ETV Bharat / opinion

ఈసీ నియామకాల్లో ఇష్టారాజ్యం

author img

By

Published : Mar 15, 2021, 7:42 AM IST

ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధ్యుక్త ధర్మ నిర్వాహకుడైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు రాజ్యాంగం ప్రసాదించిన స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసే దుర్రాజకీయాలకు పాల్పడటం ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది. అలాంటి నైతిక నిష్ఠాగరిష్ఠుల్ని ఎంపిక చేసేందుకు ప్రత్యేక యంత్రాంగమే కొరవడిన దేశంలో- అధికార పార్టీ ఇష్టాయిష్టాలే కొలబద్దగా ఎన్నికల సంఘాల్లో అస్మదీయులు తిష్ఠవేసే ధోరణి పాతుకుపోయింది. ఎన్నికల పట్ల కొడిగట్టి పోతున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలంటే అవ్యవస్థను సాంతం ప్రక్షాళించాలి.

government involvement appointment of election commissioner
ఈసీ నియామకాల్లో ఇష్టారాజ్యం

ప్రజాస్వామ్య మేరునగంగా వాసికెక్కిన ఇండియాలో ఎన్నికలంటే- అక్షరాలా మహా కుంభమేళా! నియమబద్ధంగా భక్తిప్రపత్తులతో సాగాల్సిన ఆ పవిత్ర క్రతువును సమస్త విలువల్నీ బలి ఇచ్చే జనస్వామ్య జాతరగా మార్చేసింది- నయా రాజకీయ దందా! శేషన్‌ కాలం నాటికే దశ మహా పాతకాల ముట్టడిలో ఎన్నికలు ఎంతగానో నెత్తురోడుతున్నా దీటైన దిద్దుబాటు చర్యలే కొరవడ్డాయి. పర్యవసానంగానే ఎకాయెకి ఎన్నికల కమిషన్‌ నియామకాల్లోకీ దుర్రాజకీయాలు చొరబడ్డాయి.

స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసే

న్యాయశాఖ కార్యదర్శికి ఎన్నికల కమిషనర్‌గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ గోవా ప్రభుత్వం చేసిన నిర్ణయాన్ని అడ్డంగా కొట్టేస్తూ 'సుప్రీం' త్రిసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు ఎంతో విలువైనది. స్వేచ్ఛగా, సక్రమంగా ఎన్నికల నిర్వహణలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కూ కేంద్ర ఎన్నికల సంఘానికి గల అధికారాలే ఉంటాయని సుప్రీంకోర్టు లోగడ పలుమార్లు స్పష్టీకరించింది. పంచాయతీ, పురపాలిక ఎన్నికల ద్వారా పునాది స్థాయి ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే విధ్యుక్త ధర్మ నిర్వాహకుడైన రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌కు రాజ్యాంగం ప్రసాదించిన స్వతంత్ర ప్రతిపత్తిని దెబ్బతీసే దుర్రాజకీయాలు గజ్జెకట్టడం ఈ మధ్య కాలంలో మరీ ఎక్కువైంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో పదవుల్లో ఉన్నవారికి రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ బాధ్యతలు అప్పగించరాదన్న ధర్మాసనం- అలా జోడు పదవుల్లో ఉన్నవారు తక్షణం రాజీనామా చెయ్యాలనీ ఆదేశించింది.

ప్రజాస్వామ్యానికి మూలకందమైన ఎన్నికల్ని నిర్వహించే సమున్నత వ్యవస్థ స్వతంత్రతతో రాజీపడరాదన్న సుప్రీం స్ఫూర్తికి పట్టం కట్టాలంటే- రాష్ట్రాల నుంచి కేంద్రస్థాయి దాకా ఎలెక్షన్‌ కమిషనర్ల నియామక పోకడల్ని సాంతం సంస్కరించాలి. ఈసీల నియామకాంశం వివాదగ్రస్తం కాకుండా ప్రత్యేక యంత్రాంగం కొలువు తీరాలన్న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ అభిలాష నేటికీ నెరవేరక పోబట్టే- దుర్రాజకీయాలకు దొడ్డిదారి ఇప్పటికీ తెరిచే ఉంది!

అస్మదీయులు తిష్ఠవేసే ధోరణి
గుర్తింపు పొందిన రాజకీయ పక్షాలు తమ చుట్టూ ఒక వృత్తం గీస్తే బెసగకుండా నడిమధ్య నిలబడేదే స్వీయ రాజ్యాంగ నైతిక ధర్మమని నిర్వాచన్‌ సదన్‌ సారథిగా ఎంఎస్‌ గిల్‌ గతంలో ప్రకటించారు. అలాంటి నైతిక నిష్ఠాగరిష్ఠుల్ని ఎంపిక చేసేందుకు ప్రత్యేక యంత్రాంగమే కొరవడిన దేశంలో- అధికార పార్టీ ఇష్టాయిష్టాలే కొలబద్దగా ఎన్నికల సంఘాల్లో అస్మదీయులు తిష్ఠవేసే ధోరణి పాతుకుపోయింది. కేంద్ర ఎన్నికల ప్రధానాధికారి సహా కమిషనర్ల ఎంపికకు తక్కిన పక్షాల్ని సంప్రతించే యోచనగాని, కొలీజియం ఏర్పాటు ప్రతిపాదనగానీ లేవని కేంద్ర ప్రభుత్వం 2017లో పార్లమెంటుకు నివేదించింది. విశేషం ఏమిటంటే- ప్రస్తుత నియామక విధానం పక్షపాతానికి అవకతవకలకు తావిచ్చేదిగా ఉందంటూ 'కాగ్‌'తోపాటు ఈసీ పదవుల భర్తీలోనూ విపక్షాలకు ప్రాతినిధ్యం కల్పించాలని 2012 జూన్‌లో భాజపా గురువృద్ధుడు అడ్వాణీయే అప్పటి యూపీయే ప్రభుత్వాన్ని కోరారు.

సాంతం ప్రక్షాళించాలి..

కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌గా 2006లో టాండన్‌, 2009లో గోపాలస్వామి అదే తరహా సూచనలు చేయగా- 2015లో లా కమిషన్‌ సైతం ప్రధాన మంత్రి, విపక్ష నేత, భారత ప్రధాన న్యాయమూర్తితో ఏర్పడే కొలీజియం ఎన్నికల కమిషనర్ల నియామకాలు చేపట్టాలని సిఫార్సు చేసింది. ఎన్నికల కమిషనర్ల నియామకాల్లో పాలక పక్షం ఇష్టారాజ్యానికి వీలుండరాదన్నది ఎంత సహేతుకమో- పదే పదే ఆ ప్రక్రియ దుర్వినియోగమవుతున్న తీరే ధ్రువీకరిస్తోంది. కెనడాలో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ తీర్మానం ద్వారా నియమితులయ్యే ఎన్నికల ప్రధానాధికారి నేరుగా పార్లమెంటుకే జవాబుదారీ. అదే ఇండియాకూ అనుసరణీయ ఒరవడి! ఎన్నికల పట్ల కొడిగట్టి పోతున్న ప్రజల నమ్మకాన్ని నిలబెట్టాలంటే అవ్యవస్థను సాంతం ప్రక్షాళించాలి. స్వేచ్ఛగా సక్రమంగా విధ్యుక్త ధర్మాన్ని నిర్వర్తించే స్వతంత్ర ఎన్నికల కమిషనర్ల కోసం జల్లెడ పట్టే పటిష్ఠ యంత్రాంగాన్ని సత్వరం పాదుకొల్పాలి!

ఇదీ చూడండి:ఎల్లలు దాటుతున్న భారతీయుల నైపుణ్యం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.