ETV Bharat / jagte-raho

డిజిటల్ వేదికల ద్వారా సైబర్ నేరస్థులకు సమాచారం

author img

By

Published : Jan 7, 2021, 7:30 AM IST

దొంగ చేతికే తాళాలు ఇచ్చినట్లు... మనంతట మనమే సైబర్‌ నేరగాళ్లకు కావాల్సిన సమాచారమంతా డిజిటల్‌ వేదికల ద్వారా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో అందిస్తున్నామని సెంటర్‌ ఫర్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ అడ్వాన్స్‌డ్‌ కంప్యూటింగ్‌ (సీడాక్‌) హైదరాబాద్‌ కేంద్రం అసోసియేట్‌ డైరెక్టర్‌ సీహెచ్‌ఏఎస్‌ మూర్తి, ప్రాజెక్టు మేనేజర్‌ ఎం.జగదీష్‌బాబు అభిప్రాయపడ్డారు.

cyber criminals are getting personal information from digital applications
డిజిటల్ వేదికల ద్వారా సైబర్ నేరస్థులకు సమాచారం

ఆన్‌లైన్‌ కార్యకలాపాల్లో భాగంగా వివిధ వేదికలపై మనం పొందుపరిచిన సమాచారాన్ని కొల్లగొట్టి సైబర్‌ నేరగాళ్లు తిరిగి మనపైనే పంజా విసురుతున్నారని వ్యాఖ్యానించారు. వారి బారినపడకుండా ఉండాలంటే సైబర్‌ భద్రత, రక్షణ అనే రెండు అంశాలు ఎంతో ముఖ్యమన్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్‌, ఐటీ మంత్రిత్వశాఖ నిర్వహిస్తున్న ‘సమాచార భద్రత విద్య-అవగాహన’ ప్రాజెక్టు బాధ్యతలు చూస్తున్న వీరిరువురు తిరుపతిలో జరుగుతున్న ‘ఇగ్నైట్‌’కు హాజరయ్యారు. కొత్తతరహా సైబర్‌ నేరాలు ఎలా చోటుచేసుకుంటున్నాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? తదితర అంశాలపై ‘ఈటీవీభారత్​’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్ని విషయాలను వివరించారు.

అనుమతులు నిరాకరించండి

నిత్యం డౌన్‌లోడ్‌ చేసే యాప్‌ల్లో అత్యధికశాతం మన కాంటాక్ట్స్‌ మొదలుకుని, కెమెరా, లొకేషన్‌ వరకూ అన్నీ రకాల వాటికి యాక్సెస్‌ను అడుగుతాయి. మనం ఇవ్వడం వల్ల వాటన్నింటినీ ఆ యాప్‌ నిర్వాహకులు పొందేందుకు వీలుంటుంది. తాజాగా వెలుగుచూసిన సూక్ష్మ రుణయాప్‌ల మోసాలే దీనికి పెద్ద తార్కాణం. యాప్‌ ఇన్‌స్టాల్‌ చేయడం పూర్తయిన తర్వాత.. దానికి ఏయే యాక్సిస్‌లు ఇచ్చామో వాటిల్లో అవసరం లేనివి ఏవో చూసుకుని డిజబుల్‌ చేసుకోవాలి. మన సమాచారం తస్కరణకు గురికాకుండా ఉండేందుకు ఇది అత్యుత్తమ మార్గం.

ఎంతవరకూ ఇవ్వాలో అంతవరకే?

మనం ఉపయోగించే స్మార్ట్‌ఫోన్‌, కంప్యూటర్‌, ల్యాప్‌టాప్‌ ఇలా ఏదైనా సరే హ్యాకింగ్‌, మాల్‌వేర్‌ దాడుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యక్తిగత, విశ్వసనీయ, సాధారణ సమాచారాన్ని ఆన్‌లైన్‌ వేదికల్లో ఎంతవరకూ పొందుపరచొచ్చు? పంచుకోవొచ్చు? ఏ అవసరం కోసం ఎవరికి ఇస్తున్నాం? తదితర అంశాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలి. స్వీయనియంత్రణతో ఉంటే చాలావరకూ సైబర్‌ నేరాల బారినపడకుండా ఉండొచ్చు.

వెబ్‌సైట్‌ ద్వారా వెళ్లడం ఉత్తమ పద్ధతి

బ్యాంకులు, నగదు లావాదేవీలకు సంబంధించిన యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకోవాలనుకున్నప్పుడు. ఆయా సంస్థలకు సంబంధించిన నిజమైన వెబ్‌సైట్‌లోకి వెళ్లి అక్కడిచ్చే లింక్‌ను క్లిక్‌ చేస్తే అది ప్లేస్టోర్‌లోకి నేరుగా రీడైరెక్ట్‌ అవుతుంది. అసలైన యాప్‌ను పొందటానికి ఇది ఉత్తమ పద్ధతి.

షార్ట్‌ యూఆర్‌ఎల్‌లను నేరుగా క్లిక్‌ చేయొద్దు

ప్రాచుర్యం పొందిన బ్రాండ్లకు సంబంధించిన వస్తువుల్ని అతి తక్కువ ధరకు, భారీ రాయితీలతో ఇస్తామంటూ సెల్‌ఫోన్లకు సందేశాలు వస్తుంటాయి. వాటి కింద చిన్న లింక్‌ ఇచ్చి క్లిక్‌ చేయమని ఆ సందేశాల్లో కోరుతారు. వాటినే షార్ట్‌ యూఆర్‌ఎల్‌ అంటారు. వాటిని క్లిక్‌ చేస్తే మీ ఫోన్‌లోకి మాల్‌వేర్‌ చొప్పించి.. మొత్తం సమాచారాన్ని సైబర్‌ నేరగాళ్లు తస్కరిస్తారు. అలాంటి సందేశాలు వచ్చినప్పుడు లింక్‌ను నేరుగా క్లిక్‌ చేయకుండా.. దాన్ని కాపీ చేసుకుని.. దాన్ని పూర్తి యూఆర్‌ఎల్‌ కోసం వెతికితే అది మోసపూరితమైనదా? నిజమైనదా? అనే గుట్టు బయటపడుతుంది.

పబ్లిక్‌ వైఫైతో ఆర్థిక కార్యకలాపాలు వద్దే వద్దు

పబ్లిక్‌ వైఫై, ఓపెన్‌ వైఫైలతో ఎట్టి పరిస్థితుల్లోనూ ఆన్‌లైన్‌ ఆర్థిక లావాదేవీలు మాత్రం నిర్వహించొద్దు. బ్రౌజింగ్‌ చేయండి. ఆ వైఫైల రూటర్‌ సైబర్‌ నేరగాళ్ల చేతికి చిక్కితే మీ బ్యాంకు ఖాతాలకు సంబంధించిన విశ్వసనీయ సమాచారం అంతా వారి పాలవుతుంది. తద్వారా మీ సొమ్ములు కొల్లగొట్టేందుకు మీరే వారికి అవకాశం ఇచ్చినట్లు అవుతుంది.

చిత్రాల రిజల్యూషన్‌ చాలా తక్కువగా ఉండాలి

సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేసే వ్యక్తిగత చిత్రాల రిజల్యూషన్‌ చాలా తక్కువగా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకూ బృందంగా ఉన్నవి పెట్టుకోవడం ఉత్తమం. మీ స్నేహితుల సమాచారాన్ని పోస్టు చేయవద్దు. కొందరు గోప్యత సెట్టింగులు అందుబాటులో ఉన్నా.. అందరికీ కనిపించేలా వాటిని పోస్టు చేస్తున్నారు. దీని వల్ల మహిళల చిత్రాల్ని మార్ఫింగ్‌ చేసి, అభ్యంతరకర వెబ్‌సైట్‌ల్లో వాటిని వినియోగించడం చేస్తున్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.