక్రియ ఎన్నో వ్యయప్రయాసలతో కూడుకున్నది. విలేకరులు సంపాదకులు చిత్రకారులు కాలమిస్టులు ఇతరత్రా సిబ్బందికి జీతభత్యాలు చెల్లించి నిష్పాక్షిక, నిర్దుష్ట సమాచార వితరణ నిమిత్తం అహరహం శ్రమించేది పత్రికలు. తమకంటూ మౌలిక పాత్రికేయ వ్యవస్థ లేకుండానే పత్రికలూ ముద్రణ సంస్థలు సిద్ధపరచిన సమాచార రాశిని దొరకబుచ్చుకొని గూగుల్‌, ఫేస్‌బుక్‌ ఇన్నేళ్లూ ఇష్టారాజ్యంగా చలాయించుకున్నాయి. ఎడాపెడా ప్రకటనల రాబడినీ ఒడిసిపడుతున్న డిజిటల్‌ దిగ్గజాలు అందుకు సరైన మూల్యం చెల్లించాల్సిందేనన్న ఐఎన్‌ఎస్‌ డిమాండు నూటికి నూరుపాళ్లు హేతుబద్ధమైనది.

విశ్వవ్యాప్తంగా కొవిడ్‌ మహమ్మారి ఖడ్గప్రహారాల ధాటికి రెక్కలు తెగి విలవిల్లాడుతున్నవాటిలో పత్రికారంగమూ ఒకటి. ప్రకటనల రూపేణా ఆదాయానికి తూట్లు పడి ముద్రణ సంస్థలు కనీవినీ ఎరుగని సంక్షోభం ఎదుర్కొన్నాయి. అదే సమయంలో మునుపటి ఏడాదితో పోలిస్తే 2020లో ఫేస్‌బుక్‌ ఆర్జన 20శాతం మేర విస్తరించి 8600 కోట్ల డాలర్లకు ఎగబాకింది. గూగుల్‌ ఎకాయెకి 16200 కోట్ల డాలర్ల రెవిన్యూ కళ్లజూసింది. డిజిటల్‌ ప్రకటనలే వాటి ప్రధాన ఆదాయ వనరు. ఆన్‌లైన్‌ ప్రకటనల కోసం వెచ్చించే ప్రతి 100 డాలర్లలో గూగుల్‌ 53, ఫేస్‌బుక్‌ 28శాతం సంపాదిస్తుండగా- తక్కినవన్నీ మిగతా 19శాతాన్ని పంచుకుంటున్నాయి. శ్రమ ఒకరిది, దోపిడి మరొకరిది కావడం ఎంతటి దురన్యాయమో గుర్తించి ప్రపంచంలోనే మొట్టమొదటిసారి ఇటీవల చట్టనిబంధనలు తీర్చిదిద్దిన ఖ్యాతి ఆస్ట్రేలియాది. వార్తలకు తగిన మొత్తం చెల్లించేలా ప్రచురణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోని పక్షంలో స్థూలాదాయంలో 10శాతం జరిమానా వసూలుకు వీలుకల్పించే చట్టానికి తలొగ్గేది లేదని తొలుత ఠలాయించినా, కడకు అక్కడ గూగుల్‌ దిగిరాక తప్పలేదు. వార్తలు తీసుకున్నందుకు ఫేస్‌బుక్‌ తగినంత సొమ్ము చెల్లించాల్సిందేనన్న బాణీకి కెనడా సైతం ఓటేసింది. ఫ్రాన్స్‌లోనూ అదే కథ. అక్కడి ప్రభుత్వం తనవంతుగా 2019నాటి ఈయూ కాపీరైట్‌ నిబంధనల అమలుకు సిద్ధపడేసరికి వార్తల ప్రసారానికి కత్తెర వేసిన గూగుల్‌ అంతిమంగా దారికి వచ్చింది. ఇండియాలో అంతర్జాల, స్మార్ట్‌ఫోన్ల విప్లవానికి దీటుగా డిజిటల్‌ ప్రకటనల సంస్కృతీ ఇంతలంతలవుతోంది. వచ్చేఏడాదికి దేశీయంగా డిజిటల్‌ ప్రకటనల వ్యయం రూ.51వేలకోట్లకు పైబడుతుందని అంచనా. ప్రామాణిక సమాచార వనరులుగా అక్కరకొస్తున్న ముద్రణ మాధ్యమ సంస్థలకు అందులో సముచిత వాటా పంచే నమూనా భారత్‌లోనూ సత్వరం అమలులోకి వచ్చేలా ప్రభుత్వాలు గట్టి పూనిక వహించాలి!

ఇదీ చూడండి:'కొత్త నిబంధనలతో చిన్న కంపెనీలకు ఆర్థిక భారం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.