ETV Bharat / opinion

పారదర్శకంగా బిహార్​ ఎన్నికలు- జనస్వామ్యానికి జై

author img

By

Published : Nov 18, 2020, 6:03 AM IST

2020 బిహార్​ ఎన్నికల్లో ఎన్నో విశేషాలున్నాయి. కరోనా సంక్షోభం నడుమ జరిగిన తొలి ఎన్నికలు ఇవే. ​బిహార్‌ రాజకీయ యవనికపై ఆర్జేడీ అగ్రనేత లాలూప్రసాద్‌ తనయుడు తేజస్వి యాదవ్‌, ఎల్జేపీ అగ్రనేత రాంవిలాస్‌ పాస్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌ రూపంలో కొత్త తరం ముందువరసలో నిలిచి ఈ ఎన్నికల పోరు నడిపింది. గతంలో బిహార్‌లో ఎన్నికలనగానే హింస తప్పనిసరి! తాజాగా ఒక్కచోట కూడా బూత్‌ను ఆక్రమించడం, కొన్ని వర్గాల ఓటర్లను ఓటెయ్యకుండా అడ్డుకునేందుకు భారీ స్థాయిలో హింసకు పాల్పడటం వంటి ఉదంతాలేవీ కనిపించలేదు. మహిళలు భారీగా తరలివచ్చు ఓట్లు వేయడం బిహార్‌ గడ్డలో ప్రజాస్వామ్య వేర్లు ఎంత లోతుగా చొచ్చుకుపోయాయనేందుకు నిదర్శనం.

Bihar elections conducted amid corona crisis is unique
పారదర్శకంగా బిహార్​ ఎన్నికలు- జనస్వామ్యానికి జై

ఇటీవల ముగిసిన బిహార్‌ అసెంబ్లీ ఎన్నికల నుంచి గ్రహించాల్సిన విషయాలెన్నో ఉన్నాయి. దేశవ్యాప్తంగా కరోనా వైరస్‌ ప్రబలిన తరవాత చేపట్టిన తొలి ఎన్నికలివి. వీటిని అత్యంత జాగ్రత్తగా, అన్ని రకాల కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ నిర్వహించారు. ఎన్నికలు ఎలాంటి హింసకు తావులేకుండా పూర్తవడం ఒక విశేషమైతే, పోలింగ్‌ కేంద్రాల వద్ద పురుషులను మించి మహిళా ఓటర్లు బారులు తీరి ఓట్లేయడం మరింత పెద్ద విశేషం. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి సైతం అత్యంత పారదర్శకంగా జరిగింది.

లోపరహిత వ్యవస్థ

ఈ ఎన్నికల మరో ప్రత్యేకత ఏమిటంటే- బిహార్‌ రాజకీయ యవనికపై ఆర్జేడీ అగ్రనేత లాలూప్రసాద్‌ తనయుడు తేజస్వి యాదవ్‌, ఎల్జేపీ అగ్రనేత రాంవిలాస్‌ పాస్వాన్‌ కుమారుడు చిరాగ్‌ పాసవాన్‌ రూపంలో కొత్త తరం ముందువరసలో నిలిచి పోరు నడిపింది. విపక్షాల కూటమి మహాగట్బంధన్‌ (ఎంజీబీ)కు నేతృత్వం వహించిన 31 సంవత్సరాల తేజస్వి- కాంగ్రెస్‌ పార్టీని సైతం తన భుజాలపై వేసుకొని నడవడం ఇంకో విశేషం. బిహార్‌ నలుమూలలా తిరిగి, వందలకొద్దీ సభల్లో ప్రసంగించి, అధికార ఎన్డీయే కూటమికి గట్టి పోటీ ఇచ్చారు. అయితే, ఎన్నికల పర్వంలో విశేషంగా రాణించిన తేజస్వి మెరుపులు- ఆ తరవాత ఎన్నికల సంఘంపై చేసిన బాధ్యతారహిత ఆరోపణలతో మసకబారాయి. హోరాహోరీ పోరులో ఓటమి తరవాత తేజస్వి సైతం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ తరహాలో మాట్లాడతారని ఎవరూ ఊహించలేదు. అమెరికాలో ప్రతి రాష్ట్రానికి ఎన్నికల నిర్వహణ పద్ధతి వేర్వేరుగా ఉంటుంది. పంచింగ్‌ యంత్రాలు, ఓటు నమోదు, బ్యాలెట్‌ స్టాంపింగ్‌, ఓటింగ్‌ యంత్రాలను ఉపయోగించడం వంటి అంశాల్లో ఒక్కో చోట ఒక్కో తరహా పద్ధతిని పాటిస్తారు. అంతేకాదు, ఎన్నికలకు సంబంధించి నిబంధనలు సైతం ఒక్కోరీతిలో ఉంటాయి. ఫలితంగా విస్కాన్సిన్‌, మిషిగన్‌ నుంచి పెన్సిల్వేనియా వరకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపు తేదీలు వేర్వేరుగా ఉంటాయి. అదేవిధంగా రీకౌంటింగ్‌కు సంబంధించిన నిబంధనలూ రకరకాలుగా ఉంటాయి. భారత్‌లో మనకు పార్లమెంటు రూపొందించిన ఉమ్మడి ఎన్నికల చట్టం ఉంది. ఇది దేశమంతటికీ ఒకే రీతిలో, ఒకే ప్రామాణికంతో వర్తిస్తుంది. అన్నిచోట్లా ఈవీఎంలనే ఉపయోగిస్తారు. ఎన్నికలు నిర్వహించే పద్ధతి సైతం ఏకరీతిగా ఉంటుంది. పోలింగ్‌కు సంబంధించి ఇంతకన్నా లోపరహిత వ్యవస్థ లేదు. ఈ నేపథ్యంలో ప్రపంచంలోనే అత్యంత భారీ ప్రజాస్వామిక దేశంగా భారత్‌ సాధించిన ఘనతకు గర్వించాల్సింది పోయి- కాంగ్రెస్‌ సహా ఎంజీబీ కూటమిలోని పార్టీలన్నీ ఓటింగ్‌ యంత్రాలపై తరచూ అనుమానాలు వెలిబుచ్చడం గమనార్హం. అంతేకాదు, భాజపా కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడే- రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఎలా గెలిచిందనే ప్రశ్నకు విపక్షాల నుంచి సరైన సమాధానం లేదు. ఓట్ల లెక్కింపు అనంతరం తేజస్వి స్పందిస్తూ, తమ కూటమి 130సీట్లు గెలిచి ఉండేదని, తిరస్కరించిన పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపులో అవకతవకలు జరిగినందున ఎన్నికల సంఘం తమను గెలవకుండా చేసిందని ఆరోపించారు. ఇవి- అమెరికాలో పలు రాష్ట్రాల్లో ఎన్నికల అధికారులపై ట్రంప్‌ చేసిన ఆరోపణల మాదిరిగానే ఉన్నాయి. ఈ ఆరోపణల్ని ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. పోస్టల్‌ బ్యాలెట్లలో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలు ఆధారాల్లేనివని స్పష్టంచేసింది. మొత్తంగా 11 నియోజకవర్గాల్లో గెలుపు తేడా వెయ్యికన్నా తక్కువగా ఉండగా, వాటిలో ఎంజీబీ నాలుగు స్థానాలు, ఎల్జేపీ, స్వతంత్ర అభ్యర్థి చెరొకచోట గెలిచారు. వెయ్యి ఓట్లకన్నా తక్కువ తేడాతో ఆర్జేడీ కోల్పోయిన స్థానాలు రెండు మాత్రమే కావడం గమనార్హం. ఈ లెక్కన 20సీట్లలో తాము మోసపోయామన్న ఎంజీబీ ఆరోపణలు ఆధారరహితమని స్పష్టమవుతోంది.

మోదీకి ప్రజాదరణతోనే...

ఎన్డీయేకు మరీ ముఖ్యంగా జేడీయూకు ఎల్జేపీ తలపెట్టిన నష్టం గణనీయమేననడంలో సందేహం లేదు. ఎల్జేపీతో కలిసి ఎన్డీయే ఎన్నికల బరిలో నిలిచి ఉంటే దాని విజయం మరింత ఘనంగా ఉండేదని చెప్పవచ్ఛు భాజపా 74స్థానాలు కైవసం చేసుకోవడం, నీతీష్‌ తిరిగి అధికారంలోకి రావడం... మోదీ ప్రజాదరణ, కేంద్ర ప్రభుత్వ పేదరిక నిర్మూలన కార్యక్రమాలను విజయవంతంగా ప్రజలకు చేర్చడం వల్లేనని స్పష్టమవుతోంది. గతంలో బిహార్‌లో ఎన్నికలనగానే హింస తప్పనిసరి! తాజాగా ఒక్కచోట కూడా బూత్‌ను ఆక్రమించడం, కొన్ని వర్గాల ఓటర్లను ఓటెయ్యకుండా అడ్డుకునేందుకు భారీ స్థాయిలో హింసకు పాల్పడటం వంటి ఉదంతాలేవీ కనిపించలేదు. ఈసారి మహిళలు పెద్ద సంఖ్యలో ఓటేసేందుకు తరలి రావడం- బిహార్‌ గడ్డలో ప్రజాస్వామ్య వేర్లు ఎంత లోతుగా చొచ్చుకుపోయాయనేందుకు నిదర్శనగా నిలుస్తోంది. ఈ ఎన్నికలు భారత ప్రజాస్వామ్య ఔన్నత్యాన్ని మరింతగా ఇనుమడింపజేశాయనడంలో ఏమాత్రం సందేహం అక్కర్లేదు.

---- ఏ. సూర్యప్రకాశ్​, రచయిత, ప్రసార భారతి మాజీ ఛైర్మన్​.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.