ETV Bharat / international

ఉక్రెయిన్ యుద్ధంలో జపాన్ పేరు.. అసలేంటీ కామోకాజి డ్రోన్లు?

author img

By

Published : Oct 20, 2022, 6:30 AM IST

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధంలో జపాన్‌ పేరు మారు మోగిపోతోంది! గత వారం రోజులుగానైతే ఇది మరింత పెరిగిపోయింది. ఉక్రెయిన్‌ పదేపదే కామెకాజి... కామెకాజి అంటూ ఆరోపిస్తోంది. ఇంతకూ ఈ యుద్ధానికి జపాన్‌కు ఏంటి సంబంధం? ఉక్రెయిన్‌ను బాధపెడుతున్న ఈ కామెకాజి ఏంటి?

UKRAINE RUSSIA WAR
UKRAINE RUSSIA WAR

కొద్దిరోజుల కిందట ఉక్రెయిన్‌ నుంచి ఎదురు దెబ్బలు తిన్న రష్యా అక్టోబరు 10 నుంచి దాడిని తీవ్రం చేసింది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌తో పాటు అనేక పట్టణాలపై విరుచుకుపడుతోంది. సొంత క్షిపణులతో పాటు ఇరాన్‌లో తయారైన కామెకాజి డ్రోన్లను ఈ దాడుల్లో రష్యా వినియోగిస్తున్నట్లు ఉక్రెయిన్‌ ఆరోపించింది. ఇందుకుగాను ఉక్రెయిన్‌తో పాటు అమెరికా తదితర దేశాలన్నీ ఇరాన్‌పైనా ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. ఇరాన్‌ మాత్రం కామెకాజి డ్రోన్లను తాము రష్యాకు సరఫరా చేయలేదంటోంది. మొత్తానికి యుద్ధంలో ప్రస్తుతం కామెకాజి డ్రోన్లు ప్రధానాంశమయ్యాయి. ఎందుకంటే ఇవి... ఆత్మాహుతి డ్రోన్లు!

UKRAINE RUSSIA WAR
ఉక్రెయిన్​లో కామోకాజి డ్రోన్
UKRAINE RUSSIA WAR
డ్రోన్ దాడి

క్షిపణులను మోసుకుపోయి... లక్ష్యంపై సంధించగానే డ్రోన్లు తిరిగి మూలస్థానానికి చేరుకుంటాయి. కానీ కామెకాజి డ్రోన్లు అలాంటివి కావు. ఇవి ఆత్మాహుతి డ్రోన్లు. క్షిపణులతో పాటు లక్ష్యంపైకి దూసుకెళ్లి నాశనం చేస్తాయి... నాశనం అవుతాయి. మామూలుగా క్రూయిజ్‌ క్షిపణులను వందల కిలోమీటర్ల దూరం నుంచే శత్రువుపై ప్రయోగించవచ్చు. కానీ ఇవి చాలా ఖర్చుతో కూడుకున్నవి. అదే కామెకాజి డ్రోన్లైతే చిన్నగా ఉంటాయి. తక్కువ ధరలో వస్తాయి. ఉదాహరణకు క్రూయిజ్‌ క్షిపణికి రష్యాకు సుమారు 10 లక్షల డాలర్లు ఖర్చయితే... ఈ కామెకాజి డ్రోన్‌ 20వేల డాలర్లలో వస్తుంది. లక్ష్య ఛేదనలో కచ్చితత్వమూ వీటికి ఎక్కువే.

UKRAINE RUSSIA WAR
డ్రోన్ విధ్వంస చిత్రం
UKRAINE RUSSIA WAR
ధ్వంసమైన డ్రోన్

వీటికి ఇరాన్‌ షహీద్‌ (అమరులు) డ్రోన్లు అని పేరు పెట్టింది. రష్యా వీటిని జెరాన్‌-2గా పిలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా వీటికి కామెకాజి డ్రోన్లు అని పేరు. ఇది జపాన్‌ పేరు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్‌ కామెకాజి పైలట్లు... తమ యుద్ధ విమానాలతో బాంబులు వేసి తిరిగి రావటానికి బదులు... బాంబులతో పాటు ఆ విమానాన్ని కూడా శత్రుదేశ లక్ష్యంపై పడేసి ఆత్మాహుతి దాడి చేసే వారు. ముఖ్యంగా... బ్రిటన్‌ దాని మిత్రదేశాల యుద్ధనౌకలపై వీటితో దాడి చేశారు. సుమారు 3800 మంది జపాన్‌ కామెకాజి పైలట్లు అప్పుడు ఆత్మాహుతి దాడుల్లో పాల్గొన్నారు. ఇరాన్‌ డ్రోన్లు కూడా అలాంటి ఆత్మాహుతి దాడినే చేస్తాయి కాబట్టి వీటికి కామెకాజి డ్రోన్లుగా పేరొచ్చింది.

UKRAINE RUSSIA WAR
.

40 కిలోల బరువు గల విస్పోటంతో వెయ్యి కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్నీ ఇవి ఛేదించగలవు. అయితే ఉక్రెయిన్‌లో తక్కువ దూరంలోనే వీటిని వాడుతున్నారు. అలాంటి డ్రోన్లను ఇరాన్‌నుంచి సుమారు 2500 దాకా రష్యా కొనుగోలు చేసిందన్నది ఉక్రెయిన్‌ ఆరోపణ. ఉక్రెయిన్‌ ఇంధన సంస్థలు, కీలకమైన కార్యాలయాలపై దాడులకు రష్యా ఈ డ్రోన్లను వాడుకుంటోంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.