'నాటో'లోకి ఇండియా? మోదీ టూర్​కు ముందు అమెరికా ప్లాన్! చైనాకు చుక్కలే!

author img

By

Published : May 27, 2023, 8:09 AM IST

India NATO Plus

India NATO offer : దుందుడుకు స్వభావంతో పొరుగు దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నిస్తున్న చైనాకు దిమ్మదిరిగే షాక్ ఇచ్చేందుకు అమెరికా ప్లాన్ చేస్తోంది! భారత్​ను 'నాటో ప్లస్'లోకి చేర్చుకోవడం ద్వారా డ్రాగన్​కు ముచ్చెమటలు పట్టించాలని భావిస్తోంది.

India NATO offer : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా పర్యటనకు ముందు కీలక పరిణామం జరిగింది. భారత్​ను నాటో ప్లస్ కూటమిలో చేర్చుకోవాలని అమెరికా కాంగ్రెస్​లోని అత్యంత శక్తిమంతమైన కమిటీ సిఫార్సు చేసింది. తద్వారా నాటో ప్లస్ బలపడుతుందని పేర్కొంది. 'అమెరికా, చైనా కమ్యూనిస్ట్ పార్టీ మధ్య వ్యూహాత్మక పోటీ'పై ఏర్పాటు చేసిన హౌస్ సెలెక్ట్ కమిటీ ఈ మేరకు ప్రతిపాదించింది. ఈ కమిటీకి మైక్ గాలగర్ (రిపబ్లికన్) ఛైర్మన్​గా, రాజా కృష్ణమూర్తి (డెమొక్రాట్) సభ్యుడిగా ఉన్నారు. తైవాన్​ భద్రత సహా, 'నాటో ప్లస్' బలోపేతం కోసం భారత్​ను భాగస్వామిగా చేసుకోవాలని ఈ కమిటీ స్పష్టం చేసింది.

"తైవాన్ భద్రతా డిమాండ్లను తీర్చడం సహా చైనా కమ్యూనిస్ట్ పార్టీతో వ్యూహాత్మక పోటీలో విజయం సాధించాలంటే తన మిత్రపక్షాలు, భాగస్వాములతో అమెరికా తన సంబంధాలు బలోపేతం చేసుకోవాలి. భారత్​ను నాటో ప్లస్​లోకి చేర్చుకుంటే.. ప్రపంచ భద్రతకు పాటుపడటం సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలో సీసీపీ దూకుడుకు కళ్లెం వేయవచ్చు. ఒకవేళ తైవాన్​పై చైనా దాడి చేస్తే.. జీ7, నాటో, నాటో ప్లస్, క్వాడ్ కూటములు ఏకతాటిపైకి వచ్చి డ్రాగన్ దేశంపై ఆంక్షలు పటిష్ఠంగా అమలు అయ్యేలా చూడొచ్చు. చైనాపై ఆంక్షలు విధించే విషయంలో '2023 స్టాండ్ విత్ తైవాన్ యాక్ట్' తరహా చట్టాన్ని కాంగ్రెస్ ఆమోదించాలి."
-కాంగ్రెస్ కమిటీ సిఫార్సులు

India NATO Plus : నాటో ప్లస్ అనేది.. నాటో దేశాలకు, అందులో సభ్యులుగా లేని అమెరికా మిత్రదేశాలకు మధ్య వారధిగా నిలుస్తుంది. దేశాల మధ్య రక్షణ సహకారాన్ని మెరుగుపర్చేందుకు ఈ ఏర్పాటు చేసుకున్నారు. నాటో ప్లస్​లో ప్రస్తుతం ఐదు దేశాలు సభ్యులుగా ఉన్నాయి. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, జపాన్, ఇజ్రాయెల్, దక్షిణకొరియాలు ఇందులో సభ్య దేశాలుగా ఉన్నాయి. అందుకే దీన్ని 'నాటో ప్లస్ 5'గానూ పిలుస్తారు. భారత్ ఈ కూటమిలో చేరితే.. ఈ దేశాలతో నిఘా సమాచారాన్ని పంచుకోవడానికి మరింత వెసులుబాటు లభిస్తుంది. ఆయా దేశాల మిలిటరీ టెక్నాలజీని వేగంగా పొందే వీలు ఉంటుంది.

చైనా కమిటీ..
రిపబ్లికన్ పార్టీ నేతల నాయకత్వంలో ఈ సెలెక్ట్ కమిటీని ఏర్పాటు చేశారు. దీన్ని చైనా కమిటీగా పిలుస్తుంటారు. భారత్​ను నాటో ప్లస్ కూటమిలోకి చేర్చుకునే ప్రతిపాదనపై భారతీయ అమెరికన్ రమేశ్ కపూర్ గత ఆరేళ్లుగా పనిచేస్తున్నారు. '2024 నేషనల్ డిఫెన్స్ ఆథరైజేషన్ యాక్ట్'లో సెలెక్ట్ కమిటీ సిఫార్సులకు చోటు దక్కుతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

మోదీ పర్యటన
ప్రధాని మోదీ జూన్​లో అమెరికాలో అధికారిక పర్యటన చేపట్టనున్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడన్​తో జూన్ 22న భేటీ అవుతారు. ఈ పర్యటనలో మోదీకి బైడెన్ అధికారికంగా డిన్నర్ పార్టీ ఇవ్వనున్నారు. ఈ ఏడాది జీ20 కూటమికి భారత్ నాయకత్వం వహిస్తున్న నేపథ్యంలో.. ప్రధాని పర్యటనకు ప్రాధాన్యం ఏర్పడింది. జీ20 శిఖరాగ్ర సదస్సుకు రావాలని బైడెన్​ను మోదీ ఆహ్వానించే అవకాశం ఉంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.