ETV Bharat / international

థియేటర్​పై దాడి ఘటనలో 300మంది మృతి

author img

By

Published : Mar 26, 2022, 8:15 AM IST

300 people dead Ukraine theatre attack incident
300 people dead Ukraine theatre attack incident

ఉక్రెయిన్​లోని థియేటర్​పై రష్యా ఈనెల 16న చేసిన దాడిలో మొత్తం 300మంది చనిపోయారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలతో స్థానిక అధికారులు టెలిగ్రాం ఛానెల్‌ ద్వారా ఈ వివరాలను వెల్లడించారు.

Ukraine Theatre Attack: ఉక్రెయిన్‌పై రష్యా జరుపుతున్న భీకరదాడుల్లో జరుగుతున్న తీవ్ర నష్టాలు ఒక్కొక్కటిగా వెలుగుచూస్తున్నాయి. ఈనెల 16న మేరియుపొల్‌లోని ఓ థియేటర్‌పై రష్యా జరిపిన దాడిలో అక్కడ ఆశ్రయం పొందుతున్న సుమారు 300 మంది మరణించినట్టు ఉక్రెయిన్‌ అధికారులు శుక్రవారం వెల్లడించారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన వివరాలతో స్థానిక అధికారులు టెలిగ్రాం ఛానెల్‌ ద్వారా ఈ వివరాలను అందించారు. ‘‘చాలామంది చిన్నారులు ఈ థియేటర్‌లో ఆశ్రయం పొందుతున్నారు. వారిని కాపాండేందుకు ‘చిల్డ్రన్‌’ అని రష్యన్‌ భాషలో బోర్డు కూడా పెట్టాం. రష్యా దాడులకు ఇళ్లు ధ్వంసమైన సుమారు 1,300 మంది కూడా ఇక్కడే ఉన్నారు. అయినా పుతిన్‌ సేనలు నిర్దాక్షిణ్యంగా ఈ శిబిరంపై దాడులకు దిగాయి’’ అని ఉక్రెయిన్‌ పార్లమెంటుకు చెందిన మానవ హక్కుల కమిషనర్‌ లుడ్మిలా డెనిసోవా వాపోయారు. మాస్కోను దీటుగా ఎదుర్కొనేలా తమకు యుద్ధ విమానాలను, ట్యాంకులను, భారీ సైనిక వ్యవస్థలను అందజేయాలని ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీ కోరుతున్నారు. దీనిపై చర్చించేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, నాటో దేశాధినేతలు బ్రసెల్స్‌లో సమావేశమైన మరుసటిరోజే... థియేటర్‌పై దాడిలో పౌరుల మరణాలకు సంబంధించిన నివేదికను ఉక్రెయిన్‌ అధికారులు బహిర్గతం చేయడం గమనార్హం.

Russia UKraine Crisis: ఈ దాడి తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని, ఉక్రెయిన్‌కు మరింత సైనిక సాయం అందిస్తామని బైడెన్‌ హామీ ఇచ్చారు. కీవ్‌లోకి ప్రవేశించేందుకు చెమటోడ్చుతున్న మాస్కో బలగాలు... రాజధాని ప్రాంత పరిరక్షణకు కీలకమైన ఇంధన నిల్వ కేంద్రాన్ని ధ్వంసం చేసినట్లు రష్యా సైనిక వర్గాలు ప్రకటించాయి. మరోవైపు అమెరికా సహా పశ్చిమ దేశాలు తమపై పూర్తిస్థాయి హైబ్రీడ్‌ యుద్ధం ప్రకటించాయని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్‌ ఆరోపించారు. తమ ఆర్థిక వ్యవస్థను, రష్యాను సర్వనాశనం చేయటమే ఆ దేశాల లక్ష్యమన్నారు.

ఖర్గివ్‌ శిథిలాల్లో అనాథ చిన్నారులు: ఖర్గివ్‌పై రష్యా సేనలు విరుచుకుపడుతూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ ఖననం చేయని శవాలు గుట్టలుగా కనిపిస్తున్నాయి. స్థానికులు చాలామంది ఇళ్లు విడిచి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. ఇప్పుడు అక్కడ ఎక్కువగా కనిపిస్తున్నది వృద్ధులే. ఆహారం, నీళ్లు, నిత్యావసరాల కోసం వారు బయటకు వస్తున్నారు. అనాథలుగా మారిన చిన్నారులు... శిథిలాల మధ్య బూడిదలో తిరుగుతూ తమవారి కోసం, ఆహారం కోసం వెతుకుతున్నారు.

1,351 మంది రష్యా సైనికుల మృతి: ఉక్రెయిన్‌ యుద్ధంలో తమ సైనికులు 1,351 మంది మృతిచెందారని, మరో 3,825 మంది గాయపడ్డారని రష్యా సైనిక ఉన్నతాధికారి కల్నల్‌ జనరల్‌ సెర్గీ రుడ్‌స్కోయ్‌ వెల్లడించారు. తాము ఇప్పటివరకూ 16 వేల మంది రష్యా సైనికులను మట్టుబెట్టినట్టు ఉక్రెయిన్‌ సైన్యం ప్రకటించింది. నెల రోజుల క్రితం ప్రారంభమైన యుద్ధాన్ని ఆపేందుకు ఇరు దేశాలు పులుమార్లు చర్చలు జరిపినప్పటికీ ఎలాంటి ఫలితం లేకపోయింది.

ఇదీ చదవండి: 'ఉక్రెయిన్​ యుద్ధంలో తొలిదశ పూర్తి.. అదే మా లక్ష్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.