ETV Bharat / opinion

ఉపాధికి ఊతమిస్తేనే కొనుగోలు శక్తిలో పెరుగుదల!

author img

By

Published : May 14, 2020, 8:54 AM IST

ప్రస్తుత సంక్షోభ పరిస్థితుల్లో అందరికీ తలాకొంత పందేరం ప్యాకేజీ పరమార్థం కాకూడదు. కనిష్ఠ వ్యయంతో అత్యధిక ప్రజానీకానికి గరిష్ఠ ప్రయోజనం కల్పించేలా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. ఏయే రంగాలకు ఇదమిత్థంగా ఎంతవరకు బాసటగా నిలవాలో నిర్దిష్టంగా మదింపు వేసి, వెచ్చించే ప్రజాధనంలోని ప్రతి రూపాయీ సద్వినియోగమయ్యేలా కంతలన్నీ పూడ్చాలి. ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు ఏర్పడితే సహజంగానే వాళ్ల కొనుగోలు శక్తి ఇనుమడిస్తుంది. తద్వారా, దేశార్థికం పుంజుకొంటుంది.

eenadu editorial
ఉపాధికి ఊతమిస్తేనే కొనుగోలు శక్తిలో పెరుగుదల

కరోనా మహమ్మారి సృష్టించిన తీవ్ర కల్లోలంతో సొమ్మసిల్లిన దేశార్థిక రంగానికి గొప్ప సాంత్వన చేకూర్చగలదంటూ మంగళవారం రాత్రి ప్రధాని మోదీ అపూర్వమనదగ్గ రీతిలో భారీ ఆర్థిక ప్యాకేజీని ఆవిష్కరించారు. రూ.20లక్షల కోట్ల ఉద్దీపన యోజన రంగాలవారీగా ఎంత మేర ఊరట కలిగించగలదో అంచెలవారీగా విపులీకరించే కసరత్తును ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్‌ నిన్న ఘనంగా ఆరంభించారు.

సూక్ష్మ చిన్న మధ్య తరహా పరిశ్రమ (ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈ)లను గట్టెక్కించడం మొదలు విద్యుత్‌ పంపిణీ సంస్థల బలోపేతం వరకు అమాత్యులు తొలి దఫా ప్రస్తావించిన 15 భిన్నాంశాలు 'ఆత్మనిర్భర్‌ భారత్' నినాద స్ఫూర్తిని ప్రతిబింబించాయి. దేశీయ అవసరాలకోసం వెలుపలివారి వైపు చూడరాదన్నదే కరోనా సందేశమన్న ప్రధాని- గ్రామాలు, జిల్లాలు, రాష్ట్రాలు.... మొత్తంగా భారతావనే స్వయం సమృద్ధి సాధించాలని పక్షం రోజుల క్రితమే పిలుపిచ్చారు. బాహుబలి ప్యాకేజీ ప్రకటించిన దరిమిలా దాన్నిప్పుడు పకడ్బందీగా అమలుపరచడం ద్వారా ప్రభుత్వం కార్యదక్షతను నిరూపించుకోవాల్సి ఉంది!

జీడీపీలో 10 శాతం..

తొలి దశ లాక్‌డౌన్‌ విధించిన రెండు రోజుల్లోపే 'ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన' పేరిట విత్తమంత్రి రూ.1.70 లక్షల కోట్ల ప్యాకేజీ వెలువరించారు. ఆ మొత్తం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 0.8 శాతానికి సమానం. దాన్ని వెన్నంటి రిజర్వ్‌ బ్యాంక్‌ రెండు దశల్లో వెల్లడించిన విధాన నిర్ణయాల విలువ జీడీపీలో సుమారు మూడు శాతం. వాటితో కలిపి కేంద్రం తాజాగా రూపొందించిన రూ.20 లక్షల కోట్ల విస్తృత ప్యాకేజీ పరిమాణం భారత జీడీపీలో ఇంచుమించు 10 శాతం.

ఐదో స్థానంలో..

స్థూల దేశీయోత్పత్తిలో భూరి మొత్తాన్ని వ్యవస్థల బాగుసేతకు మళ్ళించిన జపాన్‌ (21.1శాతం), అమెరికా (13), స్వీడన్‌ (12), జర్మనీ (10.7)ల తరవాత ఆ స్థాయిలో ప్యాకేజీ సిద్ధపరచింది భారత్​. కొత్తగా అమలుపరుస్తామంటున్న అజెండా- ఉత్పాదన పెంపు, విరివిగా ఉపాధి కల్పన అనే జంట లక్ష్యాల అమలులో నూటికి నూరుపాళ్లు నెగ్గుకొస్తేనే మహా ప్యాకేజీ సార్థకమైనట్లు!

దేశంలో వ్యవసాయం తరవాత అత్యధికంగా 12 కోట్లమందికి ఉపాధి కల్పిస్తూ, కరోనా ధాటికి చతికిలపడిన చిన్న సంస్థల సముద్ధరణకు కేంద్రం కనబరచిన చొరవ ఎన్నో ఎమ్‌ఎస్‌ఎమ్‌ఈలకు కొత్త ఊపిరులూదనుంది. కొండంత వెలుగునిచ్చే చిరుదివ్వెలను సత్వరం ఆదుకోవాల్సిందే. ఆతిథ్య, పర్యాటక రంగాల్లాంటివీ పూర్తిగా పడకేసిన నేపథ్యంలో- ప్రాధాన్య ప్రాతిపదికన వాటిని నిలబెట్టడానికీ మార్గదర్శి సిద్ధం కావాలి!

వేతన జీవులు, సంస్థలకు చేయూత

అదృష్టవశాత్తు, పుష్కల ఆహార ధాన్యాలు భారత్‌ను ధీమాగా నిలబెడుతున్నాయి. రైతులకు నష్టం లేకుండా ప్రభుత్వం తిండిగింజల్ని సేకరించి, దేశంలో ఏ ఒక్కరూ ఆకలి చావులకు గురికాకుండా కాచుకుంటూ అవసరార్థులు తిరిగి కోలుకునేదాకా వాటిని అందించాలి. ఉద్యోగుల వేతనాల్లో 80శాతం మేర భరించడానికి బ్రిటన్‌ ముందుకురాగా- అమెరికా, ఆస్ట్రేలియా వంటివి నిరుద్యోగ భృతి పరిధిని విస్తరింపజేశాయి. ఇక్కడా రాబడి సన్నగిల్లిన సంస్థలు, పరిశ్రమల సిబ్బంది వేతన పంపిణీలకు ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలి!

ప్రస్తుత సంక్షుభిత పరిస్థితుల్లో అందరికీ తలాకొంత పందేరం ప్యాకేజీ పరమార్థం కాకూడదు. కనిష్ఠ వ్యయంతో అత్యధిక ప్రజానీకానికి గరిష్ఠ ప్రయోజనం కల్పించేలా అన్ని జాగ్రత్తలూ తీసుకోవాలి. ఏయే రంగాలకు ఇదమిత్థంగా ఎంతవరకు బాసటగా నిలవాలో నిర్దిష్టంగా మదింపు వేసి, వెచ్చించే ప్రజాధనంలోని ప్రతి రూపాయీ సద్వినియోగమయ్యేలా కంతలన్నీ పూడ్చాలి. ఎక్కువమందికి ఉపాధి అవకాశాలు ఏర్పడితే సహజంగానే వాళ్ల కొనుగోలు శక్తి ఇనుమడిస్తుంది. తద్వారా, దేశార్థికం పుంజుకొంటుంది.

ఆ మేరకు- పరిమిత వనరులు గరిష్ఠ ప్రయోజన సాధకాలయ్యేలా నిపుణులు, అధికార యంత్రాంగం సూచనలూ సలహాలతో ఆర్థిక రంగాన్ని పునరుత్తేజపరచడంలో ప్రభుత్వం గెలుపే- జాతి ప్రస్థానగతిని మలుపు తిప్పగలుగుతుంది!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.