ETV Bharat / bharat

దగ్గు మందుకు 18 మంది పిల్లలు బలి!.. భారత్​లో ఔషధం ఉత్పత్తి బంద్.. దర్యాప్తు ముమ్మరం

author img

By

Published : Dec 29, 2022, 2:19 PM IST

Updated : Dec 29, 2022, 2:47 PM IST

ఉజ్బెకిస్థాన్​లో దగ్గు మందు తాగి 18 మంది పిల్లలు మరణించిన ఘటనపై భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆ దగ్గు మందు తయారీని నిలిపివేసి, దర్యాప్తు ప్రారంభించింది. నమూనాలను చండీగఢ్‌ డ్రగ్స్ టెస్టింగ్ లేబొరేటరీకి అధికారులు పంపారు. మరోవైపు ఈ ఘటనపై భాజపా, కాంగ్రెస్​ మధ్య ట్విట్టర్​లో మాటల యుద్ధం జరిగింది.

COUGH SYRUP UZBEKISTAN INSPECTION
COUGH SYRUP UZBEKISTAN INSPECTION

Cough Syrup Deaths : భారత్‌లో తయారైన దగ్గు సిరప్‌పై మరోసారి ఆరోపణలు వచ్చాయి. ఇక్కడి ఫార్మా కంపెనీలో తయారైన దగ్గుమందు తాగిన 21 మంది పిల్లల్లో 18 మంది మరణించారని ఉజ్బెకిస్థాన్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరోపించింది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడాకు చెందిన మరియన్‌ బయోటెక్‌ కంపెనీ ఈ మందు తయారు చేసింది. కాగా, ఆ ఆరోపణలపై భారత ప్రభుత్వం దర్యాప్తు ప్రారంభించింది. నమూనాలు పరీక్షించే వరకు నొయిడా యూనిట్‌లో తయారీని నిలిపివేసింది.

ఈ ఘటనపై ట్విట్టర్​ వేదికగా కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మనుసుఖ్​ మాండవీయ స్పందించారు. నొయిడాలోని ఫార్మాస్యూటికల్‌ కంపెనీలో యూపీ డ్రగ్​ కంట్రోల్​, సెంట్రల్ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్ బృందం సంయుక్త తనిఖీలు చేపట్టిందని తెలిపారు. దగ్గు సిరప్ నమూనాలను చండీగఢ్‌లోని ప్రాంతీయ డ్రగ్స్ టెస్టింగ్ లేబొరేటరీకి పంపినట్లు వెల్లడించారు. అయితే 'డాక్-1 మ్యాక్స్' దగ్గు మందును భారత్​లో విక్రయించడం లేదని.. ఉజ్బెకిస్థాన్‌కు ఎగుమతి మాత్రమే జరిగిందని ఓ అధికారి తెలిపారు.

వైద్యులు సూచన లేకుండా..
మరియన్‌ బయోటెక్‌ కంపెనీ తయారు చేసిన 'డాక్‌-1 మాక్స్‌' సిరప్‌ తాగిన పిల్లలు తీవ్రమైన శ్వాసకోశ ఇబ్బందులతో మరణించినట్లు ఉజ్బెకిస్థాన్‌ ఆరోగ్యమంత్రిత్వ శాఖ ఆరోపించింది. కాగా, వైద్యుల సూచన లేకుండా ఎక్కువ మోతాదులో ఈ దగ్గు మందును తాగడం వల్లే ఇబ్బందులు తలెత్తినట్లు తెలుస్తోంది. ఈ కంపెనీ 2012లో ఉజ్బెకిస్థాన్‌లో రిజిస్టరు చేయించుకుంది.

కాంగ్రెస్ ​X భాజపా
ఉజ్బెకిస్థాన్​ చిన్నారుల మరణాల్లో భారత్​తో తయారు చేసిన దగ్గు మందు పాత్ర ఉందన్న ఆరోపణలపై భాజపా, కాంగ్రెస్‌ మధ్య మాటల యుద్ధం జరిగింది. "మేడ్ ఇన్ ఇండియా దగ్గు సిరప్‌లు ప్రాణాంతకంగా ఉన్నాయి. మొదట గాంబియాలో 70 మంది పిల్లలు.. ఇప్పుడు ఉజ్బెకిస్థాన్​లో 18 మంది పిల్లలు మరణించారు. మోదీ సర్కార్ భారతదేశం ఫార్మసీ గురించి గొప్పలు చెప్పుకోవడం మానేసి కఠినచర్యలు తీసుకోవాలి" అని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ట్వీట్ చేశారు.

జైరాం రమేశ్​ ట్వీట్​కు భాజపా ఐటీ డిపార్ట్‌మెంట్ ఇన్‌ఛార్జ్ అమిత్ మాలవీయ బదులిచ్చారు. "గాంబియాలో పిల్లల మరణానికి భారతదేశంలో తయారు చేసిన దగ్గు సిరప్ వినియోగానికి ఎటువంటి సంబంధం లేదు. దానిపై అప్పుడే గాంబియా అధికారులు స్పష్టం చేశారు. మోదీపై ద్వేషంతో కాంగ్రెస్​ ఇలాంటి మాటలు చెబుతోంది" అని ట్వీట్​ చేశారు.

2022లో రెండో ఘటన ఇది..
ఈ ఏడాదిలో ఇటువంటి తరహాలో రెండో ఘటన ఇది. భారత్‌లో తయారైన దగ్గుమందు కారణంగా గాంబియా దేశంలో విషాదం జరిగింది. దగ్గు, జలుబు నివారణకు సిరప్‌లు వినియోగించి 66 మంది చిన్నారులు మృత్యువాత పడ్డారు. హరియాణాలోని సొనెపట్‌ కేంద్రంగా.. మైడెన్‌ ఫార్మా కంపెనీ ఉత్పత్తిచేసిన నాలుగు సిరప్‌ల కారణంగానే సెప్టెంబరులో ఈ మరణాలు సంభవించినట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

Last Updated :Dec 29, 2022, 2:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.