ETV Bharat / international

ఇమ్రాన్​కు కాస్త ఊరట.. 'అవిశ్వాసం'పై చర్చ మళ్లీ వాయిదా

author img

By

Published : Mar 31, 2022, 6:29 PM IST

Pakistan Parliament session adjourned: పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​కు స్వల్ప ఊరట లభించింది. అవిశ్వాస తీర్మానంపై చర్చపై విపక్షాలు పట్టుబట్టగా.. జాతీయ అసెంబ్లీని ఏప్రిల్​ 3కు వాయిదా వేశారు స్పీకర్​. దీంతో అవిశ్వాసాన్ని వెనక్కి తీసుకునే ప్రయత్నాలు చేపట్టేందుకు ఇమ్రాన్​కు కాస్త సమయం దొరికినట్లయింది.

PM Imran Khan
ఇమ్రాన్​ ఖాన్​

Pakistan Parliament session adjourned: రాజకీయ సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న పాకిస్థాన్​ ప్రధానమంత్రి ఇమ్రాన్​ ఖాన్​కు స్వల్ప ఊరట లభించింది. విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగి గురువారమే తుది నిర్ణయం వెలుడనుందని అంతా భావించిన తరుణంలో నేషనల్​ అసెంబ్లీ ఏప్రిల్​ 3కు వాయిదా పడింది. అవిశ్వాసం తీర్మానం వెంటనే చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్​ చేయటం వల్ల సభలో గందరగోళం నెలకొంది. దీంతో సభను వాయిదా వేశారు డిప్యూటీ స్పీకర్​ కాసిమ్​ సూరి. ఫలితంగా.. అవిశ్వాస తీర్మానాన్ని వెనక్కి తీసుకునేలా ప్రయత్నించేందుకు ఇమ్రాన్​కు మరింత సమయం దొరికినట్లయింది.

గురువారం పార్లమెంట్​ హౌస్​లోని నేషనల్​ అసెంబ్లీ సమావేశం ప్రారంభం కాగానే చర్చించేందుకు అంశాల జాబితా ప్రకారం చర్చ చేపట్టాలని కోరారు డిప్యూటీ స్పీకర్ కాసిమ్​ సూరి. అయితే, అవిశ్వాసంపై వెంటనే చర్చ చేపట్టాలని విపక్షాలు పట్టుపట్టాయి. విపక్ష సభ్యుల నినాదాలతో సభ హోరెత్తింది. దీంతో ఆదివారం ఉదయం 11 గంటలకు సభను వాయిదా వేశారు.

విపక్షాలకు ఇమ్రాన్​ ఆఫర్​: అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చకు కొద్ది గంటల ముందు పాకిస్థాన్‌ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంచ‌ల‌న ప్రక‌ట‌న చేశారు. త‌న‌కు వ్యతిరేకంగా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని వెన‌క్కి తీసుకుంటే తాను పార్లమెంట్‌ను ర‌ద్దు చేస్తాన‌ని ప్రతిప‌క్షాల‌కు రాయబారం పంపారు. అవిశ్వాస తీర్మానంపై చ‌ర్చ సంద‌ర్భంగా ప్రతిప‌క్ష నేత‌లు ఓ చోట స‌మావేశ‌ం కాగా స‌రిగ్గా ఈ స‌మ‌యంలోనే ఇమ్రాన్ ప్రతిపక్షాలకు ఆఫర్ ఇచ్చారు. ప్రస్తుతం పాక్‌లో రాజ‌కీయ సంక్షోభం త‌లెత్తింద‌న్న ఆయన దానికి విరుగుడు ఇదేన‌ని ఇమ్రాన్ సందేశం పంపారు. అయితే ఇందుకు విపక్షాలు అంగీకరించబోవని, పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ ప్రతినిధి తేల్చి చెప్పారు.

మైనారిటీలోకి ఇమ్రాన్​ ప్రభుత్వం: 2018లో జరిగిన పాక్ఎన్నికల్లో ఇమ్రాన్​ ఖాన్ నేతృత్వంలోని తెహ్రీక్ఇ-ఇన్సాఫ్ పార్టీ 342 స్థానాలకు గాను 155 గెలుచుకుంది. ప్రభుత్వ ఏర్పాటుకు 172స్థానాలు కావాల్సి ఉండగా పాకిస్థాన్​ ముస్లిం లీగ్- 5, బలూచిస్థాన్అవామీ పార్టీ-5, MQM-P 7, గ్రాండ్డెమోక్రటిక్​ కూటమి 3, అవామి ముస్లిం లీగ్​కు చెందిన ఒక సభ్యుడి మద్దతుతో ఇమ్రాన్​ ఖాన్​ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దీంతో పాక్​ జాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్​ ఖాన్​ ప్రభుత్వ బలం 176కి చేరింది. తాజాగా ఎంక్యూఎం-పీతో పాటు బలూచిస్థాన్​కు చెందిన జమ్​హారీ వాటన్​ పార్టీ మద్దతు ఉపసంహరించుకోవడంతో 8మంది ఎంపీలు ఇమ్రాన్​ ప్రభుత్వం నుంచి బయటకు వచ్చారు. దీంతో ప్రభుత్వ బలం 176 నుంచి 168కి పడిపోయింది. అటు ప్రభుత్వంలోని మరింత మంది సభ్యులు సైతం అవిశ్వాస తీర్మానంలో విపక్షాలకు మద్దతుగా నిలవనున్నట్లు పాక్​ మీడియా తెలిపింది.

ఇదీ చూడండి: మైనార్టీలో ఇమ్రాన్ సర్కార్.. తర్వాతి పీఎం ఆయనే..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.