ETV Bharat / opinion

సవాళ్ల పథంలో లక్ష్యం కొండంత

author img

By

Published : Jul 17, 2020, 10:04 AM IST

బతుకు పందెంలో వెనకబడిపోరాదన్నా, ఓటమి భారంతో నైరాశ్యంలో కూరుకుపోరాదన్నా నిరంతరం నిత్య విద్యార్థిలా నైపుణ్యాలు అలవరచుకోవాలన్న ప్రధాని మోదీ ఉద్బోధ అక్షరసత్యం. దేశ యువతలో మూడొంతులు ఎన్నడూ నిపుణ శిక్షణ పొందని దురవస్థను మోదీ ప్రభుత్వం అయిదేళ్లక్రితమే గుర్తించింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా 'స్కిల్‌ ఇండియా' కార్యక్రమానికి నాంది పలికింది. ఆ యోజన కింద 2022 సంవత్సరం నాటికి 40కోట్ల నిపుణ కార్మికుల అవతరణను లక్షించింది. 'ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన' కింద శిక్షణ పొందిన దాదాపు 90 లక్షలమందిలో ఉపాధి దక్కించుకున్నవారి సంఖ్య 30-35 లక్షలదాకా ఉన్నట్లు సంబంధిత శాఖామాత్యులు ఆర్‌కే సింగ్‌ గత నవంబరులో లెక్క చెప్పారు.

5 crore indians benefited from skill india scheme
సవాళ్ల పథంలో లక్ష్యం కొండంత

ఆధునిక పోటీ ప్రపంచంలో ఎవరికైనా నైపుణ్యమే అతిపెద్ద బలం. అందులోనూ ఉపాధి రంగంలో తీవ్ర అనిశ్చితి, గండాలు పొంచి ఉన్న తరుణాన.. సవాళ్ల పథంలో నిపుణశక్తే దారిదీపం. కొవిడ్‌ ప్రభంజనం నేపథ్యంలో ఉద్యోగాల స్వరూప స్వభావాలు వేగంగా మారిపోతున్నాయి. బతుకు పందెంలో వెనకబడిపోరాదన్నా, ఓటమి భారంతో నైరాశ్యంలో కూరుకుపోరాదన్నా నిరంతరం నిత్య విద్యార్థిలా నైపుణ్యాలు అలవరచుకోవాలన్న ప్రధాని మోదీ ఉద్బోధ అక్షరసత్యం. దేశ యువతలో మూడొంతులు ఎన్నడూ నిపుణ శిక్షణ పొందని దురవస్థను మోదీ ప్రభుత్వం అయిదేళ్లక్రితమే గుర్తించింది. దిద్దుబాటు చర్యల్లో భాగంగా 'స్కిల్‌ ఇండియా' కార్యక్రమానికి నాంది పలికింది. ఆ యోజన కింద 2022 సంవత్సరం నాటికి 40కోట్ల నిపుణ కార్మికుల అవతరణను లక్షించింది.

'ప్రధానమంత్రి కౌశల్‌ వికాస్‌ యోజన' కింద శిక్షణ పొందిన దాదాపు 90 లక్షలమందిలో ఉపాధి దక్కించుకున్నవారి సంఖ్య 30-35 లక్షలదాకా ఉన్నట్లు సంబంధిత శాఖామాత్యులు ఆర్‌కే సింగ్‌ గత నవంబరులో లెక్క చెప్పారు. 'స్కిల్‌ ఇండియా' కార్యక్రమంలో మొత్తం అయిదు కోట్లమంది లబ్ధి పొందినట్లు ప్రధానమంత్రి తాజాగా వెల్లడించారు. తొలినాటి లక్ష్యం ఇంకా యోజనాల దూరంలో ఉండగా.. మలి అంచెలో వలస కార్మికులపైనా, రాష్ట్రాల పాత్రమీదా దృష్టి కేంద్రీకరించదలచామని అమాత్యులు ఆర్‌కే సింగ్‌ చెబుతున్నారు. శిక్షణ కార్యక్రమాల్ని వేగవంతం చేయడంతోపాటు నైపుణ్యాలు పొందినవారి జాబితాలో ప్రతిఒక్కరూ తగిన ఉపాధి దక్కించుకునేలా జాగ్రత్తలూ తీసుకోవాల్సి ఉంది. నైపుణ్య శిక్షణ పొందినవారిలో ఇంచుమించు మూడోవంతు మందికే జీవనోపాధి లభిస్తుండటం- తక్షణ దిద్దుబాటు చర్యల ఆవశ్వకతను చాటుతోంది.

పేదరికంమీద పోరులో ప్రధానాస్త్రంగా 'స్కిల్‌ ఇండియా'ను అభివర్ణించిన ప్రధాని మోదీ.. నిపుణ మానవ వనరుల విశ్వరాజధానిగా భారత్‌ ఆవిర్భవించాలని ప్రగాఢంగా అభిలషించారు. పని నైపుణ్యాలు కలిగిన శ్రామికశక్తి అమెరికాలో 52శాతం, యూకేలో 68, జర్మనీలో 75, జపాన్‌లో 80, దక్షిణ కొరియాలో 96శాతం ఉండగా.. ఇండియాలో అయిదుశాతం లోపు! ఈ వెనకబాటుతనాన్ని రూపుమాపి విశ్వవ్యాప్తంగా నైపుణ్య శ్రామికులకు ఏర్పడిన కొరతను యువభారత శక్తితో తీర్చగలిగేలా పటిష్ఠ కార్యాచరణ పై సర్కారీ ప్రకటనలు ఆశలు రేపుతున్నాయి. కరోనా అనంతర కాలంలో పారిశ్రామిక, సేవారంగాల్లో అనివార్య మార్పులకు అనుగుణంగా దేశ యువతకు సాంకేతిక మెలకువల్ని నైపుణ్యాల్ని మప్పడం- ఇప్పుడు ప్రభుత్వాల ముందున్న గడ్డుసవాలు. యాభైవేలమంది నిరుద్యోగ యువకులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడానికి ఆన్‌లైన్‌ సంస్థ 'కోర్సెరా'తో 'టాస్క్‌' (తెలంగాణ అకాడమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌) కొత్తగా ఒప్పందం కుదుర్చుకుంది. కరోనా ధాటికి కలలు చెదిరిన యువతను సొంతకాళ్లపై నిలబెట్టేలా వివిధ సంస్థలతో ఓఎస్‌డీఏ (ఒడిశా నైపుణ్యాభివృద్ధి సంస్థ) నాలుగు అవగాహన ఒడంబడికలపై సంతకాలు చేసింది. వచ్చే నాలుగైదేళ్లలో తగినంతమంది నిపుణ శ్రామికుల సరఫరాకు ఢోకా లేకుండా చూసే విపుల ప్రణాళికను మహారాష్ట్ర సర్కారు సిద్ధం చేస్తోంది. భిన్న రాష్ట్రాల చొరవకు కేంద్రం నుంచి సమధిక తోడ్పాటు జతపడితేనే 'స్కిల్‌ ఇండియా' నూతన జవసత్వాలు సంతరించుకోగలుగుతుంది. 2030 సంవత్సరంనాటికి 80కోట్ల మందికిపైగా యువజనులు నిరుద్యోగంలో కూరుకుపోతారని, వారిలో ఎక్కువమంది భారతీయులే ఉంటారన్న అధ్యయన నివేదిక సుమారు మూడేళ్లక్రితం కలకలం రేకెత్తించింది. అటువంటి అంచనాల్ని బదాబదలు చేసే దక్షత, సామర్థ్యం ‘స్కిల్‌ ఇండియా’లో ప్రతిఫలించేదెప్పుడు? కాలంతో పోటీపడి సమున్నత లక్ష్యాల సాధనలో భారత్‌ నెగ్గుకొచ్చేదెన్నడు?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.