ETV Bharat / jagte-raho

హేమంత్‌ హత్య కేసులో మలుపు.. తెరపైకి అవంతి సోదరుడు!

author img

By

Published : Sep 28, 2020, 7:04 AM IST

Updated : Sep 28, 2020, 8:06 AM IST

Hemant murder case news
Hemant murder case news

ప్రేమించి పెళ్లిచేసుకుని హత్యకు గురైన హేమంత్‌ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. హత్యానేరంలో అవంతి సోదరుడు ఆశిష్‌రెడ్డి పేరు కొత్తగా తెరపైకి వచ్చింది. మరోపక్క పరారీలో ఉన్న ఇద్దరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన హేమంత్‌ కేసులో హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు పూర్తి వివరాలు సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. గొంతుకు తాడు బిగించడం వల్లే హేమంత్‌ మరణించినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వైద్యులు నిర్ధారించారని పోలీసులు తెలిపారు. మరోవైపు ఘటన జరిగిన రోజు నుంచి ఇప్పటి వరకు హేమంత్‌ మొబైల్‌ ఫోన్‌ లభ్యం కాలేదు. పోలీసులు దానిని సేకరించే పనిలో పడ్డారు.

ఏడు నెలలు.. ఇంటి చుట్టూ సీసీ కెమెరాలు..

ఆదివారం అవంతి మీడియాతో మాట్లాడారు ‘‘మా ప్రేమ విషయం ఏడు నెలల క్రితం ఇంట్లో తెలిసింది. అప్పటి నుంచి ఎన్నో ఆంక్షలు..ఉద్యోగం మాన్పించి ఇంటికే పరిమితం చేశారు. సెల్‌ఫోన్‌ లాక్కుని బయటి వారితో సంబంధాలు లేకుండా కట్టడి చేశారు. నేను ఏదైనా అఘాయిత్యానికి పాల్పడతాననే భయంతో ఇంటి చుట్టూ, ఆరుబయట సీసీ కెమెరాలతో నిఘా ఉంచారు. 24 గంటలూ నేను ఏం చేస్తున్నా కుటుంబ సభ్యుల్లో ఎవరో ఒకరు గమనిస్తూ ఉండేవారు. అతికష్టం మీద హేమంత్‌తో మాట్లాడి బయటకెళ్లి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చా.

అమ్మానాన్నల పెళ్లిరోజు అని ఆగిపోయాం

జూన్‌ 5, 6, 10వ తేదీల్లో ఏదో ఒక రోజు వివాహానికి ముహూర్తం ఖరారు చేయాలనుకున్నాం. జూన్‌ 6న మా తల్లిదండ్రుల వివాహ వార్షికోత్సవం. ఆ రోజు వారిని బాధపెట్టడం ఇష్టంలేక పెళ్లి వాయిదా వేసుకున్నాం. పెళ్లికి ముందు రోజు రాత్రి హేమంత్‌ కారుతో వచ్చాడు. అదే సమయంలో ఇంట్లో కరెంటు పోవటంతో తేలికగా బయటకు వచ్చా. మన ప్రేమను గెలిపించేందుకు దైవం కూడా ఆ రూపంలో సహాయం చేశాడంటూ హేమంత్‌ అన్నాడు. పెళ్లి చేసుకున్న తర్వాత చందానగర్‌ పోలీస్‌స్టేషన్‌లో ఇరువర్గాలను పిలిపించి మాట్లాడమని సీపీ సజ్జనార్‌ పోలీసులకు చెప్పారు’’ అని వివరించారు.

పోలీసుల ముందే దుర్భాషలాడారు

ఇన్‌స్పెక్టర్‌ రవీందర్‌రెడ్డి, మరో ఎస్సై ఇద్దరూ తన తల్లిదండ్రులకు మద్దతుగానే ప్రవర్తించారని అవంతి ఆరోపించారు. అమ్మానాన్నల వద్దకు వెళ్తావా, ఎక్కడ ఉంటావో తేల్చుకోమని చెప్పారన్నారు. ఆ సమయంలో పోలీసుల ముందే తల్లిదండ్రులు నానా దుర్భాషలాడారని కన్నీటి పర్యంతమయ్యారు. తన అత్తను కూడా అసభ్యపదజాలంతో దూషించారని తెలిపారు. తమకు ప్రాణహాని ఉందని చందానగర్‌ స్టేషన్‌లో జూన్‌ 15న ఫిర్యాదు చేశామని, పోలీసులు అప్పుడే స్పందించి ఉంటే ఇలాంటి ఘోరం జరిగేది కాదన్నారు. అత్తవారింట్లో తాను ఎంతో సంతోషంగా ఉన్నట్లు చెప్పారు. ఇంత దుర్మార్గంగా ప్రవర్తించిన నిందితులకు కఠినశిక్షలు పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తన భర్త హేమంత్‌ ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి వీరాభిమాని అని అవంతి తెలిపారు. ఈ కేసులో తనకు న్యాయం జరిగేలా ఆయన సాయం చేయాలని కోరారు.

Last Updated :Sep 28, 2020, 8:06 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.