అమెరికాలో దీపావళికి సెలవు?.. కాంగ్రెస్​లో బిల్లు.. బైడెన్​ ఓకే చెప్పడమే ఆలస్యం!

author img

By

Published : May 27, 2023, 1:57 PM IST

Updated : May 27, 2023, 2:53 PM IST

US Diwali Holiday

US Diwali Holiday : దీపావళి పండుగ రోజు సెలవు దినంగా ప్రకటించాలని అమెరికా కాంగ్రెస్‌లో డెమోక్రటిక్‌ పార్టీకి చెందిన సభ్యురాలు ఓ బిల్లు ప్రవేశపెట్టారు. ఈ ప్రతిపాదనకు భారతీయ కమ్యూనిటీతో సహా వివిధవర్గాల నుంచి సానుకూల స్పందన లభించింది. ఈ బిల్లుకు కాంగ్రెస్‌ ఆమోదం తర్వాత అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ వద్దకు చేరనుంది. ఆయన సంతకం చేస్తే.. ఈ బిల్లు చట్టమవుతుంది.

US Diwali Holiday : భారతీయులకు ముఖ్యమైన పండగల్లో దీపావళి ఒకటి. అయితే అగ్రరాజ్యం అమెరికాలో దీపావళి పర్వదినానికి సెలవు ఇచ్చేందుకు కసరత్తు జరుగుతోంది. ఈ అంశాన్ని ప్రతిపాదిస్తూ ఆ దేశ కాంగ్రెస్​లో కాంగ్రెస్‌ దిగువ సభ అయిన ప్రతినిధుల సభలో శుక్రవారం ఓ బిల్లును ప్రవేశపెట్టారు చట్టసభ్యురాలు గ్రేస్డ్‌ మెంగ్‌ యూఎస్‌.

'దీపావళి డే యాక్ట్‌' పేరుతో తీసుకొచ్చిన ఈ బిల్లును అమెరికా వ్యాప్తంగా పలు కమ్యూనిటీలు స్వాగతించాయి. 'దీపావళిని రోజున ఫెడరల్‌ ప్రభుత్వ సెలవు దినంగా అధికారికంగా ప్రకటిస్తే.. కుటుంబాలు కలిసి వేడుకలు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేగాక, విభిన్న సంస్కృతులకు ప్రభుత్వం ఇచ్చే విలువను ఈ నిర్ణయం చాటుతుంది' అని మెంగ్‌ తన బిల్లులో పేర్కొన్నారు.

2021లోనూ పెట్టారు కానీ..
US Diwali : దీపావళిని భారత్​లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ప్రవాస భారతీయులతో సహా విదేశీయులు కూడా ఘనంగా జరుపుకుంటారు. చీకటిపై వెలుతురు, చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈ పర్వదినాన్ని తరతరాలుగా జరుపుకుంటున్నారు. న్యూయార్క్‌లోని క్వీన్స్‌ ప్రాంతంలో పలు కమ్యూనిటీలు ప్రతి సంవత్సరం ఈ పండగను వైభవంగా నిర్వహిస్తాయి. ఇదిలా ఉంటే ఈ బిల్లును భారత సంతతి చట్టసభ్యులు సహా పలు కమ్యూనిటీల నేతలు స్వాగతిస్తున్నారు. దీపావళిని సెలవు దినంగా ప్రకటించాలని కోరుతూ 2021లోనూ యూఎస్‌ కాంగ్రెస్‌లో ఓ బిల్లును ప్రవేశపెట్టగా పలు కారణాలతో అది కార్యరూపం దాల్చలేదు.

అధ్యక్షుడు ఓకే అంటే.. 12వ సెలవుగా!
ఈ బిల్లు యూఎస్​ కాంగ్రెస్‌లో ఆమోదం పొంది.. అధ్యక్షుడు సంతకం చేసిన తర్వాత అగ్రరాజ్యంలో దీపావళి పర్వదినాన సెలవు దినంగా ప్రకటించేందుకు వీలు కలుగుతుంది. అదే జరిగితే అమెరికాలో ఫెడరల్‌ గుర్తింపు పొందిన 12వ సెలవుగా దీపావళి నిలవనుంది.

జూన్​ 8లోపు ఆమోదం!
US Diwali News : దీపావళి పర్వదినంతో పాటు చాంద్రమాన కొత్త సంవత్సరం రోజున న్యూయార్క్‌లో సెలవు ప్రకటించాలంటూ గత కొన్నేళ్లుగా డిమాండ్​ వినిపిస్తోంది. ఇందుకు చట్టసభ సభ్యులు, ప్రవాస సభ్యులు చేస్తున్న పోరాటం ఎట్టకేలకు ఫలించనుంది. ఆ రెండు రోజులను సెలవులుగా ప్రకటించేలా చట్టాన్ని రూపొందించాలని న్యూయార్క్‌ అసెంబ్లీ భావిస్తోంది. న్యూయార్క్‌లో నివసిస్తున్న ప్రజల విభిన్న సంస్కృతి సాంప్రదాయాలను గుర్తించాల్సిన అవసరం ఉందని.. దీపావళి, చాంద్రమాన కొత్త సంవత్సరం రోజులను సెలవు దినాలుగా ప్రకటించేందుకు అసెంబ్లీ సమావేశాలు ముగిసే జూన్‌ 8 లోపు చట్టాన్ని ఆమోదిస్తామని అసెంబ్లీ స్పీకర్‌ కార్ల్‌ హేస్టీ వెల్లడించారు. పాఠశాల క్యాలెండరులో అమలు చేసే విషయమై కూడా చర్చలు జరుపుతున్నామని ఆయన వివరించారు.

Last Updated :May 27, 2023, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.