ETV Bharat / opinion

ప్రాథమిక హక్కుపైనా ఉక్కుపాదం?

author img

By

Published : Dec 8, 2020, 6:16 AM IST

ప్రేమ పేరిట హిందూ యువతులను వివాహం చేసుకొని మత మార్పిడులకు పాల్పడటాన్ని 'లవ్‌ జిహాద్‌'గా పరిగణిస్తోంది ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం. ఈ నేపథ్యంలో వీటిని అడ్డుకోవడానికి ఓ ఆర్డినెన్స్​ తెచ్చింది. దీని సాయంతో మతాలు వేరన్న కారణంగా పెద్దల అభీష్టంతో జరిగే వివాహాల్నీ నిలువరిస్తోంది. తాము ఎవరిని పెళ్ళి చేసుకోవాలో నిర్ణయించుకొనే ప్రాథమిక హక్కు మేజర్‌ అయిన యువతీ యువకులకు ఉంది. కానీ, యూపీ ప్రభుత్వం తాజా ఆర్డినెన్స్​తో ఆ హక్కుపై ఉక్కుపాదం మోపుతోంది.

eenadu editorial about uttar pradesh new ordinance against love jihad
ప్రాథమిక హక్కుపైనా ఉక్కుపాదం?

ప్రేమే నేరమౌనా అన్న ప్రశ్న ఇండియా గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించిన ఏడు దశాబ్దాల తరవాత తెరపైకొస్తోంది. ప్రేమ పేరిట హిందూ యువతులపై మాయ వలలు విసరి వివాహం చేసుకొని మత మార్పిడులకు పాల్పడటాన్ని 'లవ్‌ జిహాద్‌'గా పరిగణిస్తున్న ఉత్తర్‌ ప్రదేశ్‌ ప్రభుత్వం- ఆ అరాచకాన్ని అడ్డుకోవడానికంటూ తాజాగా ఆర్డినెన్స్‌ తెచ్చింది. మత మార్పిడి నిరోధక చట్టాలు ఇప్పటికే ఒడిశా, ఎంపీ, ఛత్తీస్‌గఢ్‌, అరుణాచల్‌ప్రదేశ్‌, గుజరాత్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, ఝార్ఖండ్‌, ఉత్తరాఖండ్‌ రాష్ట్రాల్లో అమలులో ఉన్నాయి. బలవంతంగానో, ప్రలోభ పెట్టో, మోసపూరితంగానో మత మార్పిడులకు పాల్పడితే శిక్షించాలంటున్న ఆయా రాష్ట్రాల చట్టాలకు అదనంగా పెళ్ళి పేరిట ముగ్గులోకి దింపడాన్నీ యూపీ శాసనం శిక్షార్హ నేరమంటోంది.

అందులో సందేహం లేదు..

జస్టిస్‌ మిట్టల్‌ సారథ్యంలోని రాష్ట్ర న్యాయ సంఘం నిరుడు నవంబరులో సమర్పించిన నివేదిక మేరకే తాజా అత్యవసరాదేశం జారీ అయిందంటున్నా ఆ తరహా చట్టాన్ని కట్టుదిట్టంగా అమల్లోకి తీసుకురావాలన్న యోగి ఆదిత్యనాథ్‌ అభీష్టం, ఆయన హిందూ యువ వాహిని అధినేతగా ఉన్నప్పటిది! మత మార్పిడి చేసుకోవాలనుకొన్న వారెవరైనా రెండు నెలలముందే జిల్లా మేజిస్ట్రేట్‌కు నివేదించాలని కొత్త శాసనం నిర్దేశిస్తోంది. చట్ట విరుద్ధంగా మత మార్పిడి కోసమే పెళ్ళి చేసుకొన్నా, పెళ్ళికి ముందు లేదా తరవాత అమ్మాయి మతాన్ని మార్చినా ఆ వివాహం చెల్లబోదనీ యూపీ శాసనం చెబుతోంది. తనకు ఇష్టమైన వ్యక్తిని పెళ్ళి చేసుకొనేందుకు పౌరులకు గల హక్కు రాజ్యాంగంలోని 21వ అధికరణ పరిధిలోనిదంటూ 2018లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును యూపీ శాసనం కాలదన్నుతోందనడంలో సందేహం లేదు. కాబట్టే- జీవిత భాగస్వామిని ఎంచుకొనే స్వేచ్ఛను, వ్యక్తి గౌరవాన్ని యూపీ ఆర్డినెన్స్‌ తొక్కిపడుతోందని జస్టిస్‌ మదన్‌ లోకూర్‌ తీవ్రంగా నిరసిస్తున్నారు!

ఉద్రిక్తతలు పెచ్చరిల్లే పరిస్థితుల్లో..

భిన్న మతావలంబకుల కదంబమైన భారతావనిలో మత ప్రచారంపై రాజ్యాంగ నిర్ణయ సభలో పెద్ద చర్చే జరిగింది. క్రైస్తవుల అభ్యర్థన మేరకు మత ప్రచారానికి అనుమతిస్తూనే- మత మార్పిడులను నిషేధించే అంశాన్ని రాజ్యాంగంలో చేర్చకుండా శాసనసభల విచక్షణకు వదిలేసి, మత ప్రచారం వల్ల శాంతి భద్రతలు, నీతి నియమాలకు భంగం వాటిల్లరాదన్న నిర్దేశాలు వెలువడ్డాయి. 1967, 68 సంవత్సరాల్లో మత మార్పిడుల నిషేధ చట్టాల్ని ఒడిశా, మధ్యప్రదేశ్‌లు చేయగా 1977లో సుప్రీంకోర్టు వాటిని సమర్థించింది. సమాజంలో ఉద్రిక్తతలు పెచ్చరిల్లే పరిస్థితుల్లో వాటిని నిషేధించే హక్కు ప్రభుత్వాలకు ఉందనీ నాడు స్పష్టీకరించింది. దేశవ్యాప్తంగా ఏటా 36వేలకుపైగా మతాంతర వివాహాలు జరుగుతుంటే అందులో దాదాపు ఆరోవంతు యూపీలోనే సాగుతున్నాయి. ఆయా వివాహాలవల్ల సామాజిక ఉద్రిక్తతలు పెచ్చరిల్లిన నిదర్శనలు యూపీలో లేనేలేవన్న నిజానికి అక్కడి ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) నివేదికే అద్దంపట్టింది.

అది ప్రాథమిక హక్కే..

మోసపూరితంగానో, బలవంతంగానో మతమార్పిడులు జరిగితే నిరోధించాల్సిందేగాని- మతాలు వేరన్న కారణంగా పెద్దల అభీష్టంతో జరిగే వివాహాల్నీ నిలువరించేలా కరకు శాసనాలు చేయడమే ఆందోళన కారకమవుతోంది. వేరే మత విశ్వాసాన్ని అంగీకరించి తనంతట తానుగా మతం మారడం అన్నది 25వ అధికరణ కింద ప్రాథమిక హక్కేనన్న న్యాయపాలిక- తాము ఎవరిని పెళ్ళి చేసుకోవాలో నిర్ణయించుకొనే ప్రాథమిక హక్కు మేజర్‌ అయిన యువతీ యువకులకు ఉందని పలు సందర్భాల్లో నొక్కి వక్కాణించింది. పౌరుల ప్రాథమిక హక్కుల్ని సవరించే హక్కు చట్టసభలకు లేదంటూ యూపీ ప్రభుత్వ నిర్వాకంపై సుప్రీంకోర్టులో ప్రజాహిత వ్యాజ్యం దాఖలైంది. నెల రోజుల వ్యవధిలో 125కుపైగా కుల, మతాంతర వివాహ జంటలకు అలహాబాద్‌ హైకోర్టు రక్షణ కల్పించిన నేపథ్యంలో- దుందుడుకు లవ్‌ జిహాద్‌ శాసనాలపైనా న్యాయపాలికే సరైన తీర్పరి కావాలి!

ఇదీ చూడండి:సంకెళ్లలో మూడు దశాబ్దాల ఎన్‌సీడబ్ల్యూ చట్టం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.