ETV Bharat / lifestyle

Hair Growth Tips: కురుల సిరి సొంతం కావాలంటే... ఇవి తినాల్సిందే!!

author img

By

Published : Oct 9, 2021, 3:16 PM IST

శారీరక దృఢత్వానికి ఎలాంటి ఆహారం తీసుకుంటే మంచిదో చెప్పగలం గానీ.. బలమైన జుట్టుకు ఎటువంటి ఆహారం తీసుకోవాలో చెప్పలేము. అయితే నిగనిగలాడే పట్టులాంటి జుట్టు కోసం కొన్ని పోషకాలు లభించే పదార్థాలు తీసుకుంటే మంచిదని నిపుణులు అంటున్నారు. తద్వారా వివిధ రకాల జుట్టు సమస్యలకు చెక్‌ పెట్టవచ్చని అంటున్నారు. మరి అవెంటో చూద్దాం!

Hair Growth Tips:
Hair Growth Tips: కురుల సిరి సొంతం కావాలంటే... ఇవి తినాల్సిందే!!

పట్టుకుచ్చు శిరోజాలతో పొడవాటి జడతో మురిసిపోవాలని ప్రతి అమ్మాయీ కోరుకుంటుంది. కానీ ఎంతకీ ఎదగని జడ మదిలో కలవరపెడుతుంటుంది. రకరకాల ప్రయోగాలు చేయాలని ఉన్నా శిరోజాలు ఒత్తుగా లేక వెనుకడుగు వేస్తుంటారు కాలేజీ అమ్మాయిలు. ఇవేకాదు.. చుండ్రు, జుట్టు పొడిబారిపోవడం, చివర్లు చిట్లిపోవడం, రాలిపోవడం, నెరవడం వంటి సమస్యలు మహిళలని కలవరపరిచే సమస్యలే! ఒత్తిడి, అనారోగ్యం, జీవనశైలి ఈ పరిస్థితికి ప్రధాన కారణాలు. సరైన పోషకాహారాన్ని అందించడం ద్వారా అంటే మాంసకృతులు, ఇనుము, సంక్లిష్ట కార్బొహైడ్రేట్లు, విటమిన్లు, ఖనిజలవణాలు సమృద్ధిగా అందివ్వడం వల్ల ఈ పరిస్థితికి అడ్డుకట్ట వేయొచ్చు. శరీరంలో జింక్ లోపం ఉంటే శిరోజాల ఎదుగుదల సరిగా ఉండదు. అలాగే ఇనుము, విటమిన్ బి1, విటమిన్ సి, లైసీన్, నయాసిన్‌లు కూడా కురుల ఎదుగుదలకు కీలకం. బీటాకెరోటిన్, ఫ్యాటీ ఆమ్లాలు అందకపోతే చుండ్రు సమస్య తీవ్రం అవుతుంది. కాబట్టి ఆహారంలో ఇవన్నీ తప్పనిసరిగా ఉండేట్టు జాగ్రత్త పడాలి.

కోడిగుడ్డు..

దీనిలో సల్ఫర్ పుష్కలంగా ఉంటుంది. గుడ్డులోని సల్ఫర్ ఆధారిత అమైనో ఆమ్లాలు కెరటిన్‌ని అందించి జుట్టు ఆరోగ్యంగా, అందంగా ఎదగడానికి సహకరిస్తాయి. రోజువారీ ఆహారంలో ఒక గుడ్డుని తీసుకోవడం వల్ల పట్టుకుచ్చులాంటి కురులు, ఆరోగ్యవంతమైన గోళ్లు రెండూ సొంతమవుతాయి.

.

వేరుశెనగలు

పని తీవ్రత, మానసిక పరమైన ఒత్తిళ్ల కారణంగా చాలామందికి చిన్నవయసులోనే కురులు తెల్లబడిపోతుంటాయి. ఇటువంటి వారికి వేయించిన వేరుసెనగ మంచి ఆహారం. దీనిలోని బయోటిన్ అనే పదార్థం శిరోజాల ఆరోగ్యానికి రక్షణగా నిలుస్తుంది. జుట్టు రాలిపోతున్నా, చిట్లిపోతున్నా.. శరీరంలో బయోటిన్ లోపం ఉన్నట్టుగా అంచనా వేసుకోవాలి. వేరుసెనగలో ఇనుము కూడా అధికంగా ఉంటుంది. కాబట్టి వేయించిన పల్లీలను తింటే రంగుమారే సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. బయోటిన్ అందాలంటే బాదం, గుడ్డులోని పచ్చసొన, నువ్వులు, కాటేజ్ చీజ్ (పన్నీర్) కూడా తినొచ్చు. వీటి నుంచి క్యాల్షియం, ఇనుము, కొవ్వు బాగా అందుతాయి.

.

చిట్లిన చివర్లకు పరిష్కారం..

ఖర్జూరంలో ఇనుము పుష్కలంగా ఉంటుంది. ఈ ఇనుము అందకే చాలామందికి జుట్టు రాలిపోతుంటుంది. రోజుకో ఖర్జూరం తింటే ఎంతో మేలు. డ్రై ఫ్రూట్స్, ఎండుద్రాక్ష, ముదురు ఆకుపచ్చ రంగులో ఉండే ఆకుకూరలు, ఉసిరి వంటివి ఇనుమును అందించే ఇతర పదార్థాలు. చివర్లు చిట్లి ఇబ్బంది పడుతుంటే జామకాయలు చక్కని పరిష్కారం. జామలోని విటమిన్ సి చివర్లు చిట్లిపోకుండా కాపాడుతుంది. జామతోపాటు ఉసిరి, టమాటా, బత్తాయి ఇందుకు సహకరిస్తాయి. నయాసిన్ విటమిన్ మాంసం, మొలకెత్తిన గింజలు, పచ్చి బఠాణి, ఆకుపచ్చ బఠాణి, వేరుశెనగ, మొలకెత్తిన గోధుమ గింజల నుంచి ఎక్కువగా దొరుకుతుంది. ఈ విటమిన్ జుట్టు నెరవకుండా, రాలిపోకుండా కాపాడుతుంది. ఇది దంపుడు బియ్యం, పొట్టుతో ఉన్న గింజల నుంచి కూడా లభిస్తుంది.

కుదుళ్ల ఆరోగ్యానికి

చేపల్లో మాంసకృతులు అధికం. శిరోజాల ఎదుగుదలకి ఇవి కీలకం. వీటి నుంచి ఒమేగా 2 ఎక్కువగా లభిస్తుంది. ఇది జుట్టు పొడిబారిపోకుండా కాపాడుతుంది. చుండ్రు రాకుండా చూస్తుంది. గుడ్డు, చేపలు తినలేని వారికి సోయా చక్కని ప్రత్యామ్నాయం. ఆరోగ్యవంతమైన కుదుళ్లకి సోయాలోని లైసీన్ అమైనో ఆమ్లం బాగా ఉపకరిస్తుంది. మొలకలొచ్చిన గోధుమలలో విటమిన్ ఇ ఎక్కువ.

.

చుండ్రు బాధను తప్పించే జింక్

ఎన్ని జాగ్రత్తలు తీసుకొంటున్నా చుండ్రు సమస్య వేధిస్తుంటే దానికి జింక్ లోపం కూడా ఒక కారణమే. జింక్ పుష్కలంగా లభిస్తే తలలో చుండ్రు బాధ తప్పుతుంది. దాంతో పాటు జుట్టు పొడి బారే సమస్యా తగ్గుతుంది. గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఆహారంలో వీటిని చేర్చడం వల్ల పొడవైన ఆరోగ్యవంతమైన శిరోజాలు మీ సొంతమవుతాయి. ఇంకా తృణధాన్యాలు, బాదం, చేపలు, మటన్ల నుంచి జింక్ లభిస్తుంది. రోజులో కనీసం ఎనిమిది నుంచి పది గ్లాసుల నీటిని తాగితే మేలు.

బాదంతో మేలెంతో..

వ్యాధి నిరోధక శక్తిని పెంచి శిరోజాలు రాలిపోకుండా కాపాడే శక్తి యాంటీ ఆక్సిడెంట్లకు ఉంది. బాదం తినే వారిలో యాంటీ ఆక్సిడెంట్లకు కొదవ ఉండదు. కాలుష్యానికి, అతినీలలోహిత కిరణాలకు ప్రభావితమై శిరోజాలు పాడవకుండా బాదం చూస్తుంది. ముఖ్యంగా రక్తప్రసరణ బాగుపడేట్టు చేస్తుంది. వీటితో పాటు యాంటీ ఆక్సిడెంట్లు అందడానికి కాషాయం రంగులో ఉండే పండ్లు, కాయగూరలు తినాలి. అంటే మామిడి, కమలా, బొప్పాయి, క్యారట్, కూర గుమ్మడి అన్నమాట.

ఇదీ చూడండి.. బరువు తగ్గాలంటే.. తాగే నీటిలో ఇవి కలపాల్సిందే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.