ETV Bharat / international

ఉక్రెయిన్​పై ఆగని దాడులు.. 16,400 మంది రష్యా సైనికులు మృతి!

author img

By

Published : Mar 26, 2022, 10:41 PM IST

Russia Ukraine War: ఉక్రెయిన్‌పై రష్యా దాడులు కొనసాగుతున్నాయి. ప్రధాన నగరాల స్వాధీనమే లక్ష్యంగా పుతిన్‌ సేనలు బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతున్నాయి. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత అక్కడి సరిహద్దు దేశమైన పోలాండ్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శనివారం కీలక భేటీలు జరిపారు. ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి రెజ్నికోవ్‌, విదేశాంగ మంత్రి ఇవానోవిచ్‌ కులేబాతో భేటీ అయ్యారు. 16,400 మంది రష్యా సైనికులను హతమార్చినట్లు ఉక్రెయిన్​ ప్రకటించింది.

Russia ukraine war
రష్యా సైనిక చర్య

Russia Ukraine War: యుద్ధం ప్రారంభించి నెలరోజులైనా ఉక్రెయిన్‌ దారికి రాకపోవడం వల్ల రష్యా దాడులు మరింత పెరిగాయి. కీవ్, మరియుపోల్, ఖార్కివ్‌, చెర్నిహివ్‌ నగరాల్లో బాంబులు, క్షిపణులతో పుతిన్‌ సేనలు దాడులు చేశాయి. బాంబు దాడులతో డెస్నా నదిపై ప్రధాన వంతెన కూలటంతో చెర్నిహివ్‌ నగరానికి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయినట్లు గవర్నర్ తెలిపారు. ఆహార నిల్వల ప్రదేశాలే లక్ష్యంగా మాస్కో ఉద్దేశపూర్వకంగా దాడి చేస్తోందని ఆరోపించారు. యుద్ధానికి ముందు చెర్నిహివ్‌లో 2.85 లక్షల మంది జనాభా ఉండగా ప్రస్తుతం లక్షా 30 వేల మంది కంటే తక్కువ ఉన్నట్లు తెలిపారు. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో శనివారం సాయంత్రం నుంచి సోమవారం ఉదయం వరకు ప్రకటించిన కర్ఫ్యూను రద్దు చేస్తున్నట్లు మేయర్ విటాలీ క్లిట్‌ష్కో తాజాగా మరో ప్రకటన చేశారు. ఈ మేరకు మిలిటరీ కమాండ్ నుంచి కొత్తగా ఆదేశాలు అందాయని చెప్పారు. అయితే, ఎప్పటిలాగే రాత్రి కర్ఫ్యూ అమల్లో ఉంటుందని, ఆదివారం పగటిపూట మాత్రం పౌరులు బయటకు రావొచ్చని తెలిపారు.

117 సైనిక స్థావరాలు ధ్వంసం: వాయవ్య ఉక్రెయిన్‌లోని జైతోమిర్ నగరానికి సమీపంలోని ఆయుధ, సైనికపరికరాల డిపోను ధ్వంసం చేసినట్లు రష్యా రక్షణ శాఖ తెలిపింది. నల్ల సముద్రంలోని నౌక నుంచి ప్రయోగించిన నాలుగు కాలిబర్‌ క్షిపణులు కీవ్‌కు పశ్చిమాన 120 కిలోమీటర్ల దూరంలోని డిపోపై పడినట్లు రష్యా రక్షణ శాఖ ప్రతినిధి వెల్లడించారు. ఉక్రెయిన్‌కు చెందిన మొత్తం 117 సైనిక లక్ష్యాలను ధ్వంసం చేశామని, అందులో 6 కమాండ్ పోస్టులు, 3 విమానాలు ఉన్నాయని చెప్పారు. చెర్నోబిల్ న్యూక్లియర్‌ ప్లాంట్‌ కార్మికులు నివసిస్తున్న పట్టణాన్ని రష్యా దళాలు నియంత్రణలోకి తీసుకున్నట్లు కీవ్‌ గవర్నర్‌ తెలిపారు. స్థానిక ఆసుపత్రిని ఆక్రమించటంతోపాటు మేయర్‌ను కిడ్నాప్‌ చేశాయని ఆరోపించారు.

ఏడుగురు రష్యా సైనిక జనరల్స్​ మృతి: ఖేర్సన్‌ నగరంలో జరిగిన దాడుల్లో రష్యాన్‌ లెఫ్టినెంట్ జనరల్ యాకోవ్ రెజంట్‌సెవ్‌ చనిపోయినట్లు ఉక్రెయిన్‌ రక్షణ శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు రష్యాకు చెందిన ఏడుగురు సైనిక జనరళ్లు మృతి చెందినట్లు తెలిపింది. ఉక్రెయిన్‌లో మొదట స్వాధీనం చేసుకున్న ఖేర్సన్‌ నగరంపై పుతిన్‌ సేనలు పట్టు కోల్పోతున్నట్లు అమెరికా తెలిపింది. యుద్ధాన్ని ముగించాలని రష్యాను కోరిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తమ భూభాగాన్ని వదులుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. పుతిన్‌తో శాంతి చర్చలకు తాము సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

రష్యా రక్షణ మంత్రి సెర్గీ షోయిగు సీనియర్ సైనికాధికారులతో నిర్వహించిన భేటీ దృశ్యాలను మాస్కో విడుదల చేసింది. ఆయన అనారోగ్యం బారినపడ్డారంటూ వార్తలు వెలువడిన తరుణంలో షోయిగు ప్రత్యక్షమయ్యారు. రష్యా సైన్యం గురించి తప్పుడు వార్తలు వ్యాప్తి చేసేవారికి 15ఏళ్ల జైలుశిక్ష విధించే చట్టంపై పుతిన్‌ సంతకం చేశారు. రష్యాకు చెందిన రక్షణ ఉత్పత్తుల మరో సంస్థపై బ్రిటన్‌ ఆంక్షలు విధించింది.

పోలాండ్​ పర్యటనలో బైడెన్​: ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత అక్కడి సరిహద్దు దేశమైన పోలాండ్‌లో పర్యటించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ శనివారం కీలక భేటీలు జరిపారు. ఉక్రెయిన్‌ రక్షణ మంత్రి రెజ్నికోవ్‌, విదేశాంగ మంత్రి ఇవానోవిచ్‌ కులేబాతో బైడెన్‌ భేటీ అయ్యారు. పలువురు ఉక్రెయిన్‌ అధికారులతో కూడా బైడెన్‌ చర్చించారు. ఉక్రెయిన్‌లో తాజా పరిస్ధితిపై బైడెన్‌కు వారు వివరించారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం ప్రారంభించిన తర్వాత ఆ దేశ కీలక అధికారులతో బైడెన్ ముఖాముఖి సమావేశం కావడం ఇదే తొలిసారి. ఉక్రెయిన్‌ సైనికులు, ప్రజల్లో నైతిక స్ధైర్యాన్ని నింపేందుకే బైడెన్‌ అక్కడికి సరిహద్దు దేశం పోలాండ్‌లో పర్యటించారు. ఉక్రెయిన్‌ నుంచి శరణార్థులుగా వచ్చిన వారిని వార్సాలో కలిశారు. 'మీరంతా ఎంతో ధైర్యవంతులు' అంటూ ఉక్రెయిన్‌ శరణార్థుల కుటుంబాలతో అన్నారు. యుద్ధంతో ఉక్రెయిన్‌లో మారణకాండకు కారణమైన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ను ఓ కసాయిగా అభివర్ణించారు.

Russia ukraine war
ఉక్రెయిన్​ శరణార్థులతో జో బైడెన్​

నాటోను విడగొట్టేందుకు పుతిన్‌ యత్నించారు: రష్యా సైనిక చర్యపై ప్రతిస్పందన విషయంలో నాటో తూర్పు భాగాన్ని పశ్చిమం నుంచి వేరు చేసేందుకు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ యత్నించారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ ఆరోపించారు. కానీ, ఇందులో విఫలమైనందుకు పుతిన్‌ ఆశ్చర్యపోయి ఉంటారని భావిస్తున్నానన్నారు. పోలాండ్‌ రాజధాని వార్సా పర్యటనలో భాగంగా బైడెన్‌ మాట్లాడారు. నాటో సభ్య దేశాలంతా ఐక్యంగా ఉన్నాయని చెప్పారు. ఐరోపాలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా స్థిరత్వం.. అమెరికాకు చాలా ముఖ్యమన్నారు. అంతకుముందు బైడెన్‌.. పోలాండ్‌ అధ్యక్షుడు ఆండ్రెజ్‌ డుడాతోపాటు ఉక్రెయిన్‌ మంత్రులతో భేటీ అయ్యారు.

ఉక్రెయిన్‌లో 10 మానవతా కారిడార్లు: దేశంలోని యుద్ధ సంక్షోభిత నగరాల నుంచి పౌరుల తరలింపునకు శనివారం 10 మానవతా కారిడార్ల ఏర్పాటుపై రష్యాతో ఒప్పందం కుదుర్చుకున్నట్లు ఉక్రెయిన్‌ ఉప ప్రధాని ఇరినా వెరెష్‌చుక్‌ తెలిపారు. జాతీయ టెలివిజన్‌లో ఆమె ప్రసంగిస్తూ.. రష్యా బలగాలు తమ చెక్‌పోస్టుల గుండా బస్సులను అనుమతించడం లేనందున.. మరియుపోల్‌వాసులు తమ ప్రైవేట్ కార్లలో బయలుదేరాలని సూచించారు.

ఉక్రెయిన్‌ చేతిలో 16,400మందికి పైగా రష్యా సైనికులు హతం: గత నెల రోజుల పాటు క్షిపణులు, బాంబు దాడులతో విరుచుకుపడుతున్న రష్యా సేనల్ని ఉక్రెయిన్‌ బలగాలు దీటుగా ఎదుర్కొంటున్నాయి. ఉక్రెయిన్‌ పౌరులతో పాటు సైనికులు రష్యాను ప్రతిఘటించి శత్రుదేశాన్ని దెబ్బకొడుతున్నాయి. ఇప్పటివరకు 16,400 మందికిపైగా రష్యా సైనికుల్ని చంపినట్టు ఉక్రెయిన్‌ విదేశాంగ శాఖ వెల్లడించింది. అలాగే, 117 విమానాలు, 127 హెలికాప్టర్లతో పాటు భారీగా యుద్ధ సామగ్రిని ధ్వంసం చేసినట్టు తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.