ETV Bharat / opinion

118 దేశాల్లోని పసి పిల్లలపై కరోనా పడగ!

author img

By

Published : May 16, 2020, 7:01 AM IST

కరోనా సంక్షోభంతో వచ్చే ఆరునెలల్లో 118 దిగువ, మధ్యాదాయ దేశాల్లో రోజూ అదనంగా ఆరువేలమంది పసివాళ్లు కడతేరిపోతారని అంచనా. ప్రాణనష్టం అధికంగా సంభవిస్తుందంటున్న 10 దేశాల జాబితాలో భారత్​పేరూ ఉంది. ఐదేళ్లు నిండకుండానే భూమ్మీద నూకలు చెల్లుతున్న అభాగ్యుల సంఖ్యకిది అదనం! తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పరిస్థితి విషమిస్తుందన్న యునిసెఫ్‌ హెచ్చరిక, భారత్‌ సహా నూటికిపైగా దేశాల్లో ఇకనైనా చురుకు పుట్టించాలి!

CHILD LIFE
పసిమొగ్గలపై కరోనా పడగ

బతుకుల్ని జీవనాధారాల్ని గుల్లబార్చి, మానవాళి ఆకాంక్షలకు అభివృద్ధి లక్ష్యాలకు తూట్లు పొడుస్తూ- కరోనా మహమ్మారి దేశదేశాలను హడలెత్తిస్తోంది. ఆర్థిక, వాణిజ్య రంగాల్నీ కకావికలం చేస్తోంది. భావితరంపైనా కొవిడ్‌ కర్కశ ప్రభావం దారుణంగా ఉండనుందని 'యునిసెఫ్' తాజాగా హెచ్చరిస్తోంది. కరోనా కోర సాచిన నేపథ్యంలో మలేరియా, పోలియో వంటి వ్యాధులపైనా దృష్టి సారించాల్సిందేనని గత నెలలో ప్రపంచ ఆరోగ్య సంస్థ పిలుపిచ్చింది.

బాలలపై కరోనా వైరస్‌ ప్రభావ తీవ్రత ఇక ఎంతమాత్రం ఉపేక్షించలేనిదంటున్న యునిసెఫ్‌ ఉద్బోధ, సమగ్ర చిత్రాన్ని ఆవిష్కరిస్తోంది. లాక్‌డౌన్లు, కర్ఫ్యూల మూలాన చాలాచోట్ల రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. సాధారణ ఆరోగ్య వసతులూ అందుబాటులో లేకుండా పోయాయి. తల్లిదండ్రుల ఆదాయం కుంగి, సరైన పోషకాహారం అందక పిల్లలు చనిపోయే దుర్భర స్థితికి ఇవన్నీ దారితీసేవేనన్నది యునిసెఫ్‌ వ్యక్తపరుస్తున్న తీవ్రాందోళన.

జాగరూకత అవసరం..

వచ్చే ఆరునెలల్లో 118 దిగువ, మధ్యాదాయ దేశాల్లో రోజూ అదనంగా ఆరువేలమంది పసివాళ్లు కడతేరిపోతారన్నది ఎవరినైనా బెంబేలెత్తించే అంచనా. ప్రాణనష్టం అధికంగా సంభవిస్తుందంటున్న 10 దేశాల జాబితాలో- ఇథియోఫియా, కాంగో, టాంజానియా, నైజీరియా, ఉగాండా, పాకిస్థాన్లతో పాటు ఇండియా పేరూ చోటుచేసుకుంది. అయిదో పుట్టినరోజు జరుపుకోకుండానే భూమ్మీద నూకలు చెల్లుతున్న అభాగ్యుల సంఖ్యకిది అదనం!

సరైన పోషణ, కనీస వైద్యాలకు నోచక నివారించదగ్గ వ్యాధుల బారిన పడి అర్ధాంతరంగా కన్నుమూస్తున్న పిల్లలకు మరింతమంది జతపడకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత ఆయా దేశాల భుజస్కంధాలపైనే ఉంది. తక్షణం దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే పరిస్థితి విషమిస్తుందన్న యునిసెఫ్‌ హెచ్చరిక, భారత్‌ సహా నూటికిపైగా దేశాల్లో ఇకనైనా చురుకు పుట్టించాలి!

భారత్​ది 131వ స్థానం..

కొవిడ్‌ మహా సంక్షోభం మూలాన దేశంలో శిశుపాలన పెనం మీదనుంచి పొయ్యిలో పడినట్లయింది. మధ్య ఆఫ్రికా, చాద్‌, సోమాలియా వంటి చోట్ల శిశుసంక్షేమం అధమమని- ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్‌, లాన్సెట్‌ పత్రికల ఇటీవలి సంయుక్త అధ్యయనం నిగ్గు తేల్చింది. పసికందులు బతికి బట్టకట్టి క్షేమంగా మనగల అవకాశాల ప్రాతిపదికన 180 దేశాల్లో ఇండియాది 131వ స్థానమనీ అది ఈసడించింది.

పథకాలపై సమీక్ష అవసరం..

పోషకాహార లేమిని చాలావరకు నియంత్రించగలుగుతున్నట్లు ప్రభుత్వ యంత్రాంగం చెబుతున్నా, ఇప్పటికీ ఏటా ఏడు లక్షలమంది పిల్లలు బలైపోతూనే ఉన్నారు. పౌష్టికాహార లోపాల్ని టోకున తుడిచి పెట్టేందుకంటూ పట్టాలకు ఎక్కించిన 'పోషణ్‌ అభియాన్‌', నాలుగున్నర దశాబ్దాలుగా కొనసాగుతున్న సమీకృత శిశు అభివృద్ధి సేవల (ఐసీడీఎస్‌) పథకం వంటివి ఎక్కడ ఏ మేర నిష్ఫలమవుతున్నాయో కూలంకషంగా సమీక్షించి సత్వరం కంతలు పూడ్చాల్సిన తరుణమిదే.

ప్రస్తుతం 177 దేశాల్లో 130 కోట్లమంది పిల్లలు పాఠశాలలకు హాజరు కాలేకపోతున్నారు. బడిలో అందించే భోజనానికి దూరమైనవారి సంఖ్య కోట్లలో ఉంది. 37 దేశాల్లోనే దాదాపు 12 కోట్లమంది బాలలు తట్టు (మీజిల్స్‌) టీకాలు వేయించుకోలేకపోయారన్న గణాంక వివరాలు, కరోనా విస్తృత దుష్ప్రభావాలను కళ్లకు కడుతున్నాయి. దేశంలోనే 40శాతం పిల్లలకు వ్యాధి నిరోధక టీకాలు, విటమిన్ల దన్ను అందుబాటులో లేవు.

ఈ స్థితిలో మరింతమంది బాలల ప్రాణ దీపాలు కొడిగట్టిపోకుండా ప్రభుత్వాలు ఏమేమి జాగ్రత్తలు చేపడతాయన్నది, దేశ భావి గతి రీతుల్ని నిర్ధరించనుంది. సుస్థిర మానవాభివృద్ధి లక్ష్యాల సాధనలో శిశుసంక్షేమం అత్యంత కీలకాంశం. వ్యవస్థల్ని నిలబెట్టుకోవడంతోపాటు, రేపటితరాన్ని సంరక్షించడమూ ప్రభుత్వాల విధ్యుక్త ధర్మం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.