ETV Bharat / opinion

కరోనా వేళ ఇలా ఉంటే ఆనందం!

author img

By

Published : Jul 15, 2021, 7:12 AM IST

కరోనా మహమ్మారి ఎన్నో ఆనందాలను, ఆశలను, ప్రాణాలను తుడిచిపెట్టింది. అయినవారికి దూరంగా ఉంటూ పడే బాధే మాటల్లే చెప్పలేం. అయితే ఎన్నో ఒడుదొడుకులను వేల ఏళ్లుగా ఎదుర్కొంటూ వస్తున్న మానవాళి.. వాటిలాగే దీనిని కూడా జయిస్తుంది.

covid 19
కరోనా

ఎండిపోతే పండు, నీటి తడి లేకపోతే పంట రసవిహీనమవుతాయి. అలాగే మార్దవం కరవైపోతే మనుషులు సున్నితత్వాన్ని కోల్పోతారు. కరోనా వైరస్‌ సృష్టించిన భయోత్పాతం మానవాళి మనఃస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతోంది. భయం, ఆందోళన, దుఃఖం వంటి ఉద్వేగాలు.. ఎందరో మనోనిబ్బరం కోల్పోయేలా చేస్తున్నాయి. ఆర్థిక స్థితి క్షీణించడం, జీవనం కష్టమైపోవడంవంటివి మానసికంగా బలహీనపరుస్తున్నాయి. ఈ పరిస్థితులతో మానవ సంబంధాలు దెబ్బ తింటున్నాయి. ఎవరికి వారే జాగ్రత్త పడాల్సిన తరుణమిది.

అర్థం లేని ఆందోళన..

కరోనా మహమ్మారి పిల్లలు, పెద్దలు, పేదలు, ధనికులు అనే తేడా లేకుండా అందరినీ పీడిస్తోంది. కొందరిని కబళిస్తోంది. కొన్ని కుటుంబాలే విచ్ఛిన్నమయ్యే దుస్థితి దాపురించింది. ఆ మహమ్మారి బారిన పడకుండా అందరూ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మరోవైపు తీవ్ర ఆందోళనకు లోనవుతున్నారు. బాధలు కష్టాలను మరొకరికి చెప్పుకొంటే మనసు తేలిక అవుతుందంటారు. ప్రస్తుతం అందరిదీ ఒకే సమస్య కావడం వల్ల- చెప్పుకొనేందుకూ ఎవరూ లేని దుర్భర పరిస్థితి నెలకొంది. ఫలితంగా చాలామంది లోలోపలే మథనపడుతూ కుంగుబాటుకు లోనవుతున్నారు. కరోనా మహమ్మారి వ్యాపించేవరకు దానిపై ఎవరికీ ఎలాంటి అవగాహనా లేదు. ఇప్పటికీ వైరస్‌కు కచ్చితమైన మందు కనిపెట్టలేదు. దాన్ని నిరోధించడానికి కేవలం టీకా ఒక్కటే మనముందున్న ఆశాకిరణం. ఆ కార్యక్రమంలో తీవ్రంగా జాప్యం నెలకొంది. మరోవైపు చాలామంది వైరస్‌ గురించిన ఆధార రహిత భయాలకూ గురవుతున్నారు. ఇది మనసుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది.

పెరిగిన అభద్రతాభావం

చాలామంది నిరుద్యోగ సమస్యను అధిగమించడానికి చిరుద్యోగం, వ్యాపారం, ఏదో ఒక వృత్తి, స్వయం ఉపాధి లాంటి అనేక మార్గాల్లో వారి వారి తెలివి, సామర్థ్యాలకు తగినవిధంగా జీవనోపాధి కల్పించుకొంటున్నారు. నాలుగు రాళ్లు వెనకేసుకోలేకపోయినా, నాలుగు వేళ్లూ నోట్లోకి వెళతాయనే భరోసాతో ఉండేవారు. ఎవరిమీదా ఆధారపడకుండా బతకగలమనే ధీమా ఉండేది. కొద్దిగా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తే జీవితం పెద్దగా కష్టాలు లేకుండా సాగిపోయేది. కానీ ఏడాదిన్నరగా అన్ని రంగాలకూ వెన్నువిరిచి, దిక్కుతోచని స్థితిలోకి నెట్టేసిన కరోనా వల్ల దారులన్నీ మూసుకుపోతున్నాయి. ఉపాధి సాధించడం మాట అటుంచితే, రోజు గడవటమే గగనమవుతోంది. దాంతో జీవనానికే భరోసా లేని నిస్సహాయ స్థితిలోకి జారిపోతున్నారు. ప్రభుత్వోద్యోగుల నుంచి చిరుద్యోగుల వరకు, కార్మికుల నుంచి కర్షకుల వరకు ప్రతి ఒక్కరూ సమస్యలను ఎదుర్కొంటున్నారు. పైకి వ్యక్తం చేయకపోయినా చాలామంది మనసుల్లో గుబులు, నైరాశ్యం లాంటివి గూడు కట్టుకొని ఉన్నాయి. ఇప్పటికే అభద్రతాభావం చాలా వరకు పెచ్చరిల్లింది. అది జీవితాలనే అస్తవ్యస్తం చేసే ప్రమాదం ఉంది.

బంధాలకు దూరంగా..

కొవిడ్‌ మహమ్మారి అనుబంధాలను మసకబారుస్తోంది. గతంలో బంధుత్వాలు నిలబెట్టుకోవడానికి తాపత్రయపడేవారు. అవకాశం ఉన్నంతమేర రాకపోకలు సాగించేవారు. ఇప్పుడు జీవితానికే భరోసా లేకపోవడంవల్ల అలాంటి వాటిని పట్టించుకునే స్థితిని దాటిపోయారు చాలామంది. ఎలాంటి పరిణామాలు కలిగినా, ఎంత దగ్గరవారైనా ప్రత్యక్షంగా కలవడానికి జంకుతున్నారు. శుభ కార్యాల్లో పాల్గొనాలంటే భయపడుతున్నారు. ఫలితంగా బంధుత్వాలు, స్నేహాలు దూరమవుతున్నాయి. చిన్నారులది మరో రకమైన సమస్య. స్నేహాలు, ఆటలు, సరదాలు, సందళ్లు కోల్పోయి నిర్లిప్తంగా గడుపుతున్నారు. విద్యార్థులైతే బడిలో అభ్యసన ప్రక్రియకు దూరమవుతున్నారు. అన్ని వర్గాలవారికీ భవిష్యత్తు ఎలా ఉంటుందోననే ఆలోచనే!

వేచి చూద్దాం!

మహమ్మారి విజృంభణ మానవాళికి ఎన్నో పాఠాలు నేర్పిందనే చెప్పాలి. గతంలో పరిశుభ్రతకు ఏమాత్రం ప్రాధాన్యమివ్వని వారు సైతం ఇప్పుడు దానికి పెద్దపీట వేస్తున్నారు. భౌతికదూరం పాటించడం, ముఖమాస్కులు ధరించడం వంటివి జీవనశైలిలో గణనీయమైన మార్పులు తెచ్చాయి. ఈ పరిణామాలు భవిష్యత్తుపై ఆశలు కల్పించేవే. వేలాది ఏళ్లుగా ఎన్నో ఒడుదొడుకులను చవిచూసిన మానవాళి వాటన్నింటినీ అధిగమించింది. కాకపోతే ఇప్పుడు దాపురించిన మహమ్మారి సుదీర్ఘకాలంగా పంజా విసరుతోంది. ఎన్ని విపత్తులు వచ్చినా ప్రపంచం ఆగిపోదు. లోపాలను, లోటుపాట్లను, కష్టాలను, బాధలను అధిగమిస్తూ మానవాళి మున్ముందుకు వెళుతూనే ఉంది. ప్రస్తుత మహమ్మారి విజృంభణా అలాంటిదే. 'ఓర్చినమ్మకు తేటనీరు' అన్నట్లు కొంతకాలం ఓపిక వహిస్తే- మహమ్మారి పీడ విరగడై అందరూ హాయిగా ఉండే మంచిరోజులు తప్పక వస్తాయి. కొవిడ్‌ నిబంధనలను పూర్తిస్థాయిలో ఆచరిస్తూ మంచిరోజుల కోసం వేచి చూడాలి. మండు వేసవి ముగిసి, వర్షాకాలం వచ్చేదాకా మొక్కలు వాడిపోకుండా నీళ్లు చిలకరించినట్లు- మనసులోని ఆర్ద్రత పొడిబారిపోకుండా అప్పటివరకూ జాగ్రత్త వహించాలి!

- శార్వరీ శతభిషం

ఇదీ చూడండి: కరోనాను నివారించగల ఆయుర్వేద మూలికలివే..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.