ETV Bharat / international

పదవి కోసం ఇమ్రాన్​ నిర్వాకం.. బైడెన్​ను బూచిగా చూపే యత్నం..!

author img

By

Published : Apr 1, 2022, 1:11 PM IST

Imran Khan News: ప్రతిపక్షాల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటున్న పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్​ ఖాన్​.. పదవిని కాపాడుకునేందుకు అమెరికాతో ఏర్పడ్డ విరోధాన్ని ఉపయోగించుకుంటున్నారు. తనను అధికారం నుంచి దింపేందుకు బైడెన్‌ నేతృత్వంలోని అమెరికా పాలకులు ప్రయత్నిస్తున్నారంటూ ఇటీవల పేర్కొన్నారు. అయితే ఈ ఆరోపణలను అమెరికా తిరస్కరించింది.

imran khan
ఇమ్రాన్ ఖాన్

Imran Khan News: 'దేవుడి దయవల్ల.. ఈ వ్యక్తి అధికారంలో కొనసాగకూడదు' అంటూ రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన వ్యాఖ్యలు పెనుదుమారం లేవనెత్తాయి. పరాయి దేశాల్లో ప్రభుత్వాలను మార్చేందుకు అమెరికా యత్నిస్తోందనే అర్థం ప్రపంచంలోకి వెళ్లింది. శ్వేతసౌధం వెంటనే ఈ వ్యాఖ్యలపై వివరణ ఇస్తూ.. బైడెన్‌ ఉద్దేశం అది కాదని తేల్చిచెప్పింది. కానీ, ఈ వ్యాఖ్యలను పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ అందిపుచ్చుకొన్నారు. తనను అధికారం నుంచి దింపేందుకు బైడెన్‌ నేతృత్వంలోని అమెరికా పాలకులు ప్రయత్నిస్తున్నారంటూ బాంబు పేల్చారు. ఇమ్రాన్‌ అధికారంలో కొనసాగితే ఇరు దేశాల సంబంధాలు దెబ్బతింటాయని అమెరికా అధికారులు హెచ్చరించినట్లు పేర్కొన్నారు.

బైడెన్‌ అమెరికాలో అధికారం చేపట్టినప్పటి నుంచి ఇమ్రాన్‌ను దూరం పెడుతూ వచ్చారు. పాక్‌ ఎంత ప్రయత్నించినా ఇమ్రాన్‌తో మాట్లాడేందుకు జో బైడెన్‌ అంగీకరించలేదు. కానీ, అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ నేతృత్వంలో నిర్వహించిన 'డెమోక్రసీ సమ్మిట్‌'కు ఇమ్రాన్‌ను ఆహ్వానించారు. కానీ, చైనాకు మద్దతుగా ఇమ్రాన్‌ దీనిలో పాల్గొనేందుకు తిరస్కరించారు. అదే సమయంలో తాలిబన్లను పొగడ్తలతో ముంచెత్తారు. ఉక్రెయిన్‌ ఆక్రమణ సమయంలో రష్యాలో పర్యటించి వ్లాదిమిర్‌ పుతిన్‌తో భేటీ కావడం వల్ల అమెరికాతో దూరం మరింత పెరిగింది. ఇప్పుడు ఇమ్రాన్‌ ఈ విరోధాన్నే తన ఆరోపణలకు ఆధారంగా చూపిస్తున్నారు.

  • తిరస్కరించిన అమెరికా : ఇమ్రాన్‌ ఖాన్‌ ఆరోపణలను అమెరికా తిరస్కరించింది. వీటిపై అమెరికా స్టేట్‌ డిపార్ట్‌మెంట్‌ ప్రతినిధి నెడ్‌ప్రైస్‌ స్పందించారు. ఆ ఆరోపణలు వాస్తవం కాదని వివరణ ఇచ్చారు. "పాకిస్థాన్‌లోని పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తున్నాం. అక్కడి రాజ్యాంగ విధానాలకు, చట్టానికి తమ దేశం పూర్తి మద్దతు ఇస్తుంది" అని తెలిపారు.
  • ఇమ్రాన్‌కు భారీ వ్యతిరేకత : మరోవైపు ఇమ్రాన్‌ ఖాన్‌కు వ్యతిరేకంగా పాకిస్థాన్‌లోని ప్రధాన ప్రతిపక్ష పార్టీలు మొత్తం ఏకమయ్యాయి. ఫలితంగా 342 మంది ఉన్న పాకిస్థాన్‌ నేషనల్‌ అసెంబ్లీలో అవిశ్వాసం వీగిపోవాలంటే 172 ఓట్లు ఇమ్రాన్‌కు అవసరం. కానీ, ఆయనకు వ్యతిరేకంగా 196 ఓట్లు ఉన్నాయని బ్లూమ్‌బెర్గ్‌ కథనంలో పేర్కొంది. దీంతో ఖాన్‌ ఓటమి ఖాయమైందని పేర్కొంది.

గతంలో జుల్ఫీకర్‌ అలీ భుట్టో కూడా..!: 1977 ఏప్రిల్‌ 29న నాటి పాక్‌ ప్రధాని జుల్ఫీకర్‌ అలీ భుట్టో కూడా అమెరికాపై ఇటువంటి ఆరోపణలు చేశారు. తమ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అమెరికా ఓ అంతర్జాతీయ కుట్రకు ఆర్థిక సాయం చేస్తోందని మండిపడ్డారు. ఈ విషయాన్ని ఆయన పాక్‌ నేషనల్‌ అసెంబ్లీ జాయింట్‌ సెషన్‌లో ప్రకటించడం గమనార్హం. వియత్నాం యుద్ధంలో మద్దతు ఇవ్వనందుకు.. ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా అరబ్‌ దేశాలకు మద్దతు ఇచ్చినందుకు ఈ చర్యలు చేపడుతోందని పేర్కొన్నారు. దాదాపు 45 నిమిషాల పాటు సాగిన ఈ ప్రసంగంలో.. మరచిపోవడం, క్షమించడం తెలియని ఓ ఏనుగుతో అమెరికాను పోల్చారు. వాస్తవానికి ఫ్రాన్స్‌ నూక్లియర్‌ రీ ప్రాసెసింగ్‌ ప్లాంట్‌ను పాకిస్థాన్‌కు ఇవ్వకుండా అమెరికా అడ్డుకున్నప్పటి నుంచి జుల్ఫీకర్‌ ఆ దేశానికి వ్యతిరేకంగా ఆరోపణలు చేశారు. ఆ తర్వాత మూడు నెలల్లోనే జనరల్‌ జియా ఉల్‌ హక్‌ నేతృత్వంలో పాక్‌ సైన్యం తిరుగుబాటు చేసి అధికారం హస్తగతం చేసుకొంది. ఆ తర్వాత భుట్టోను అవినీతి ఆరోపణలపై అరెస్టు చేసి విచారణ జరిపి ఉరితీసింది.

ఇదీ చూడండి: 'రాజీనామా చేసే ప్రసక్తే లేదు.. చివరి వరకు పోరాడతా'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.