ETV Bharat / international

లంకలో ఆగని నిరసనలు.. అఖిలపక్ష సర్కార్​కు విపక్షాలు ఓకే

author img

By

Published : Jul 10, 2022, 9:15 PM IST

Sri Lankan parties agree to form all-party interim government after President Rajapaksa's resignation
Sri Lankan parties agree to form all-party interim government after President Rajapaksa's resignation

శ్రీలంకలో అఖిలపక్ష ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు ఓ అంగీకారానికి వచ్చాయి విపక్ష పార్టీలు. జులై 13న అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేసిన అనంతరం.. తాము ప్రభుత్వ ఏర్పాటుచేస్తామని స్పష్టం చేశాయి. మరోవైపు.. ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలని ప్రజలు నిరసనలు చేస్తూనే ఉన్నారు.

శ్రీలంకలో రాజకీయ సంక్షోభానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. అఖిలపక్ష మధ్యంతర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు లంక ప్రధాన విపక్ష పార్టీలు అంగీకరించాయి. విపరీత ఆర్థిక సంక్షోభంలో దేశం చిక్కుకుపోయిన నేపథ్యంలో ప్రజలు ఆందోళనలు చేస్తున్నారు. శనివారం ఇవి ఉద్ధృతంగా మారాయి. ఈ నేపథ్యంలో అధ్యక్షుడు గొటబాయ రాజపక్స తన అధికారిక నివాసాన్ని వీడి ఎక్కడో తలదాచుకుంటున్నారు. మరోవైపు.. రాజీనామా చేస్తానని జులై 9నే ప్రకటించారు ప్రధాని రణిల్​ విక్రమసింఘే. పార్లమెంట్​ స్పీకర్​ కోరిన నేపథ్యంలో.. జులై 13న రాజీనామా చేసేందుకు అధ్యక్షుడు రాజపక్స అంగీకరించారు. ఈ నేపథ్యంలో.. దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించేందుకు ఉమ్మడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు శనివారం జరిగిన అఖిలపక్ష భేటీ అనంతరం వెల్లడించారు అధికార శ్రీలంక పొదుజన పెరమున పార్టీ నేత విమల్​ వీరవన్స.

మరోవైపు.. అధ్యక్షుడు జులై 13న రాజీనామా చేసే వరకు నిరసనలు విరమించబోమని చెబుతున్నారు లంక ప్రజలు. తర్వాత 6 నెలలు కొంతమంది ఇక్కడ ఉంటారని, మరికొందరు నిరసన ప్రాంతాలను వీడతారని చెప్పారు. తమ న్యాయం కోసం, హక్కుల కోసం పోరాడుతున్నట్లు వివరించారు.

లంక ప్రజలకు అండగా నిలుస్తాం.. భారత్​ ప్రకటన: శ్రీలంక పరిస్థితిని క్షుణ్నంగా పరిశీలిస్తున్నట్లు భారత్‌ తాజాగా ఓ ప్రకటన చేసింది. శ్రీలంక ప్రజలకు అండగా ఉంటామని వెల్లడించింది. ప్రజాస్వామ్య మార్గాలు, రాజ్యాంగ విలువలు, పురోగతి కోసం ప్రయత్నిస్తున్న శ్రీలంక ప్రజలకు భారత్‌ అండగా నిలుస్తుందంటూ విదేశాంగ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది.
ద్వీప దేశంలో ఆర్థిక సంక్షోభం మొదలైనప్పటి నుంచి భారత్‌ దన్నుగా నిలుస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి గుర్తుచేసింది. ఇప్పటివరకు 3.8 బిలియన్‌ డాలర్ల సాయమందించామని ఇకపైనా ఈ సాయాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేసింది. 'శ్రీలంక, ఆ దేశ ప్రజలు ఎదుర్కొంటున్న అనేక సవాళ్ల గురించి మాకు తెలుసు. ఈ క్లిష్ట కాలాన్ని అధిగమించేందుకు ప్రయత్నిస్తున్న ప్రజలకు మేము అండగా నిలుస్తాం' అంటూ పేర్కొంది. శ్రీలంకకు పొరుగున ఉన్న భారత్‌ అత్యంత సన్నిహిత దేశమని, ఈ రెండు దేశాలు లోతైన నాగరికత బంధాలను పంచుకుంటున్నాయంటూ రెండు దేశాల మధ్య సంబంధాలు, ప్రాముఖ్యతలను గుర్తుచేసింది.

తీవ్ర సంక్షోభం కారణంగా ప్రభుత్వంపై శ్రీలంక ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. శనివారం అధ్యక్ష భవనంలోకి దూసుకెళ్లిన ఆందోళనకారులు ఇంకా అక్కడే ఉన్నారు. అక్కడే వంటావార్పూ చేసుకుంటున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్న వీడియోల ద్వారా తెలుస్తోంది. మరోవైపు భవనంలో రూ.కోటి రూపాయలకు పైగా విలువ చేసే నోట్ల కట్టలను ఆందోళనకారులు గుర్తించినట్లు డైలీ మిర్రర్‌ అనే పత్రిక పేర్కొంది. వాటిని లెక్కించి పోలీసులకు అప్పగించినట్లు వెల్లడించింది. అధ్యక్షుడు పారిపోవడం, ప్రధాని రాజీనామాతో శ్రీలంకలో తదుపరి రాజకీయాలు ఎలా ఉండబోతున్నాయన్నది ఆసక్తిగా మారింది.

ఇవీ చూడండి: ప్యాలెస్ జిమ్​లో కసరత్తులు.. సోఫాలో చిల్.. పూల్​లో ఈత.. నిరసనకారుల సంబరాలు!

కుటుంబ పెత్తనం, అవిరామ దోపిడీ.. నలుగురు కలిసి.. శ్రీలంకను నరకంలోకి నెట్టి..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.