ETV Bharat / opinion

ముంచుకొస్తున్న మాదక మహోత్పాతం!

author img

By

Published : Apr 10, 2021, 8:20 AM IST

తవ్వేకొద్దీ కంకాళాలు బయటపడుతున్న చందంగా- భారత్​లో ఇస్లామాబాద్‌ ప్రేరేపిత 'నార్కో టెర్రరిజం' ఆనవాళ్లు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. ఆ మధ్య 230 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలు పాక్‌నుంచి దేశంలోకి అక్రమంగా తరలుతూ గుజరాత్‌ జలాల్లో గస్తీ సిబ్బంది చేజిక్కడం- భిన్న మార్గాల్లో భారీయెత్తున మత్తు సరకు వచ్చిపడుతున్నదనడానికి ప్రబల దృష్టాంతం. మరోవైపు.. ఇతర దేశాల మాదక ద్రవ్య నియంత్రణ విభాగాలు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఉచ్చు బిగిస్తుండటం వల్ల- దక్షిణ అమెరికాలోని మత్తు వ్యవస్థలు భారత్‌వైపు దృష్టి సారిస్తున్నట్లు విశ్లేషణలు స్పష్టీకరిస్తున్నాయి. వాటి అజెండాను యథాతథంగా అమలు కానిస్తే, దేశానికి అంతకు మించిన పెను విపత్తు ఉండదు.

drugs mafia in india
ముంచుకొస్తున్న మాదక మహోత్పాతం!

భారత్‌, పాకిస్థాన్ల మధ్య దౌత్య సంబంధాల సాధారణీకరణకు తనవంతుగా దిల్లీ చేయాల్సింది ఎంతో ఉందంటూ ఓ పక్క ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ బడాయి ప్రకటనలు మోతెక్కుతున్నాయి. మరోవైపు, తవ్వేకొద్దీ కంకాళాలు బయటపడుతున్న చందంగా- ఇస్లామాబాద్‌ ప్రేరేపిత 'నార్కో టెర్రరిజం' ఆనవాళ్లు దిగ్భ్రాంతపరుస్తున్నాయి. సరిహద్దు భద్రతా దళం (బీఎస్‌ఎఫ్‌), పంజాబ్‌ పోలీసులు సంయుక్తంగా సాగించిన తాజా వేటలో హతమారిన 'పాకిస్థానీ స్మగ్లర్‌'వద్ద ఆయుధాలు, మందుగుండు, పాక్‌ కరెన్సీతోపాటు 22 కిలోల హెరాయిన్‌ సైతం దొరికింది.

గుట్టుగా చేరవేసే పన్నాగాలు..

పంజాబ్‌లోని ఖేమ్‌కరన్‌ సెక్టార్‌లో పట్టుబడిన ఇంకో పాక్‌ పౌరుడి దగ్గర దాదాపు 30 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు. నాలుగు నెలల క్రితం తూత్తుకుడి వద్ద భారతీయ గస్తీ దళానికి తారసపడిన లంక పడవలోని ఇంధన ట్యాంకులో వంద కిలోల మాదక ద్రవ్యాలు కరాచీనుంచి పంపినవేనని నిర్ధరణ అయింది. గత నెలలోనే అమృత్‌సర్‌ ప్రాంతంలో బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది నలుగురు పాకిస్థానీ డ్రగ్‌ స్మగ్లర్ల బాగోతాన్ని ధ్రువీకరించడం, సరిహద్దుల వెంబడి తరచూ ఆయుధాల్ని మాదక ద్రవ్యాల్ని గుట్టుగా చేరవేసే పన్నాగాల పరంపర.. పొరుగుదేశం నిజనైజాన్నే ప్రస్ఫుటం చేస్తున్నాయి.

ఆ మధ్య 230 కిలోలకు పైగా మాదక ద్రవ్యాలు పాక్‌నుంచి దేశంలోకి అక్రమంగా తరలుతూ గుజరాత్‌ జలాల్లో గస్తీ సిబ్బంది చేజిక్కడం- భిన్న మార్గాల్లో భారీయెత్తున మత్తు సరకు వచ్చిపడుతున్నదనడానికి ప్రబల దృష్టాంతం. ఈ యథార్థాల్ని కప్పిపుచ్చుతూ ఫలానా చోట ఒకరిద్దరు విజాతీయుల్ని అదుపులోకి తీసుకున్నామన్న ప్రకటనలతో, అక్కడికదే మహత్తర కర్తవ్య నిర్వహణగా మాదక ద్రవ్య నియంత్రణ సంస్థ (ఎన్‌సీబీ) పొద్దుపుచ్చడం- విచ్ఛిన్నశక్తులకు అయాచిత వరమవుతోంది!

వ్యవస్థాగత అలసత్వమే!

'పోనుపోను మత్తుకోసం ఇంతలంతలవుతున్న వెంపర్లాట విపణిలో గిరాకీని, తద్వారా సరఫరాను పెంచుతోంది. ఎడాపెడా అందుబాటులోకి వస్తున్న మాదక ద్రవ్యాలు మత్తుకు బానిసలైనవారి సంఖ్యను పెంచి డిమాండును మరింత ఎగదోస్తున్నాయి.'- ఇది, మాదకశక్తుల విస్తరణపై అంతర్జాతీయ డ్రగ్స్‌ నియంత్రణ సంస్థ ఏనాడో చేసిన వాస్తవిక విశ్లేషణ. ఆ సంక్షోభ తీవ్రతకు తగ్గట్లు వృత్తిపరమైన సన్నద్ధత ఎన్‌సీబీ, ఎక్సైజ్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌, పోలీస్‌ విభాగాల్లో కానరాకపోవడం- వ్యవస్థాగత అలసత్వాన్ని చాటుతోంది. వివిధ సందర్భాల్లో వాటిమధ్య కనీస సమన్వయమూ కొరవడటం వ్యూహలేమిని కళ్లకు కడుతోంది. వెలుపలి నుంచి భూరి సరఫరాల్ని నిరోధించడంలోనే కాదు- పొడి రూపేణా ఎఫిడ్రిన్‌కు విదేశాల్లో ఉన్న విపరీత గిరాకీ దృష్ట్యా దేశీయంగా పలు చోట్ల పెచ్చరిల్లుతున్న రహస్య ఉత్పత్తిని నిలువరించడంలోనూ వాటిది నికార్సయిన ఘోర వైఫల్యం!

ఉచ్చు బిగిస్తుండటం వల్ల

అఫ్ఘానిస్థాన్‌, మయన్మార్‌, కొలంబియా, మెక్సికో, పాకిస్థాన్లతోపాటు ఇండియానూ మాదక ద్రవ్య వాణిజ్య కూడలిగా అమెరికా ప్రభుత్వ నివేదిక గతంలో అభివర్ణించింది. ముంబయి మహానగరం కొకైన్‌ రాజధానిగా మారిందని ఇప్పుడు సాక్షాత్తు ఎన్‌సీబీయే అంగీకరిస్తోంది. అమెరికా డ్రగ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ ఏజెన్సీ, యూకే జాతీయ నేర విభాగం (ఎన్‌సీఏ), రాయల్‌ కెనడియన్‌ మౌంటెడ్‌ పోలీస్‌, ఆస్ట్రేలియా మాదక ద్రవ్య నియంత్రణ విభాగాలు ఎప్పటికప్పుడు ఎక్కడికక్కడ ఉచ్చు బిగిస్తుండటం వల్ల- దక్షిణ అమెరికాలోని మత్తు వ్యవస్థలు భారత్‌వైపు దృష్టి సారిస్తున్నట్లు విశ్లేషణలు స్పష్టీకరిస్తున్నాయి. వాటి అజెండాను యథాతథంగా అమలు కానిస్తే, దేశానికి అంతకు మించిన పెను విపత్తు ఉండదు. చుట్టుపక్కల దేశాలనుంచి డ్రోన్ల సాయంతోనూ దేశంలోకి డ్రగ్స్‌ సరఫరా ఉదంతాలు- క్రమేపీ మహోత్పాతం జాతిని చుట్టుముడుతోందనడానికి ప్రబల సంకేతాలు. యువశక్తిని నిర్వీర్యం చేస్తూ కోట్లాది జీవితాల్ని క్రూరంగా బలిగొంటున్న మాదక ఉగ్రవాదాన్ని ఇంకా ఉపేక్షించడం- జాతి భవితకే తీరని చేటు!

ఇదీ చూడండి:అసమానతల గుప్పిట వైద్యం విలవిల

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.