ETV Bharat / international

Columbia Plane Crash : అమెజాన్‌ అడవుల్లో అద్భుతం.. 40 రోజులు తర్వాత సేఫ్​గా నలుగురు చిన్నారులు

author img

By

Published : Jun 10, 2023, 9:09 AM IST

అమెజాన్ అడవుల్లో అద్భుతం జరిగింది. క్రూర మృగాలు తిరిగే కఠిన వాతావరణ పరిస్థితుల మధ్య నలుగురు పసివాళ్లు.. 40 రోజుల పాటు తమ ప్రాణాలను నిలుపుకున్నారు. పండ్లు, ఆకులు అలుములు తింటూ.. మృత్యువుతో యుద్ధం చేసి విజయం సాధించారు. 13 ఏళ్లు, 9 ఏళ్లు, నాలుగేళ్లు, ఒక ఏడాది వయస్సున్న చిన్నారులు.. ప్రపంచంలోనే దట్టమైన అరణ్యంగా పేరుగాంచిన అమెజాన్‌ అడవుల్లో ప్రాణాలను నిలుపుకున్నారు. కొలంబియా అధ్యక్షుడు చేసిన ఈ ప్రకటనతో.. ఆ దేశ ప్రజలు సంబరాల్లో మునిగిపోయారు.

Columbia Plane Crash Survivors
Columbia Plane Crash Survivors

Columbia Plane Crash Survivors : ప్రపంచంలోకెల్లా దట్టమైన, భీకరమైన అరణ్యాలు... అమెజాన్ అడవులు. పొడవాటి చెట్లు.. ఒక్కసారిగా మారిపోయే వాతావరణం.. క్రూరమృగాలు ఇలా ఆ కీకారణ్యంలో ప్రతీ అడుగు ప్రాణాంతకమే. కానీ ఆ దండకారణ్యంలోనూ.. నలుగురు చిన్నారులు 40 రోజుల పాటు తమ ప్రాణాలను నిలుపుకున్నారు. ఏడాది వయస్సున్న చిన్నారిని కాపాడుకుంటూ ఆ చిన్నారులు చేసిన పోరాటం.. ప్రపంచాన్నే నివ్వెరపరుస్తోంది. విమాన ప్రమాదంలో అమెజాన్‌ అడవుల్లో తప్పిపోయిన నలుగురు చిన్నారులు సురక్షితంగా ఉన్నారని కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో ప్రకటనతో.. ఆ దేశ ప్రజలు ఆనందంతో మునిగిపోయారు.

Columbia Plane Crash Survivors
చిన్నారులను రక్షించిన సైనికులు

Columbia Plane Crash 2023 : అది మే ఒకటో తేదీ.. కొలంబియాలోని గౌవియారే ప్రాంతంలో దట్టమైన అమెజాన్‌ అటవీ ప్రాంతంలో ఓ విమానం కుప్పకూలింది. అందులో మొత్తం ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు. ఇంజిన్‌లో సాంకేతిక సమస్య తలెత్తడం వల్ల అది నేల కూలబోతున్నట్లు పైలట్‌ ప్రకటించాడు. ఆ తర్వాత కొద్దిసేపటికే రాడార్ల పరిధి నుంచి ఆ విమానం వేరయింది. ఈ ప్రమాదంలో చిన్నారుల తల్లి, పైలెట్‌, గైడ్‌ మరణించగా.. 13, 11, 9 ఏళ్ల చిన్నారులతో పాటు ఏడాది వయసున్న పసికందు ప్రాణాలతో బయటపడ్డారు. పెద్దవాళ్లందరూ మరణించడం వల్ల.. ఏడాది వయసున్న పాపను కాపాడుకుంటూ ఈ ముగ్గురు చిన్నారులు.. ఆ దండకారణ్యంలో పోరాటం ప్రారంభించారు. పండ్లు, ఆకులు అలుములూ తింటూ అడవి నుంచి బయటపడేందుకు నడవడం ప్రారంభించారు. కానీ దిక్కు దారి తెలియక రోజుల తరబడి అడవిలోనే తిరుగుతున్నారు.

Columbia Plane Crash Survivors
చిన్నారులను రక్షించిన సైనికులు

విమాన ప్రమాద విషయం తెలుసుకున్న కొలంబియా ప్రభుత్వం అప్రమత్తమైంది. నలుగురు చిన్నారుల కోసం ప్రత్యేక ఆపరేషన్ ప్రారంభించింది. రంగంలోకి దిగిన మూడు సైనిక హెలికాప్టర్లు అమెజాన్ అడవుల్లో శోధించాయి. 100 మందికి పైగా సైనికులు, స్నిఫ్ఫర్ డాగ్స్ సాయంతో అమెజాన్ అడవుల్లో ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. మూడు మృతదేహాలను గుర్తించిన సైనికులు.. చిన్నారుల ఆచూకీ కోసం తీవ్రంగా గాలించారు. రోజులు గడుస్తున్నా.. చిన్నారుల ఆచూకీ లభించలేదు. అలా 40 రోజులు గడిచిపోయాయి. ఇక చిన్నారులపై ఆశలు వదిలేసుకుంటున్న తరుణంలో.. సైనికులకు పసివాళ్లు కనిపించారు. 40 రోజులుగా అమెజాన్‌ అడవుల్లో తప్పిపోయిన చిన్నారులను సురక్షితంగా ఆస్పత్రికి తరలించామన్న కొలంబియా అధ్యక్షుడి ప్రకటనతో ప్రజలు హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. సైనికులు గుర్తించినప్పుడు.. అడవుల్లో చిన్నారులు కలిసి ముందుకు సాగుతున్నారని.. ఇప్పుడు వారికి చికిత్స అందిస్తున్నామని పెట్రో తెలిపారు. ఈ ఘటన చరిత్రలో నిలిచిపోతుందని అన్నారు.

ఇవీ చదవండి : అడవిలో ప్లేన్​ క్రాష్​.. నెల రోజులుగా పిల్లలు మిస్సింగ్.. ఎంత వెతుకుతున్నా..

45 బ్యాగుల్లో మానవ శరీర భాగాలు.. మిస్సింగ్​ కేసులో దారుణమైన ట్విస్ట్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.