ETV Bharat / opinion

బలహీన పడుతున్న ఆనకట్టలు

author img

By

Published : Mar 11, 2021, 6:51 AM IST

గాలిలో కాలుష్యం, వాతావరణంలో మార్పుల వల్ల ఆనకట్టల ఆయుర్దాయంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. డ్యామ్‌ నిర్మాణానికి వాడిన ఉక్కు, కాంక్రీటు వంటివి పాతబడిపోయి, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతూ ప్రజా భద్రతకు పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడినప్పుడు వాటిని కూల్చివేసి నదుల సహజ ప్రవాహగతిని పునరుద్ధరించక తప్పదు. మన ఆనకట్టల్లో బలహీనమైనవాటిని గుర్తించి వాటిని కూల్చివేయడానికి ప్రణాళికాబద్ధంగా కదలాలి. ఈ కృషిలో ఆనకట్ట ప్రాంత ప్రజలను, పౌర సంఘాలను కలుపుకొని పోవాలి.

eenadu editorial about old dams in india
బలహీన పడుతున్న ఆనకట్టలు

ఇటీవల ఒక హిమనదం విరిగిపడి ఉత్తరాఖండ్‌లో రెండు జలవిద్యుత్‌ ప్రాజెక్టులకు తీవ్ర నష్టం సంభవించడం చూశాం. 2018లో ఉన్నపళాన వరద నీరు వచ్చిపడి కేరళలో 126 ఏళ్లనాటి ముళ్లపెరియార్‌ ఆనకట్ట కుప్పకూలిపోతుందేమోనని ప్రజలు బెంబేలెత్తారు. 2009లో కృష్ణానదికి 100 ఏళ్లలో ఎన్నడూ లేనంత భారీ వరద వచ్చి శ్రీశైలం ఆనకట్ట భద్రతపై భయాందోళనలు రేగిన సంగతి గుర్తుండే ఉంటుంది. వాతావరణ మార్పులకు తోడు ఆనకట్టలు పాతబడిపోవడం వల్ల ప్రపంచంలోని 58,700 భారీ ఆనకట్టలలో అత్యధికం ప్రమాదపుటంచుకు చేరాయని ఐక్యరాజ్యసమితి విశ్వవిద్యాలయానికి చెందిన నీరు, పర్యావరణం, ఆరోగ్య వ్యవహారాల పరిశోధన సంస్థ నివేదిక ఇటీవల హెచ్చరించింది.

సగటు వయసు 42 ఏళ్లు..

ప్రపంచంలోని భారీ ఆనకట్టలలో 55 శాతం (32,716) చైనా, భారత్‌, జపాన్‌, దక్షిణ కొరియాలలోనే ఉన్నాయి. వీటిలో చాలా ఆనకట్టల వయసు త్వరలోనే 50 ఏళ్లకు మించిపోనుంది. ప్రస్తుతానికి భారతీయ డ్యామ్‌ల సగటు వయసు 42 ఏళ్లు. కేంద్ర జల సంఘం గణాంకాల ప్రకారం భారత్‌లో 2019 నాటికి 5,334 భారీ ఆనకట్టలు ఉండగా- కొత్తగా 411 నిర్మాణంలో ఉన్నాయి. వీటిలో 1,115 భారీ ఆనకట్టల వయసు 2025నాటికి 50 ఏళ్లకు చేరుతుంది. 4,250 ఆనకట్టల వయసు 2050 నాటికి 50 ఏళ్లు పూర్తయితే, 64 భారీ ఆనకట్టలు 150 ఏళ్లు పూర్తి చేసుకుంటాయి. ఈ భారీ ఆనకట్టలకు తోడు వేలాది చిన్న ఆనకట్టలూ ఉన్నాయి. వీటన్నింటినీ ఎప్పటికప్పుడు నిర్వహణ లోపాలు లేకుండా భద్రంగా కాపాడుకోవాలి. ఈ డ్యామ్‌లపై వాతావరణ మార్పులు చూపే ప్రభావాన్ని గమనించుకుంటూ క్రమం తప్పకుండా తనిఖీలు, మరమ్మతుల వంటి నివారణ చర్యలు తీసుకోవాలి. పర్యావరణానికి, పరిసర జీవరాశులకు ముప్పు వాటిల్లకుండా అరికట్టాలి.

ప్రతికూల ప్రభావం
పకడ్బందీగా కట్టిన డ్యామ్‌లు 100 ఏళ్లపాటు నిలిచి ఉండగలవు కానీ, అత్యధిక ఆనకట్టలు 50 ఏళ్ల తరవాత నుంచి పాతబడిపోవడం ప్రారంభిస్తాయి. గాలిలో కాలుష్యం, వాతావరణంలో మార్పుల వల్ల వాటి ఆయుర్దాయంపై ప్రతికూల ప్రభావం పడుతోంది. డ్యామ్‌ నిర్మాణానికి వాడిన ఉక్కు, కాంక్రీటు వంటివి పాతబడిపోయి, నిర్వహణ ఖర్చులు పెరిగిపోతూ ప్రజా భద్రతకు పర్యావరణానికి ముప్పు వాటిల్లే ప్రమాదం ఏర్పడినప్పుడు డ్యామ్‌లను కూల్చివేసి నదుల సహజ ప్రవాహగతిని పునరుద్ధరించక తప్పదు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుని అమెరికా, ఐరోపాలలో పెద్ద సంఖ్యలో పాత ఆనకట్టలను కూల్చివేస్తున్నారు. అమెరికాలోని 90,580 చిన్నాపెద్ద ఆనకట్టల సగటు వయసు 56 ఏళ్లు. 2020నాటికి అమెరికా డ్యామ్‌లలో 85 శాతానికి జీవిత కాలం తీరిపోయింది. అమెరికాలో కుప్పకూలిన ఆనకట్టల్లో 75 శాతం 50 ఏళ్ల క్రితం కట్టినవి. పాతబడిన ఆనకట్టలు కూలితే జరిగే నష్టం అంతా ఇంతా కాదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని అమెరికాలో గడచిన 30 ఏళ్లలో 1,275 ఆనకట్టలను కూల్చివేశారు. ఒక్క 2017లోనే 80 డ్యామ్‌లను తొలగించారు.

అదో పెద్ద అపచారంగా..

భారత్‌లో ఆనకట్టల కూల్చివేత యోచననే పెద్ద అపచారంగా పరిగణిస్తున్నారు. కానీ, మన డ్యామ్‌ల వయసు 50-60 ఏళ్లకు మించినప్పుడు వాటిని కొనసాగించే విషయాన్ని సమీక్షించాల్సి వస్తుంది. కేరళలో 126 ఏళ్ల ముళ్లపెరియార్‌ ఆనకట్టను కూల్చివేయడమే ఉత్తమమని నిపుణులు తీర్మానిస్తున్నా, రాజకీయ కారణాలు అడ్డు వస్తున్నాయి. ఈ ఉమ్మడి డ్యామ్‌ను తొలగించడం తమకు నష్టమని తమిళనాడు మోకాలడ్డుతోంది. డ్యామ్‌ కూలితే నది దిగువన నివసించే 35 లక్షల మంది జీవితాలు తలకిందులవుతాయని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ముళ్లపెరియార్‌ డ్యామ్‌ను సున్నపురాయి, కాల్చిన ఇటుకల పొడితో కట్టారు. నిర్మాణంతోపాటు నిర్వహణలోనూ లోపాలున్నాయి. పైపెచ్చు భూకంప ప్రమాదం ఉన్న ప్రదేశంలో నిర్మించారు.

ఉత్తరాఖండ్‌లో భూకంప ప్రమాదం ఉన్న ప్రదేశంలో నిర్మించిన తెహ్రీ డ్యామ్‌కు అప్పుడే పగుళ్లు పడ్డాయి. ఈ ముప్పులను గుర్తెరగకుండా ఉత్తరాఖండ్‌లో 17 పెద్ద జల విద్యుత్‌ ప్రాజెక్టులను నిర్మిస్తున్నారు. డజన్ల కొద్దీ చిన్న ప్రాజెక్టులూ నిర్మాణంలో ఉన్నాయి. భూతాపం వల్ల హిమాలయాల్లో హిమనదాలు కరిగిపోవడం ఎక్కువైపోతున్నందువల్ల ఈ ప్రాజెక్టులకు ఏ రోజైనా ముప్పు వాటిల్లవచ్చు. మహారాష్ట్రలో కోయ్‌నా, వర్నా డ్యామ్‌లు కూడా భూకంపం ముప్పు ఉన్న ప్రాంతాల్లోనే నిర్మితమయ్యాయి. 1967లో వచ్చిన భూకంపం కోయ్‌నా ఆనకట్టకు తీవ్ర నష్టం కలిగించింది.

ప్రణాళికాబద్ధంగా కదలాలి..
భారత్‌లోని ప్రధాన ఆనకట్టల్లో అత్యధికం కాంక్రీటుతో కాకుండా మట్టి పొరలతో నిర్మించినవి కావడం వల్ల వాటి జీవితకాలం వేగంగా తరిగిపోతోంది. అనేక దేశాల్లో మాదిరిగా భారత్‌లో సంవత్సరమంతటా వర్షాలు కురవవు. వర్షాకాల సీజనులో కొన్ని నెలల్లోనే అత్యధిక వానలు కురుస్తాయి. కొన్ని సందర్భాల్లో ఆకాశానికి చిల్లు పడినట్లు కుండపోతగా వర్షాలు కురిసి నదులకు భారీ వరదలు వస్తాయి. 2009లో కృష్ణ, తుంగభద్రలకు అతి భారీ వరదలు వచ్చి శ్రీశైలం డ్యామ్‌ భద్రతపై ఆందోళన చెలరేగింది. అదీకాకుండా ఏళ్లతరబడి ఒండ్రు మట్టి, శిథిల పదార్థాలు కొట్టుకువచ్చి దేశమంతటా రిజర్వాయర్లలో పూడిక ఏర్పడుతోంది. దీనివల్ల శ్రీశైలం డ్యామ్‌ నీటి నిల్వ సామర్థ్యం తగ్గిపోయినట్లు కేంద్ర జల సంఘం తేల్చింది.

మన డ్యామ్‌లకు పగుళ్లు ఏర్పడకపోయినా- ఆక్రమణలు, వరద ఉద్ధృతి వల్ల నది కరకట్టలకు కోతపడుతూ ప్రవాహగతికి దిగువన ఉన్న ఇళ్లు, ఊళ్లు మునిగిపోయి ప్రజలు ఇక్కట్లు పాలవుతున్నారు. నిజానికి భారతీయ ఆనకట్టలకు ఐక్యరాజ్యసమితి నివేదిక చెబుతున్నదానికన్నా ఎక్కువగానే నష్టం జరిగిందని నిపుణుల అంచనా. మన ఆనకట్టల్లో బలహీనమైనవాటిని గుర్తించి వాటిని కూల్చివేయడానికి ప్రణాళికాబద్ధంగా కదలాలి. ఈ కృషిలో ఆనకట్ట ప్రాంత ప్రజలను, పౌర సంఘాలను కలుపుకొని పోవాలి. భారీ డ్యామ్‌ల వల్ల జరిగే పర్యావరణ, సామాజిక నష్టాలను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయ నీటి నిల్వ పద్ధతులను చేపట్టాలి. జలవిద్యుత్తుపై ఆధారపడటం తగ్గించి పవన, సౌర తదితర సంప్రదాయేతర వనరులతో విద్యుదుత్పాదనకు ప్రాధాన్యమివ్వాలి.

క్షీణత అనివార్యం

ప్రపంచంలోని భారీ ఆనకట్టల్లో 93 శాతం కేవలం 25 దేశాల్లోనే ఉన్నాయి. ఆసియా, ఐరోపా, ఉత్తర అమెరికాలలో భారీ ఆనకట్టల నిర్మాణం 1960లు, 70ల వరకు, ఆఫ్రికాలో 1980ల వరకు సాగి, ఆ తరవాతి నుంచి నెమ్మదించింది. బడా ఆనకట్టల నిర్మాణానికి అనువైన ప్రదేశాలు తరిగిపోవడం, 50 శాతం ప్రపంచ నదులపై ఇప్పటికే ఆనకట్టల నిర్మాణం పూర్తవడం దీనికి కారణాలు. ప్రపంచవ్యాప్తంగా ఆనకట్టలు నిలిపి ఉంచిన నీటి పరిమాణం 7,000-8,300 ఘనపు కిలోమీటర్ల వరకు ఉంటుందని అంచనా. ఇంత జలరాశిని పట్టి నిలపగల శక్తి మానవ నిర్మాణాలకు క్రమక్రమంగా తగ్గిపోవడం అనివార్యం. ప్రపంచ ఆనకట్టల వయసు ఇప్పటికే 50 ఏళ్లకు చేరడం వల్ల వాటి నీటి నిభాయింపు శక్తి క్షీణించక తప్పదు.

-ఆర్య

ఇదీ చూడండి:పర్యావరణహిత పురోభివృద్ధితోనే భవిత

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.