ETV Bharat / international

రన్​వేపై రెండు విమానాలు ఢీ! రెక్కలు ధ్వంసం.. పైలట్లు అలర్ట్

author img

By

Published : Jun 10, 2023, 1:11 PM IST

Updated : Jun 10, 2023, 2:49 PM IST

జపాన్‌లో రెండు విమానాలు గమ్యస్థానాలకు బయలుదేరేందుకు సిద్ధమయ్యాయి. ప్రయాణికులతో ఉన్న రెండు విమానాలు రన్‌వేపై వేగంగా దూసుకుపోతున్నాయి. అప్పుడే ఊహించని ప్రమాదం జరిగింది. టేకాఫ్‌ సమయంలో అతి సమీపంగా వచ్చిన ఈ రెండు విమానాలు రన్‌వేపైనే ఢీకొట్టుకునేంత పని చేశాయి. అతి సమీపంగా రావడం వల్ల రెండు విమానాల రెక్కలు ఢీకొని స్వల్పంగా ధ్వంసమయ్యాయి. వెంట్రుకవాసిలో పెను ప్రమాదం తప్పింది. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.

JAPAN PLANE COLLISION
JAPAN PLANE COLLISION

జపాన్‌ రాజధాని టోక్యోలోని ఓ ప్రధాన విమానాశ్రయంలో త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. రన్‌వేపై రెండు కమర్షియల్‌ విమానాలు ప్రమాదవశాత్తూ ఒకదాన్నొకటి తాకాయి. హనేడా ఎయిర్‌పోర్టులో శనివారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. బ్యాంకాక్‌ బయల్దేరిన థాయ్‌ ఎయిర్‌వేస్‌ ఇంటర్నేషనల్‌ విమానం.. తైపీకి బయల్దేరిన ఇవా ఎయిర్‌వేస్‌ విమానం రన్‌వేపై ఒకేసారి వచ్చి ఒకదాన్నొకటి తాకాయి. పైలట్లు వెంటనే అప్రమత్తమై విమానాలను నిలిపివేశారు.ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి హానీ జరగలేదని అధికారులు వెల్లడించారు.

ఒకే రన్‌వేపై రెండు విమానాలు నిలిపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఓ విమానం రెక్క స్వల్పంగా దెబ్బతింది. ఆ వింగ్‌ భాగాలు రన్‌వేపై పడ్డాయి. కాగా.. ఈ ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. రెండు విమానాలను ఒకేసారి రన్‌వేపైకి ఎలా అనుమతించారన్నదానిపై స్పష్టత లేదు. ఈ విమానాశ్రయంలో నాలుగు రన్‌వేలు ఉన్నాయి. ప్రస్తుతానికి ఘటన జరిగిన రన్‌వేను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో కొన్ని విమానాల రాకపోకలు ఆలస్యమైనట్లు అధికారులు తెలిపారు.

JAPAN PLANE COLLISION
ఒకదానినొకటి తాకి ఆగిపోయిన విమానాలు

"బ్యాంకాక్​కు వెళ్లాల్సిన మా విమానం టేకాఫ్​ కోసం రన్​వేపైకి వెళ్లేందుకు సిద్ధమైంది. ఇందుకోసం ట్యాక్సీవే పై ఎదురు చూస్తోంది. ఆ సమయంలో ఇవా విమానం కూడా ట్యాక్సీవేపై ఉంది. అప్పుడే మా విమానం కుడి రెక్క.. ఇవా విమానానికి తాకింది. మా విమానం రెక్క దెబ్బతింది. విమానం ఏగిరే పరిస్థితులో లేదు. ఎయిర్​బస్ ఏ330 విమానం 250 మంది ప్రయాణికులను, 14 మంది సిబ్బందిని తీసుకెళ్తోంది" అని థాయ్ ఎయిర్​వేస్ ప్రకటించింది.

జపాన్ దర్యాప్తు..
ఇదిలా ఉండగా.. ఇవా ఎయిర్‌లైన్‌ సంస్థ ఈ ఘటనపై స్పందించలేదు. ఎయిర్‌పోర్టు అధికారులు గానీ స్పందించలేదు. జపాన్ రవాణా మంత్రిత్వ శాఖ సైతం దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే, ఈ ఘటనపై జపాన్ పౌర విమానాయాన సంస్థ దర్యాప్తు జరుపుతోందని థాయ్ ఎయిర్​వేస్ వెల్లడించింది.

ముంబయికి ఎయిర్ఇండియా ప్లేన్
దిల్లీ నుంచి శాన్​ఫ్రాన్సిస్కోకు వెళ్లాల్సిన ఎయిర్ఇండియాకు చెందిన బోయింగ్ ఎయిర్​క్రాఫ్ట్​లో ఇటీవల లోపాలు తలెత్తాయి. దీంతో రష్యాలోని తూర్పు ప్రాంత నగరమైన మగదాన్ ఈ విమానం సడెన్​గా ల్యాండ్ అయింది. జూన్ 6న ఈ ఘటన జరిగింది. ఇంజిన్ ఆయిల్ వ్యవస్థలలో సమస్య తలెత్తడం వల్ల విమానం ఆగిపోయిందని ఇంజినీర్లు గుర్తించారు. ఈ సమస్యను వారు పరిష్కరించినట్లు ఎయిర్ఇండియా తెలిపింది. దీంతో విమానం తిరిగి ముంబయికి బయల్దేరిందని పేర్కొంది. లోపాలు తలెత్తిన విమానంలో 216 మంది ప్రయాణికులు, 16 మంది సిబ్బంది ఉన్నారు. వీరంతా రెండ్రోజుల పాటు మగదాన్​లోనే ఉండాల్సి వచ్చింది. అనంతరం మరో విమానం ఏర్పాటు చేసి ప్రయాణికులందరినీ శాన్​ఫ్రాన్సిస్కోకు పంపించారు.

Last Updated : Jun 10, 2023, 2:49 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.