ETV Bharat / opinion

ఈశాన్య రాష్ట్రాల బరిలో 'బిహార్​' రాజకీయ పార్టీలు.. 'జాతీయ' ఆశతోనే!

author img

By

Published : Feb 16, 2023, 6:51 AM IST

బిహార్​లోని కీలక రాజకీయ పార్టీలు ఈశాన్య రాష్ట్రాలపై పట్టు కోసం తహతహలాడుతున్నాయి. జేడీయూ, ఎల్జేపీ, ఆర్జేడీ వంటి పార్టీలు ఈశాన్య రాష్ట్రాల్లో తమ ఉనికిని చాటుకోవాలని ప్రయత్నిస్తున్నాయి. ఈ సారి ఈశాన్య రాష్ట్రాల్లో జరిగే ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి దించుతున్నాయి. జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాలన్న తపనే అందుకు కారణంగా తెలుస్తోంది.

north east assembly polls
ఈనాన్య రాష్ట్రాల శాసనసభ ఎన్నికలు

జేడీయూ, లోక్‌ జన్‌శక్తి పార్టీ (ఎల్జేపీ), రాష్ట్రీయ జనతాదళ్‌ (ఆర్జేడీ).. ఈ పార్టీల పేర్లు వినగానే బిహార్‌ గుర్తుకొస్తుంది. వాటి అసలైన రాజకీయ రణక్షేత్రం ఆ రాష్ట్రమే. బిహార్‌ నుంచి విడిపోయిన ఝార్ఖండ్‌లో వాటి ఉనికి నామమాత్రం! అయితే ఝార్ఖండ్‌లో విస్తరణపై పెద్దగా దృష్టిపెట్టని ఈ పార్టీలు ఈశాన్య రాష్ట్రాలపై పట్టు కోసం మాత్రం తహతహలాడుతున్నాయి. ఇప్పటికే జేడీయూ ఈ విషయంలో కొంత సఫలీకృతమైంది కూడా. అదే బాటలో ఆర్జేడీ, ఎల్జేపీ (రాంవిలాస్‌) సైతం ఈశాన్య రాష్ట్రాల్లో తమ అభ్యర్థులను ఎన్నికల బరిలో దించుతున్నాయి. జాతీయ పార్టీలుగా గుర్తింపు పొందాలన్న తపనే అందుకు ప్రధాన కారణం.

ఎన్‌పీపీ స్ఫూర్తి!
మేఘాలయలో ప్రస్తుతం నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) అధికారంలో ఉంది. లోక్‌సభ మాజీ స్పీకర్‌ పీఏ సంగ్మా 2013లో ఆ పార్టీని స్థాపించారు. అదే ఏడాది డిసెంబరులో జరిగిన రాజస్థాన్‌ ఎన్నికల్లో ఎన్‌పీపీ నాలుగు శాసనసభ స్థానాలను గెల్చుకుంది. 2016లో పీఏ సంగ్మా మరణంతో ఆయన కుమారుడు కాన్రాడ్‌ సంగ్మా పార్టీ పగ్గాలు చేపట్టారు. ఆ తర్వాత ఈశాన్యంలోని ప్రతి రాష్ట్ర ఎన్నికల్లో ఆ పార్టీ పోటీ చేయడం ప్రారంభించింది. 2017లో మణిపుర్‌ శాసనసభ ఎన్నికల్లో పోటీ చేసి నాలుగు స్థానాలు, అదే రాష్ట్రంలో 2022లో ఏడు సీట్లు దక్కించుకుంది. 2018లో నాగాలాండ్‌లో రెండు, తర్వాతి ఏడాది అరుణాచల్‌ ప్రదేశ్‌లో ఐదు అసెంబ్లీ సీట్లలో విజయం సాధించింది. మేఘాలయలో 2013లో రెండు స్థానాలకు పరిమితమైన ఎన్‌పీపీ.. 2018లో 19 సీట్లు గెల్చుకొని మిత్రపక్షాల సాయంతో ఏకంగా ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసింది. మేఘాలయలో అధికారం దక్కించుకోవడంతో పాటు మణిపుర్‌, నాగాలాండ్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌ శాసనసభల్లో ప్రాతినిధ్యం లభించడంతో దాన్ని జాతీయ పార్టీగా 2019లో ఎన్నికల సంఘం ప్రకటించింది.

అదే బాటలో జేడీయూ..
ఎన్‌పీపీ బాటలో జేడీయూ సైతం ఈశాన్య రాష్ట్రాల్లో పట్టు కోసం ప్రయత్నిస్తోంది. 2018లో నాగాలాండ్‌ ఎన్నికల్లో ఆ పార్టీ ఒక స్థానంలో గెలుపొందింది. అదే ఉత్సాహంతో 2019లో అరుణాచల్‌ ప్రదేశ్‌ ఎన్నికల బరిలోకి దిగి.. ఏడు స్థానాలతో రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా అవతరించింది. 2022లో మణిపుర్‌ ఎన్నికల్లో ఆరు స్థానాలు గెల్చుకుంది. బిహార్‌ అసెంబ్లీలోనూ ప్రాతినిధ్యం ఉండటంతో జేడీయూకు జాతీయ పార్టీ హోదా దక్కే అవకాశం లభించినా.. ఆ పార్టీ తరఫున నాగాలాండ్‌లో గెలిచిన ఒకరు, అరుణాచల్‌లో విజయం సాధించిన ఏడుగురు ఇతర పక్షాల్లోకి ఫిరాయించడంతో చుక్కెదురైంది. ఇక మణిపుర్‌లో గెలిచిన ఆరుగురిలో అయిదుగురు భాజపా తీర్థం పుచ్చుకున్నారు.

హోదా నిలబెట్టుకునే ఆరాటంలో తృణమూల్‌
బంగాల్‌లో అధికారంలో కొనసాగుతున్న తృణమూల్‌ కాంగ్రెస్‌.. 2001 నుంచే బంగాల్‌ వెలుపల తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది. అసోంలో 2001, 2011 ఎన్నికల్లో ఒక్కో అసెంబ్లీ స్థానాన్ని ఆ పార్టీ గెల్చుకుంది. మణిపుర్‌లో 2012లో ఏడు స్థానాలు దక్కించుకుంది. అయితే అక్కడ అయిదేళ్ల తర్వాత ఒక్క సీటుకే పరిమితమైంది. 2012లో ఉత్తర్‌ప్రదేశ్‌లోని మాంట్‌ శాసనసభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తృణమూల్‌ విజయం సాధించింది. ఇప్పటికే జాతీయ పార్టీగా గుర్తింపు పొందిన తృణమూల్‌.. దాన్ని నిలబెట్టుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తోంది. ప్రస్తుతం త్రిపుర, మేఘాలయ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నిస్తోంది. మరోవైపు- మహారాష్ట్రలో మంచి పట్టున్న నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ).. 2017లో గోవాలో, అదే ఏడాది గుజరాత్‌లో, 2018లో మేఘాలయలో, మరుసటి ఏడాది ఝార్ఖండ్‌లో ఒక్కో అసెంబ్లీ స్థానం చొప్పున గెల్చుకుంది. కేరళలో 2016, 2021 శాసనసభ ఎన్నికల్లో రెండేసి సీట్లలో విజయం సాధించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో మహారాష్ట్రలో నాలుగు లోక్‌సభ నియోజకవర్గాల్లో జయభేరి మోగించింది. లక్షద్వీప్‌ పార్లమెంటరీ సీటును గెల్చుకుంది. తద్వారా జాతీయ పార్టీ హోదాను రక్షించుకుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.