ETV Bharat / international

Afghan crisis: 'దేశం వీడి వెళ్తారా? కాల్చి పడేస్తాం!'

author img

By

Published : Aug 22, 2021, 5:57 PM IST

వేలాది అఫ్గాన్ పౌరులు, విదేశీయులు అఫ్గానిస్థాన్​ వదిలి పారిపోవడానికి పరుగులు తీస్తున్నకొద్దీ కాబుల్ విమానాశ్రయం బయటి దృశ్యాలు మరింత భయానకంగా మారుతున్నాయి. తాలిబన్ల చెర నుంచి ప్రాణాలతో బయటపడేందుకు ఎయిర్‌పోర్టుకు వెళ్తున్న పౌరులపై ముష్కర మూకలు దాడులకు తెగబడుతున్నాయి. కాల్పులు జరపటంతో పాటు తాళ్లు, కర్రలతో కొట్టి తరుముతున్నట్లు ఓ అంతర్జాతీయ మీడియా ప్రతినిధి చెప్పడం భయాందోళనకు గురిచేస్తోంది. విమానాశ్రయం వైపు ప్రయాణించడం అంటే ప్రాణాలతో చెలగాటమే అని.. ఓ తాలిబన్‌ నాయకుడు పేర్కొనటం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

Deadly chaos continues at Kabul airport
తాలిబన్​ల అరాచకాలు

అఫ్గానిస్థాన్‌లో ఇంకా పూర్తిస్థాయిలో అధికార పగ్గాలు చేపట్టకముందే తాలిబన్ల అరాచకాలు రోజురోజుకు పెచ్చుమీరుతున్నాయి. సాయుధులైన తాలిబన్ మూకలు వీధుల్లో తిరుగుతూ ప్రజల్లో భయోత్పాతాన్ని సృష్టిస్తున్నారు. వేలాది మంది అఫ్గాన్‌ పౌరులు, విదేశీయులు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని కాబూల్‌ విమానాశ్రయానికి పరుగులు తీస్తున్నారు. అయితే అప్పటికే వీధుల్లో తుపాకులతో తిరుగుతున్న ముష్కర మూకలు వారిని ఎయిర్‌పోర్టుకు వెళ్లనివ్వకుండా అడుగడుగునా అడ్డుకుంటున్నాయి. అఫ్గాన్ పౌరులు దేశం వదిలి వెళ్లాలని తాము కోరుకోవడం లేదని చెబుతూ విమానాశ్రయం వైపు వెళ్లే రహదారుల్లో మిలిటెంట్లు చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. విమానాశ్రయం వైపు ప్రయాణించడం అంటే ప్రాణాలతో చెలగాటమే అని పేరు బయటపెట్టని ఒక తాలిబన్ అధికారి రాయిటర్స్‌కు చెప్పటం అక్కడి పరిస్థితులకు అద్దం పడుతోంది.

అమెరికా దళాల అధీనంలో...

ప్రస్తుతం విమానాశ్రయం లోపలి ప్రాంతాన్ని మాత్రమే దాదాపు 6 వేల మంది అమెరికా, నాటో దళాలు తాత్కాలికంగా తమ అధీనంలో ఉంచుకున్నారు. అయితే తాలిబన్లు భారీ ఆయుధాలతో ఎయిర్‌పోర్టును చుట్టుముట్టినట్లు స్థానిక మీడియా పేర్కొంది. అటు ఎయిర్‌పోర్టుకు వెళ్లే అన్ని ప్రధాన మార్గాల్లోనూ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసిన తాలిబన్లు అటుగా వెళ్తున్న వారిని అడ్డుకుంటున్నారు. చెక్‌పోస్టు పాయింట్ల వద్ద ముష్కర మూకలు గాల్లోకి కాల్పులు జరుపుతున్నట్లు లాస్‌ ఏంజెల్స్‌ టైమ్స్‌ ప్రతనిధి ఒకరు తెలిపారు. ప్రజలపైకి తుపాకీలు గురిపెట్టడం, వారిని తాళ్లు, కర్రలతో కొట్టి తరుముతుండడం స్వయంగా చూసినట్లు పేర్కొన్నారు.

తాలిబన్ల అరాచక పాలనకు భయపడి వేలాది మంది అఫ్గాన్‌ పౌరులు తరలివెళ్తుండటంతో ఎయిర్‌పోర్టుకు వెళ్లే మార్గాలన్నీ రద్దీగా మారాయి. ఆయా ప్రాంతాల ఉపగ్రహ చిత్రాలను పరిశీలిస్తే వాహనాల తాకిడితో ఎయిర్‌పోర్టు మార్గాల్లో విపరీతమైన రద్దీ నెలకొంది.

ఐరోపా దేశాలు, అమెరికా, బ్రిటన్‌ ప్రభుత్వాలు తమ పౌరులను, ఆఫ్గాన్ సహోద్యోగులను హడావుడిగా స్వదేశానికి తరలిస్తుండడం వల్ల విమానాశ్రయం దగ్గర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి.

వాణిజ్య విమాన సంస్థల సాయం కోరిన అమెరికా..

భయానకర పరిస్థితుల మధ్యన ఉన్న అఫ్గానిస్థాన్​ను వదిలి వచ్చే వారిని తీసుకొచ్చేందుకు పలు వాణిజ్య విమానయాన సంస్థల సహకారాన్ని కోరింది అమెరికా.

ప్రస్తుతం యుద్ధ విమానాల సాయంతో అఫ్గాన్​ నుంచి ప్రజలను తరలిస్తోంది అగ్రరాజ్యం. అయితే... ఆగస్టు 31లోగా వేలాది మందిని తరలించడం సవాలుగా మారిన నేపథ్యంలో ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టింది. కాబుల్​ నుంచి యుద్ధ విమానాల్లో పొరుగు దేశాలకు తీసుకొచ్చి.. అక్కడ నుంచి 18 వాణిజ్య విమానాల్లో అమెరికాకు తరలించాలని నిర్ణయించింది.

అమెరికా విమానంలోనే అఫ్గాన్​ మహిళ ప్రసవం..

అమెరికా ఎయిర్​ఫోర్స్​కు సంబంధించిన సీ-17 విమానంలో అఫ్గాన్​ మహిళ ప్రసవించినట్లు ఆ దేశ మిలటరీ అధికారులు తెలిపారు. విమానం ఎక్కే సమయానికే ఆమెకు పురిటి నొప్పులు మొదలైనట్లు చెప్పారు. ఈ క్రమంలో ఎయిర్​ క్రాఫ్ట్​ను కొంతమేర తక్కువ ఎత్తులో నడిపామన్నారు. దీంతో ప్రసవం సులభమైందని పేర్కొన్నారు.

అఫ్గానిస్థాన్​కు విమాన సేవలు నిలిపివేసిన పాక్​...

అఫ్గానిస్థాన్​లో నెలకొన్న పరిస్థితులతో కాబుల్​కు విమాన ప్రయాణాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది పాకిస్థాన్​. ప్రస్తుతానికి అక్కడ చిక్కుకున్న వారిలో ఎవరినీ... స్వదేశానికి తరలించడం లేదని అక్కడి మీడియా సంస్థలు తెలిపాయి. తాలిబన్​లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత అఫ్గాన్ ​నుంచి దౌత్యవేత్తలను, పౌరులను తరలించేందుకు విమానాలు నడిపిన పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్.. గత వారమే సేవలను రద్దు చేసినట్లు పేర్కొన్నాయి.

ఇవీ చూడండి:

Afghan refugees: దేశాన్ని వీడే అఫ్గాన్​ ప్రజల పరిస్థితేంటి?

'అఫ్గాన్​లో చిక్కుకున్న అమెరికా పౌరులకు ఐఎస్​ ముప్పు'

Afghan crisis: ఆకలి మరచి.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.