ETV Bharat / international

చైనాలో కొవిడ్ కేసులపై అనుమానాలు.. మరోసారి ప్రపంచ దేశాలకు ముప్పు తప్పదా?

author img

By

Published : Dec 29, 2022, 3:24 PM IST

China Covid Outbreak
చైనాలో కొవిడ్ ఉద్దృతి

China Covid Outbreak : చైనా కరోనా విస్ఫోటనం ప్రపంచాన్ని భయాందోళనలకు గురిచేస్తోంది. రికార్డు స్థాయిలో నమోదవుతున్న కొత్త కేసులు తమ దేశంలో ఎక్కడ కల్లోల పరిస్థితులకు దారి తీస్తాయోనని ప్రపంచ దేశాలన్నీ వణికిపోతున్నాయి. తమ దేశంలో కరోనా కల్లోలం లేదని చైనా చెబుతున్నప్పటికీ.. తొలి దశ కరోనా వ్యాప్తి సమయంలోనూ డ్రాగన్‌ ఇవే మాటలు చెప్పిందని దేశాలన్నీ గుర్తు చేస్తున్నాయి. చైనా ఇప్పటికైనా తమ దేశంలో నమోదవుతున్న కరోనా గణాంకాలను ప్రపంచంతో పంచుకుంటే తప్ప కరోనా వ్యాప్తి నిరోధం సాధ్యం కాదని దేశాలు ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నాయి.

China Covid Outbreak : తమ దేశంలో కరోనా విస్పోటనాన్ని చైనా దాస్తోందా? కొవిడ్ మొదటి వేవ్​లో చేసిన తప్పునే డ్రాగన్‌ మళ్లీ చేస్తోందా? అనే అనుమానాలు ప్రపంచ దేశాలు వ్యక్తం చేస్తున్నాయి. చైనా దాపరికంతో ప్రపంచానికి పెను ముప్పు తప్పదా? అనే సందేహాలు కలుగుతున్నాయి. డ్రాగన్‌ ఇలాగే వ్యవహరిస్తే మరోసారి వినాశనం తప్పదా.. ప్రపంచ దేశాలను ఆందోళనలకు గురిచేస్తున్న విషయమేంటనేది ఓ సారి తెలుసుకుందాం.

చైనా తమ దేశంలో నమోదవుతున్న కేసుల విషయంలో అసలు నిజాలను దాస్తోందంటూ ప్రపంచ దేశాలు.. అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. చైనా తొలి దశలోనూ ఇలా కేసులు దాచి కరోనా మహా విస్ఫోటనానికి కారణమైందని గుర్తు చేస్తున్నాయి. చైనా కరోనా కేసులు ఇలాగే దాస్తే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని ప్రపంచం తీవ్ర భయాందోళనలకు గురవుతోంది. కొత్త వేరియంట్ల పుట్టుక చైనాకు తెలిసినా డ్రాగన్‌ ఆ విషయాన్ని ప్రపంచంతో పంచుకోకపోవచ్చని దేశాలన్నీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.

చైనాలో ఇప్పటి వరకు కొత్త వేరియంట్‌లు వచ్చినట్లు ఎలాంటి వార్తలు లేకున్నా.. డ్రాగన్‌లో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి అది సాధ్యమనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. చైనాలో కరోనా కల్లోలాన్ని అంచనా వేసేందుకు తమకు మరింత సమాచారం అవసరమని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్​ఓ) డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అథనోమ్‌ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలతో చైనా ఏ సమాచారాన్ని ఎవరితో పంచుకోవట్లేదన్నది స్పష్టమైందని.. ప్రపంచ దేశాలు అనుమానిస్తున్నాయి. ఆదివారం నుంచి రోజువారీ కరోనా కేసుల ప్రకటననే చైనా నిలిపివేయడం డ్రాగన్‌ దాపరికానికి అద్దంపడుతోంది.

చైనా ప్రభుత్వం కఠిన కొవిడ్‌ నిబంధనలను ఒక్కసారిగా సడలించడమే ఈ కరోనా విస్ఫోటనానికి కారణమని నిపుణులు అంచనా వేస్తున్నారు. చైనాలో ప్రస్తుత వ్యాప్తిలో ఎన్ని ప్రమాదకరమైన వేరియంట్‌లను గుర్తించారన్న దానిపైనా స్పష్టమైన సమాచారం లేదు. చైనా కరోనా సమచారాన్ని డబ్ల్యూహెచ్​ఓ, అంతర్జాతీయ సమాజంతో బాధ్యతాయుతంగా పంచుకుంటోందని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. కానీ ప్రస్తుతం ఆ విధానం కనపడడం లేదని ప్రపంచ దేశాలు ఆరోపిస్తున్నాయి. 2020లో కరోనా మూలాలపై అంతర్గత పరిశోధనలను చైనా నియంత్రించినట్లు పలు పరిశోధనల్లో వెల్లడైంది. అస్సలు కరోనా మహమ్మారి ఎలా ప్రారంభమైందనే దానిపై కీలకమైన డేటా ఇప్పటికీ లేదని డబ్ల్యూహెచ్ఓ నిపుణుల బృందం ఈ సంవత్సరం ఓ నివేదికలో తెలిపింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.