ETV Bharat / international

మైనార్టీలో ఇమ్రాన్ సర్కార్.. తర్వాతి పీఎం ఆయనే..!

author img

By

Published : Mar 30, 2022, 10:31 PM IST

Imran Khan No Confidence: అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్‌కు ముందే పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఇంటిముఖం పట్టడం ఖాయంగా కనిపిస్తోంది. అధికార పార్టీలోని 12 మందికిపైగా సభ్యులతోపాటు మిత్రపక్షం ఎంక్యూఎం-పీకి చెందిన ఏడుగురు సభ్యులు కూడా ప్రతిపక్షాలకు జైకొట్టడం వల్ల ఇమ్రాన్‌ సర్కార్‌ మైనార్టీలో పడింది. కేబినెట్‌ మంత్రులతో అత్యవసరంగా సమావేశమైన ఇమ్రాన్‌ ఖాన్‌.. ఐఎస్​ఐ చీఫ్‌, పాకిస్థాన్​ సైనిక దళాల ప్రధానాధికారులతో పలు దఫాలుగా భేటీ కావటం ఉత్కంఠ రేపుతోంది.

Imran Khan No Confidence
Imran Khan No Confidence

Imran Khan No Confidence: పాకిస్థాన్‌లో వరుసగా జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని ప్రభుత్వం ప్రతిపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానంపై నెగ్గేందుకు ఉన్న దారులన్నీ మూసుకుపోయాయి. సొంతపార్టీకి చెందిన ఎంపీలతోపాటు ప్రధాన మిత్రపక్షం ఎంక్యూఎం-పీ కూడా ప్రతిపక్షాలతో చేతులు కలిపింది. ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానానికి అధికార సంకీర్ణలోని మిత్రపక్షం ఎంక్యూఎం-పీ మద్దతు ప్రకటించడంతోపాటు ఆ పార్టీకి చెందిన ఇద్దరు మంత్రులు కూడా ఇమ్రాన్‌ కేబినెట్‌ నుంచి తప్పుకున్నారు. దీంతో ఇమ్రాన్‌ ఖాన్‌ సారథ్యంలోని సంకీర్ణ ప్రభుత్వం మైనార్టీలో పడింది. తాజా పరిణామాల నేపథ్యంలో ఇమ్రాన్‌ రాజీనామా చేయటం తప్ప మరోమార్గం లేని పరిస్థితులు నెలకొన్నాయి. బుధవారం అక్కడి ప్రజలను ఉద్దేశించి తొలుత ప్రసంగించాలని భావించిన ఇమ్రాన్‌ ఖాన్‌ తర్వాత నిర్ణయం మార్చుకున్నారు.

ఈ నేపథ్యంలో ఇమ్రాన్‌ ఖాన్‌.. ప్రధానిగా కొనసాగే నైతిక హక్కు కోల్పోయారని, తక్షణం రాజీనామా చేయాలని ప్రతిపక్ష పార్టీలు డిమాండ్‌ చేస్తున్నాయి. షెహ్‌బాజ్‌ షరీఫ్‌ పాకిస్థాన్‌ తదుపరి ప్రధాని కానున్నారని పాకిస్థాన్‌ పీపుల్స్‌ పార్టీ ఛైర్మన్‌ బిలావల్‌ భుట్టో ప్రకటించారు. అయితే ప్రతిపక్షాల డిమాండ్‌ను అధికార పక్షం తోసిపుచ్చింది. ఇమ్రాన్ రాజీనామా చేసే ప్రసక్తే లేదని.. పాక్‌ ఐటీశాఖ మంత్రి ట్వీట్ చేశారు. చివరి బంతి వరకు పోరాటం చేస్తారన్నారు. ఓటింగ్ రోజు తమ శత్రువులెవరో, మిత్రులెవరో తేలుతుందన్నారు. ఇప్పటికే కేబినెట్‌ మంత్రులతో పాక్‌ ప్రధాని.. అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆ తర్వాత ఐఎస్​ఐ చీఫ్​, పాక్‌ సైనిక దళాల ప్రధానాధికారి ఇమ్రాన్‌తో రెండు దఫాలుగా సమావేశం కావటం ఉత్కంఠ రేపుతోంది.

పాకిస్థాన్ జాతీయ అసెంబ్లీలో మొత్తం సభ్యుల సంఖ్య 342కాగా సాధారణ మెజార్టీకి 172 మంది సభ్యుల మద్దతు అవసరం ఉంటుంది. ఇంతవరకు ఇమ్రాన్‌ ప్రభుత్వానికి మిత్రపక్షాలతో కలిపి 176 మంది సభ్యుల బలం ఉండేది. తాజాగా ఎంక్యూఎం పార్టీకి చెందిన ఏడుగురు సభ్యులు ప్రతిపక్షాలకు మద్దతు ప్రకటించటంతో ఇమ్రాన్‌ సర్కార్‌ బలం 163కు పడిపోయింది. ఇమ్రాన్‌ ఖాన్‌కు చెందిన పీటీఐ పార్టీకి చెందిన 12 మందికిపైగా ఎంపీలు కూడా ప్రతిపక్షాలకు మద్దతు ప్రకటించారు. అయితే వారు ఓటింగ్‌లో పాల్గొనకుండా అడ్డుకునేందుకు కోర్టు ద్వారా ఉత్తర్వులు పొందేందుకు ఇమ్రాన్‌ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. వంద మంది ఎంపీల సంతకాలతో ఇమ్రాన్‌ సర్కార్‌పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించగా అనుహ్యంగా వారిబలం పెరిగింది. పాకిస్థాన్‌లో రాజకీయ అధికారానికి కీలకంగా భావించే సైన్యం మద్దతు ఇమ్రాన్‌ఖాన్‌ కోల్పోయినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

ఇదీ చూడండి: చర్చలు ముగిసిన గంటల్లోనే ఉక్రెయిన్​పై రష్యా క్షిపణి దాడులు..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.