ETV Bharat / opinion

పట్టపగ్గాల్లేని నేర రాజకీయం- ఈసీ బాధ్యతేంటి?

author img

By

Published : Nov 17, 2020, 6:05 AM IST

నేర రాజకీయం పెరిగిన చోట, అభివృద్ధి ఉత్తమాట. గత అసెంబ్లీతో పోలిస్తే పదిశాతం అధికంగా బిహార్‌ శాసనసభ 68శాతం నేర చరితులతో లుకలుకలాడుతోంది. హత్యలు, కిడ్నాపులు, మహిళలపై అఘాయిత్యాల వంటి హేయ నేరాలకు పాల్పడినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న తాజా ఎమ్మెల్యేల సంఖ్య 51 శాతంగా రికార్డులకెక్కింది. అయితే తమ అభ్యర్థుల చరిత్రను తెలుసుకోవాల్సిన బాధ్యత ప్రజలకుంది. అదే సమయంలో వారి గురించి పూర్తి వివరాలు బయటపెట్టాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిది.

Editorial on increase of politicians with criminal records in Bihar elections
పట్టపగ్గాల్లేని నేర రాజకీయం- ఈసీ బాధ్యతేంటి?

పుట్టమీద కొడితే పాము చావదనడానికి గట్టి రుజువుగా నేరగ్రస్త బిహార్‌ రాజకీయ యవనిక నేడు కళ్లకు కడుతోంది. కొవిడ్‌ సంక్షోభ కాలంలో జరిగినందుకే కాదు- నేర రాజకీయాలకు చరమగీతం పాడే బాధ్యతను పార్టీలపైనా సుప్రీంకోర్టు పెట్టిన నేపథ్యంలో బిహార్‌ ఎలెక్షన్లు విలక్షణమైనవి. అభ్యర్థుల ఎంపికకు విజయావకాశం ఒక్కటే కొలబద్ద కారాదంటూ, పార్టీలు నేరగాళ్లకు టికెట్లిచ్చిన పక్షంలో ఎందుకలా చేయాల్సి వచ్చిందో కూడా అవి వివరించాలని న్యాయపాలిక ఫిబ్రవరి 13న స్పష్టీకరించింది. ఆ ఆదేశాల్ని పార్టీలు ఏ మాత్రం పట్టించుకోలేదనడానికి- మొత్తం 89శాతం నియోజకవర్గాల్లో ముగ్గురికి మించి నేరచరితులు పోటీపడటమే నిదర్శనం. 'బాహుబలి'గా పేరు మోసిన వాళ్లందర్నీ పోటీలుపడి మరీ బరిలోకి దించిన పార్టీలు- అమిత జనాదరణ, సామాజిక సేవ, విద్యార్హతలు, కొవిడ్‌ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో మేలిమి పనితీరుల్ని ప్రస్తావించి వాళ్లపై కేసులన్నీ రాజకీయ కక్షతో ప్రత్యర్థులు పెట్టినవని ముక్తాయించాయి. తమ అభ్యర్థుల గుణగణాల్ని ఏదో ఒక హిందీ వార్తా పత్రికలో ప్రచురించి, సుప్రీం ఆదేశాల్ని మొక్కుబడిగా పాటించాయి. పోలింగ్‌ తేదీకి ముందే ప్రచార ఘట్టంలో అభ్యర్థులు ముమ్మార్లు తమ నేరచరితల్ని ప్రసార మాధ్యమ ప్రకటనలుగా వెలువరించాలన్న ఈసీ ఆదేశాల స్ఫూర్తీ నీరుగారి పోయింది. ఫలితంగా గత అసెంబ్లీతో పోలిస్తే పదిశాతం అధికంగా బిహార్‌ శాసనసభ 68శాతం నేర చరితులతో లుకలుకలాడుతోంది. హత్యలు, కిడ్నాపులు, మహిళలపై అఘాయిత్యాల వంటి హేయ నేరాలకు పాల్పడినట్లుగా అభియోగాలు ఎదుర్కొంటున్న తాజా ఎమ్మెల్యేల సంఖ్య 51 శాతంగా రికార్డులకెక్కింది. ఆర్‌జేడీ సభ్యుల్లో 73శాతం, భాజపా కైవారంలో 64శాతం, జేడీ (యు)లోని 43మందిలో 20మంది, కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు 19మందిలో 18మంది నేరచరితులే. బిహార్‌ సౌభాగ్యాన్ని కబళిస్తోంది- ఈ నేర రాజకీయ కాయతొలుచు పురుగే!

నేర రాజకీయం కుబుసం విడిచిన చోట, అభివృద్ధి ఉత్తమాట. బిమారు (రుజాగ్రస్త) రాష్ట్రాలుగా పరువు మాసిన బిహార్‌ మధ్యప్రదేశ్‌ రాజస్థాన్‌ యూపీల తలసరి ఆదాయం 1980 దశకంలో దాదాపు సమాన స్థాయిలో ఉండేది. 1990 ఆర్థిక సంస్కరణల దరిమిలా అవకాశాల్ని అందిపుచ్చుకొని ధీమాగా పురోగమిస్తున్న రాజస్థాన్‌ (రూ.లక్షా 18వేలు), ఎంపీ (దాదాపు లక్ష రూపాయలు), యూపీ (రూ.70వేల పైచిలుకు)ల తలసరి ఆదాయంతో పోలిస్తే బిహార్‌ (రూ.46,664) ఎంతో వెనకంజలో ఉంది. నేర రాజకీయాల ఉరవడితో పారిశ్రామిక ప్రగతి పత్తాలేని బిహార్‌లో నిరుద్యోగిత, కార్మికుల వలసలు ఏటికేడు విస్తరించడంలో వింతేముంది? నేరగ్రస్త రాజకీయాల కట్టడిని లక్షించి 'సుప్రీం' ఇచ్చిన ఆదేశాలు ఇంతగా ప్రభావశూన్యం అయ్యేందుకు నిర్వాచన్‌ సదన్‌ సైతం పుణ్యం కట్టుకొందంటూ ప్రజాహిత వ్యాజ్యమూ దాఖలైంది. స్వేచ్ఛగా సక్రమంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ బాధ్యత గల ఈసీ 'సుప్రీం' ఆదేశాలకు గట్టిగా కట్టుబాటు చాటి ఉంటే- ఎమ్మెల్యేలుగా దర్జాగా నెగ్గుకొచ్చే స్వేచ్ఛ నేరచరితులకు ఉండేదా అన్న ప్రశ్నలో అనౌచిత్యం ఏమీ లేదు. అవినీతి, నేర రాజకీయాలు ప్రజాస్వామ్య మూలాల్ని దెబ్బతీస్తున్నాయంటూ, ఆ ప్రమాదాన్ని నిలువరించేలా పార్లమెంటు ప్రత్యేక చట్టం చేయాలన్న రాజ్యాంగ ధర్మాసనం సూచనకు మన్నన దక్కనే లేదు. ఈ నేపథ్యంలోనే- తమ అభ్యర్థుల గురించి పూర్తిగా తెలుసుకొని ఓటు వేసే వాతావరణం ఉంటే జాగృత జనవాహినే నేర చరితుల్ని ఊడ్చేస్తుందన్న ఆశావాదం సుప్రీం ఆదేశాల్లో వ్యక్తమవుతోంది. అలాంటప్పుడు, అభ్యర్థుల సమగ్ర వివరాల్ని రాబట్టి నేరచరితుల పూర్వాపరాల్ని ప్రసార మాధ్యమాల ద్వారా తెలియజేయాల్సిన బాధ్యతను ఈసీపైనే ఎందుకు పెట్టకూడదు? తెలుసుకోవడం ప్రజల హక్కు అయితే, తెలియజెప్పే బాధ్యత ఈసీది. నేర రాజకీయాలకు పగ్గాలు పడాలంటే ఈ తరహా సంస్కరణలు తప్పనిసరి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.