ETV Bharat / international

ఇమ్రాన్​పై 'అవిశ్వాసం'.. తీర్మానంపై ఎంత మంది సంతకం చేశారంటే?

author img

By

Published : Apr 3, 2022, 12:38 PM IST

Imran Khan no confidence: పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్​పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడుతూ వంద మందికి పైగా విపక్ష పార్టీల సభ్యులు సంతకం చేశారు. ఆదివారమే దీనిపై ఓటింగ్ జరగనుంది. ఇమ్రాన్ ఖాన్ భవితవ్యం దీనితో తేలిపోనుంది.

Pakistan PM Imran Khan
Pakistan PM Imran Khan

Imran Khan no confidence: పాకిస్థాన్ రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్​కు వ్యతిరేకంగా అవిశ్వాస తీర్మానం ఆ దేశ పార్లమెంట్(పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ) ముందుకు రానుంది. ఆదివారం సమావేశాలపై పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీ కార్యదర్శి ఆరు పాయింట్ల అజెండాను విడుదల చేశారు. ఇందులో అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ సైతం ఉంది. 342 మంది సభ్యుల అసెంబ్లీలో తీర్మానం నెగ్గాలంటే 172 మంది ఓట్లు అవసరం.

Pakistan no confidence voting: ఈ నేపథ్యంలో తమకు 177 మంది సభ్యుల బలం ఉందని విపక్షాలు ప్రకటించుకున్నాయి. వంద మందికి పైగా విపక్ష పార్టీల సభ్యులు ఈ తీర్మానానిపై ఇప్పటికే సంతకం చేశారు. దీన్ని ఆ దేశ పార్లమెంట్ స్పీకర్ అదస్ ఖాసిర్​కు అందించారు. అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో రాజధాని ఇస్లామాబాద్​లో భద్రతను కట్టుదిట్టం చేశారు. నగరంలో 144 సెక్షన్ విధించారు. ద్విచక్ర వాహనంపై ఒకరికి మించి ప్రయాణించకూడదని పోలీసులు ఆదేశాలు జారీ చేశారు. పార్లమెంట్ వద్ద భారీగా బలగాలను మోహరించారు.

No confidence vote protest: మరోవైపు, అవిశ్వాస తీర్మానాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చారు ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్. శాంతియుతంగా ఆందోళన చేపట్టాలని తన సొంత పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్ ఇ ఇన్సాఫ్(పీటీఐ) కార్యకర్తలకు సూచించారు. దేశ ప్రజలు, ముఖ్యంగా యువత నిరసనల్లో పాల్గొనాలని కోరారు. విదేశీ కుట్రను పౌరులంతా వ్యతిరేకించాలని ఉద్ఘాటించారు. అయితే, నిరసనల్లో ఎక్కడా ఆర్మీని విమర్శించవద్దని విజ్ఞప్తి చేశారు.

అవిశ్వాసాన్ని ఎదుర్కొంటున్న మూడో పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌. గత రెండు సందర్భాల్లోనూ 'అవిశ్వాసం' ప్రధాని పీఠాలను కదిలించలేకపోయింది. తనపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ప్రతిపక్షాలకు ఇన్‌స్వింగ్‌ యార్కర్‌ బంతి వేస్తానని హామీ ఇచ్చిన ఇమ్రాన్‌ పరిస్థితుల ప్రభావం వల్ల రనౌట్‌ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రెండు కీలక భాగస్వామ్య పక్షాలు దూరం కావడం, సొంత పార్టీ సభ్యులు కొందరు ఎదురుతిరగడం ఇందుకు బలం చేకూరుస్తున్నాయి.

ఇదీ చదవండి: ఇమ్రాన్ ఇన్నింగ్స్​కు పరీక్ష.. రనౌట్ అయ్యే అవకాశాలే ఎక్కువ!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.