ETV Bharat / international

Donald Trump Arrest : ట్రంప్​ మళ్లీ అరెస్ట్​.. 20నిమిషాల పాటు జైలులో.. తొలిసారి 'మగ్​షాట్​' రిలీజ్​

author img

By ETV Bharat Telugu Team

Published : Aug 25, 2023, 7:33 AM IST

Updated : Aug 25, 2023, 8:36 AM IST

Donald Trump Arrest : ఎన్నికల ఫలితాలను మార్చేందుకు ప్రయత్నించారన్న కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌.. జార్జియా జైలులో పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆ తర్వాత బెయిల్​పై బయటకొచ్చారు. అయితే ట్రంప్​ బయటకొచ్చిన కాసేపటికే ఆయన మగ్​షాట్​ను అధికారులు విడుదల చేశారు.

Donald Trump Arrest
Donald Trump Arrest

Donald Trump Arrest : అగ్రరాజ్యం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ అరెస్టు అయ్యారు. 2020 నాటి అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి ఫలితాల్లో జోక్యం, కుట్ర తదితర కేసులు నమోదైన నేపథ్యంలో జార్జియా జైలు వద్ద పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఫుల్టన్‌ కౌంటీ జైలులో లొంగిపోయేందుకు ట్రంప్​నకు ఇప్పటికే అట్లాంటా ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ అనుమతించారు. బెయిల్‌ కోసం రెండు లక్షల డాలర్ల విలువైన బాండ్‌ను సమర్పించాలని ఆయన్ను ఆదేశించారు. దీంతో ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు ట్రంప్‌ జైలుకు వెళ్లారు. జైలులో 20 నిమిషాలు గడిపారు. అనంతరం బెయిల్‌పై ట్రంప్​ బయటకొచ్చారు.

తొలిసారి ట్రంప్​ మగ్​షాట్​ రిలీజ్​..
Trump Mugshot : ట్రంప్‌పై నమోదైన నాలుగు క్రిమినల్‌ కేసుల్లో ఇదొకటి. అయితే అధికారులు తొలిసారి.. ట్రంప్​ మగ్​షాట్​ను​ (అరెస్ట్​ అయ్యాక నిందితులు తమ వివరాలతో కూడిన పలక పట్టుకుంటే.. పోలీసులు తీసే ఫొటో) విడుదల చేశారు. జార్జియా జైలు నుంచి ట్రంప్​.. బయటకొచ్చిన కొద్దిసేపటికే ఫుల్టన్ కౌంటీ షెరీఫ్ కార్యాలయం మగ్​షాట్​ను రిలీజ్​ చేసింది. జైలు రికార్డుల్లో ట్రంప్​ ఖైదీ నెంబర్​ P01135809గా నమోదైనట్లు సమాచారం.

మళ్లీ పాతరాగమే..
Trump Latest News : జైలు నుంచి విడుదలైన తర్వాత ట్రంప్​.. మీడియాతో మాట్లాడారు. తాను ఏ తప్పు చేయలేదని మళ్లీ పాతరాగమే అందుకున్నారు. తనపై ఉన్న క్రిమినల్​ కేసును.. న్యాయానికి అపహాస్యంగా అభివర్ణించారు. నిజాయతీగా జరగని ఎన్నికలను సవాలు చేసే హక్కు ఉందని తెలిపారు. అయితే జైలు వెలుపల ఉన్న ట్రంప్​ మద్దతుదారులు.. ఫుల్టన్‌ కౌంటీ డిస్ట్రిక్ట్‌ అటార్ని ఫాని విల్లీస్‌ వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ట్రంప్​ రాకకు ముందే పోలీసులు ఫుల్టన్ కౌంటీ జైలు వెలుపల పటిష్ఠ బందోబస్తును ఏర్పాటు చేశారు.

ట్రంప్​ ట్వీట్​..
Trump Latest Tweet : మరోవైపు, జైలు అధికారులు విడుదల చేసిన మగ్​షాట్​ను ట్రంప్​.. తన అధికారిక ట్విట్టర్​ ఖాతాలో పోస్ట్ చేశారు. ఆగస్టు 24వ తేదీ మగ్​షాట్​ అంటూ ట్వీట్​ చేశారు. ఎన్నికల జోక్యం.. ఎప్పటికీ లొంగను! అంటూ తన మగ్​షాట్​ కింద రైటప్​ ఇచ్చారు. ట్రంప్ ట్విట్టర్​ ఖాతాను పునరుద్ధరించిన తర్వాత ఆయన చేసిన తొలి పోస్ట్​ ఇదే కావడం గమనార్హం.

కొన్నిరోజుల కిందట..
Trump Surrender News : అయితే ఇలాంటి కేసుల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు తమంతట తాముగా పోలీసులు ఎదుట లొంగిపోయినా.. అమెరికాలో దాన్ని అరెస్ట్‌ కిందే పరిగణిస్తారు. కొన్ని రోజుల కిందట కూడా 2020 ఎన్నికలకు సంబంధించిన కేసులోనే ట్రంప్‌ అరెస్టయ్యారు. ఈ ఆరోపణలన్నీ అవాస్తవాలని.. తాను ఏ తప్పు చేయలేదని ట్రంప్‌ వెల్లడించారు.

Last Updated :Aug 25, 2023, 8:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.