ETV Bharat / opinion

చైనా ఉత్పత్తులపై సదాలోచనే దిక్సూచి

author img

By

Published : Jun 22, 2020, 8:54 AM IST

సరిహద్దు ఘర్షణలో 20 మంది భారత జవాన్లు అమరులైన నేపథ్యంలో చైనాకు బుద్ధి చెప్పాలనే డిమాండ్లు వెల్లువెత్తతున్నాయి. చైనా ఉత్పత్తుల్ని ఆపేస్తే.. ఆ దేశంపై పరోక్షంగా ప్రతీకారం తీర్చుకోవచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే చైనా వస్తువుల ఉత్పత్తులు మన దేశ ఆర్థిక వ్యవస్థలో భాగమయ్యాయని సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమలంటున్నాయి. అలా చేస్తే ఎంఎస్​ఎంఈపై తీవ్ర ప్రభావం పడనుందని ఆ సమాఖ్యలు పేర్కొంటున్నాయి.

IF WE STOPPED CHINA PRODUCTS.. IT WILL BE EFFECTED ON THE MSME
చైనా ఉత్పత్తులపై సదాలోచనే దిక్సూచిగా..

గల్వాన్‌ లోయ తనదేనంటూ సరిహద్దులు మీరిన చైనా- ప్రతిఘటించిన భారత వీరజవాన్లు 20 మందిని పొట్టన పెట్టుకోవడంతో, ఆ దేశ వస్తూత్పాదనల్ని బహిష్కరించాలన్న డిమాండ్లు పోటెత్తుతున్నాయి. కరోనా సంక్షోభాన్ని సావకాశంగా మలచుకొని ఆత్మ నిర్భర్‌ భారత్‌ (స్వావలంబన భారతావని) లక్ష్యం సాధించాలన్న మోదీ ప్రభుత్వం- విపత్కర పరిస్థితుల్లో దేశీయ కంపెనీల్లో పెట్టుబడులు గుమ్మరించడం ద్వారా వాటిని గుప్పిట పట్టాలనే చైనా కౌటిల్యానికి కళ్ళెం వేసేలా గట్టి విధి నిషేధాల్ని ఇప్పటికే ప్రకటించింది. సరిహద్దుల్లో దుస్సాహసానికి ప్రతీకారంగా బీజింగ్‌నుంచి దిగుమతులపై భారీ సుంకాలు, ఇతరేతర కట్టడి చర్యలకు సంకల్పించిన సర్కారు- రైల్వేలు, బీఎస్‌ఎన్‌ఎల్‌ కాంట్రాక్టులపై చైనా నీడ పడరాదన్న సంకేతాలు ఇచ్చింది. ఏడు కోట్లమంది చిల్లర వర్తకులకు ప్రాతినిధ్యం వహించే 40వేల వర్తక సంఘాల సమాఖ్య- 450 కేటగిరీల కింద ఇండియాలోకి వచ్చిపడుతున్న మూడువేల చైనా ఉత్పత్తుల్ని బహిష్కరించాలని కోరుతోంది.

ఆర్థిక వ్యవస్థలో కీలకంగా మారిన చైనా..

2021 డిసెంబరునాటికి చైనాలో తయారైన వస్తువుల దిగుమతుల్ని లక్ష కోట్ల రూపాయలకు పరిమితం చేయాలన్న లక్ష్యాన్ని ప్రకటిస్తోంది. చైనా నుంచి వస్తూత్పత్తుల దిగుమతులు ఇప్పుడు రూ.5.25 లక్షల కోట్లు అంటే భారత ఆర్థిక వ్యవస్థలోకి డ్రాగన్‌ ఎంతగా చొచ్చుకుపోయిందో బోధపడుతుంది. ఆటబొమ్మలనుంచి జౌళి ఉత్పత్తుల దాకా, బల్క్‌ డ్రగ్స్‌ మొదలు సైకిళ్ల దాకా ‘మేడిన్‌ చైనా’ సరకు వచ్చిపడుతుంటే, దేశీయంగా సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ (ఎంఎస్‌ఎంఈ)ల ప్రయోజనాలు కొల్లబోతున్నాయని పార్లమెంటరీ స్థాయీ సంఘం రెండేళ్లనాడు మొత్తుకొంది. ఉన్నట్లుండి చైనా ఉత్పాదనల్ని బహిష్కరిస్తే ప్రస్తుత సంక్షోభంలో తాము మరింతగా చితికిపోతామన్న ఎంఎస్‌ఎంఈల ఆవేదన- క్షేత్రస్థాయి వాస్తవాలకు ప్రతిధ్వని.

'ఎంఎస్​ఎంఈ'ల సమాఖ్య ఏమంటోందంటే..

భారత్‌ చైనా ద్వైపాక్షిక దౌత్య బంధానికి డెబ్బయ్యో వార్షికోత్సవ సంవత్సరమిది. రెండు దేశాలూ కొత్త మైలు రాయి చెంత నిలబడి సరికొత్త అవకాశాల్ని అందిపుచ్చుకోనున్నాయని షి జిన్‌పింగ్‌ మొన్న ఏప్రిల్‌లో అభిలషించే నాటికే, చైనాతో 60 శాతం ద్వైపాక్షిక వాణిజ్య లోటు ఇండియాను వెక్కిరిస్తోంది. సరిహద్దు ఘర్షణల దరిమిలా ‘చైనా వస్తు బహిష్కారం’ కోరుతున్న గళాల్ని ఇండియా కట్టడి చేయాలంటున్న ‘గ్లోబల్‌ టైమ్స్‌’ వార్తా కథనాలు- తమ నాణ్యమైన చౌక ఉత్పాదనలను భారత్‌ వదులుకోలేదన్న ధీమా వ్యక్తపరుస్తున్నాయి. చైనాను కాదంటే రసాయనాలు, రంగులు, ఎలెక్ట్రానిక్‌ వస్తువులు, ముడి ఔషధాల దిగుమతి సంస్థలు దారుణంగా దెబ్బతింటాయని, దక్షిణ కొరియా, జపాన్‌, ఐరోపాలనుంచి దిగుమతులు చేసుకోవాలంటే 25-40 శాతం దాకా ఖర్చులు పెరిగి నష్టపోతామని ఎంఎస్‌ఎంఈల సమాఖ్య విన్నవిస్తోంది.

ఆపేస్తే పెరగనున్న ధరలు

ఇండియా దిగుమతుల్లో 14శాతం చైనానుంచి వస్తున్నవే కాగా, చైనా ఎగుమతుల్లో ఇండియా వాటా పట్టుమని రెండు శాతమంటేనే బోధపడుతుంది- ఎవరి మీద ఎవరు అధికంగా ఆధారపడుతున్నారన్నది! 1990 దాకా మూల ఔషధాల (ఏపీఐ) తయారీలో ఎంతో ముందున్న ఇండియా నేడు 80శాతం దాకా వాటిని చైనానుంచి దిగుమతి చేసుకొంటోంది. ఏపీఐ దిగుమతుల్ని ఆపేస్తే ఔషధ పరిశ్రమ ఇబ్బందులపాలు కావడమే కాదు, ధరలూ 40శాతం దాకా ఎగబాకుతాయన్న విశ్లేషణలున్నాయి. చైనానుంచి భారీగా వచ్చిపడుతున్న వాటిపై అధిక సుంకాలు వడ్డిద్దామంటే, ఇతర దేశాలనుంచి వాటిని సేకరించినా అదే తరహా సుంకాల మోత తప్పదంటున్నాయి డబ్ల్యూటీఓ నిబంధనలు! గతంలో జపాన్‌ వస్తు బహిష్కారానికి చైనా, ఫ్రెంచి వస్తువుల నిషేధానికి అమెరికా చేసిన ప్రయత్నాలు ఫలించలేదంటున్నాయి చారిత్రక అనుభవాలు. ఈ పరిస్థితుల్లో క్రమంగా దిగుమతుల్ని తగ్గించే దీర్ఘకాలిక ప్రణాళిక అమలు కావాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. ఆవేశంతో కాదు, సదాలోచనే దిక్సూచిగా ముందడుగేయాల్సిన సమయమిది!

ఇదీ చదవండి: భారత్​పై సైబర్ దాడులకు చైనా కుట్ర!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.