ETV Bharat / international

ఆ ప్రాంతం నుంచి వెనుదిరిగిన రష్యా సైనికులు.. విద్యుత్‌ సిబ్బందికి జెలెన్‌స్కీ థ్యాంక్స్​

author img

By

Published : Oct 28, 2022, 8:12 AM IST

Russia Ukraine War: ఉక్రెయిన్​లోని ఖేర్సన్ నుంచి రష్యా సేనలు వెనుదిరిగాయి. రష్యా ఆధీనంలో ఉన్న ఈ ప్రాంతాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు కీవ్ సైనికులు గురువారం దాడులు మొదలుపెట్టారు. మరోవైపు కీవ్​లోని విద్యుత్కేంద్రాలపై రష్యా డ్రోన్ దాడులు చేసింది. అమెరికా ఉపగ్రహాలపైనా దాడులు చేస్తామని హెచ్చరించింది.

russia officials return from kherson
ఖేర్సన్‌ నుంచి.. రష్యా అధికారుల పలాయనం

russia ukraine war: దక్షిణ ఉక్రెయిన్‌లోని వ్యూహాత్మక ఖేర్సన్‌ ప్రాంతంపై పట్టుకోసం మాస్కో, కీవ్‌లు భీకరంగా పోరాడుతున్నాయి. యుద్ధారంభంలో రష్యా ఆధిపత్యంలోకి వెళ్లిన ఈ భూభాగాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు జెలెన్‌స్కీ సేనలు గురువారం దాడులు చేపట్టాయి. ముఖ్యంగా నైపర్‌ నదీ తీరానికి సమీపంలో ఉన్న రష్యా సైనిక శిబిరంపై దాడి చేశాయి. పరిస్థితి భీకరంగా మారడంతో- పుతిన్‌ అనుకూల అధికారులు ఖేర్సన్‌ను వీడారు.

వారితో పాటు వేలమంది నివాసితులను ఇతర ప్రాంతాలకు తరలించారు. గత కొన్నిరోజుల్లోనే సుమారు 70 వేల మంది ఖేర్సన్‌, సమీప ప్రాంతాలను వీడినట్టు రష్యా నియమించిన గవర్నర్‌ వ్లాదిమిర్‌ సాల్దో తెలిపారు. వీరిలో పలువురు మాస్కో అనుకూల అధికారులు ఉన్నట్టు చెప్పారు.

విద్యుత్కేంద్రాలపై డ్రోన్ల దాడులు..
తూర్పు ప్రాంతం దొనెట్స్క్‌పై రష్యా బాంబులు కురిపిస్తూనే ఉంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపంలోని విద్యుత్కేంద్రంపై గురువారం తెల్లవారుజామున డ్రోన్‌తో దాడి చేసింది. దీంతో అక్కడ భారీ విధ్వంసం చోటుచేసుకుని, మంటలు ఎగిసిపడినట్టు స్థానిక గవర్నర్‌ ఒలెక్సీ కులేబా తెలిపారు. శీతాకాలం సమీపిస్తున్నందున.. డ్రోన్లు, క్షిపణులతో తమ ఇంధన వ్యవస్థలను మాస్కో ధ్వంసం చేస్తోందని కులేబా మండిపడ్డారు. తాజా దాడిని ఉక్రెయిన్‌ తిప్పికొట్టింది. రష్యా ఆక్రమిత క్రిమియా తీర ప్రాంతం సెవస్తపోల్‌ వద్దనున్న విద్యుత్కేంద్రంపై డ్రోన్‌తో ప్రతిదాడి చేసింది. దీంతో అక్కడ భారీ నష్టం వాటిల్లింది.

అమెరికా ఉపగ్రహాలపై దాడులు: రష్యా హెచ్చరిక
ఉక్రెయిన్‌కు మద్దతుగా, ఆ దేశ సైన్యం కోసం అమెరికా, పశ్చిమ దేశాలు తమ ఉపగ్రహాలను ఉపయోగిస్తున్నాయని రష్యా ఆరోపించింది. దీన్ని తీవ్ర చర్యగా పరిగణిస్తున్నట్టు ఐరాసలో ఆ దేశ ప్రతినిధి బృందం నేత కాన్‌స్టాంటిన్‌ వోరోన్ట్‌స్టవ్‌ పేర్కొన్నారు. ఈ చర్యకు దీటైన ప్రతిచర్య ఉంటుందని, అమెరికా ఉపగ్రహాలపై దాడులు చేపట్టే అంశాన్ని పరిశీలిస్తున్నామని రష్యా విదేశాంగశాఖ ప్రతినిధి మారియా జఖరోవా హెచ్చరించారు.

విద్యుత్‌ సిబ్బందికి జెలెన్‌స్కీ ధన్యవాదాలు
తమ విద్యుత్‌ వ్యవస్థలపై శత్రుదేశం వరుస దాడులకు పాల్పడుతున్నా.. వెంటనే మరమ్మతులు చేపట్టి, సరఫరాను పునరుద్ధరిస్తున్న విద్యుత్‌ సిబ్బందికి ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ధన్యవాదాలు తెలిపారు. మాస్కో తాజా దాడులకు నలుగురు పౌరులు మృతిచెందగా, మరో ఎనిమిది మంది గాయపడినట్టు ఆయన వెల్లడించారు. తమ దేశంలోని 30% ఇంధన వ్యవస్థలను రష్యా ఇప్పటికే నాశనం చేసిందన్నారు.

ఐరాసలో రభస..
ఉక్రెయిన్‌లోని జనావాసాలు, విద్యుత్కేంద్రాలపై ఇరానియన్‌ డ్రోన్లతో రష్యా విరుచుకుపడ్డ అంశంపై ఐరాస విచారణకు ఆదేశించే విషయమై అమెరికా, రష్యాల నడుమ మాటల యుద్ధం నెలకొంది. విచారణకు ఆదేశించే అధికారం ఐరాస సెక్రటరీ జనరల్‌ ఆంటోనియో గుటెరస్‌కు ఉందని అమెరికా, పశ్చిమ దేశాలు పేర్కొన్నాయి. రష్యా మాత్రం ఈ అధికారం కేవలం భద్రతా మండలికే ఉందని వాదించింది. నేరాన్ని తప్పించుకునేందుకే మాస్కో ఈ వాదన వినిపిస్తోందని అమెరికా విమర్శించింది.

ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్యను ఖండిస్తూ, రెండో ప్రపంచ యుద్ధానంతరం మాస్కో ఆధిపత్యానికి చిహ్నంగా తమ దేశంలో నిర్మించిన నాలుగు రెడ్‌ ఆర్మీ స్మారక కట్టడాలను పోలండ్‌ కూల్చేసింది.

ఇవీ చదవండి:

అణుభయాల వేళ.. రష్యాకు వెళ్లనున్న భారత విదేశాంగ మంత్రి

'డర్టీబాంబు' అంటే ఏంటి?.. ఎప్పుడైనా ప్రయోగించారా? ప్రాణ ముప్పు తప్పదా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.