ETV Bharat / international

'ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర.. యుద్ధాన్ని ఆపే సత్తా మోదీకి మాత్రమే!'

author img

By

Published : Feb 11, 2023, 2:23 PM IST

russian ukraine latest news today
ఉక్రెయిన్​పై రష్యా దండయాత్ర

ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్ర చేపట్టి దాదాపు ఏడాది అవుతోంది. అంతర్జాతీయంగా ఎన్ని విమర్శలు, ఆంక్షలు వెల్లువెత్తినప్పటికీ పుతిన్ వెనక్కి తగ్గడం లేదు. యుద్ధాన్ని ఆపేందుకు వివిధ దేశాలు, అంతర్జాతీయ సంస్థలు ప్రయత్నిస్తున్నా ఫలితం కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో యుద్ధాన్ని ఆపే సామర్థ్యం మోదీకి మాత్రమే ఉందని అగ్రరాజ్యం పేర్కొంది. పుతిన్‌తో మోదీ మాట్లాడి ఒప్పించగలరని తెలిపింది.

దాదాపు ఏడాదికాలంగా ఉక్రెయిన్‌పై దండయాత్ర చేస్తున్న రష్యా దాడులు మరింత ఉద్ధృతం చేసింది. ఎంతమంది దేశాధినేతలు చెప్పినా వినకుండా రష్యా అధ్యక్షుడు పుతిన్ యుద్ధం విషయంలో ముందుకు వెళ్తున్నారు. ఉక్రెయిన్ బలగాల నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురవడంతో ఆగ్రహంగా ఉన్న మాస్కో భీకర దాడులతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో పుతిన్‌ను ఆపే సామర్థ్యం ప్రధాని మోదీకే ఉందని అమెరికా గట్టిగా విశ్వసిస్తోంది.

ఉక్రెయిన్‌ యుద్ధానికి ముగింపు పలికే విషయంలో భారత ప్రధాని మోదీ పుతిన్‌ను ఒప్పించగలరా అన్న మీడియా ప్రశ్నకు శ్వేతసౌధ ప్రతినిధి జాన్‌ కెర్బీ అవుననే సమాధానం ఇచ్చారు. ఉక్రెయిన్‌తో యుద్ధాన్ని రష్యా నిలిపివేసేందుకు ఇంకా సమయం ఉందని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. పుతిన్‌ను మోదీ ఒప్పించగలరని, అందుకోసం తీసుకునే ఏ చర్యలైనా తమకు అంగీకారమేనని అమెరికా ప్రతినిధి వెల్లడించారు. యుద్ధానికి ప్రధాన కారణమైన పుతిన్‌.. తాను అనుకుంటే ఈ దురాక్రమణను తక్షణమే ఆపగలరని కానీ అందుకు భిన్నంగా మరిన్ని దాడులు ప్రయోగిస్తున్నాడని పేర్కొన్నారు.

జాతీయ భద్రతా సలహాదారు అజిత్‌ డోభాల్‌ మాస్కోలో పుతిన్‌తో సమావేశమైన మరుసటిరోజు అమెరికా నుంచి ఈ స్పందన రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి పుతిన్‌, జెలెన్‌స్కీలతో పలుమార్లు ప్రధాని మోదీ మాట్లాడారు. గతేడాది ఉజ్బెకిస్థాన్‌లో జరిగిన ఎస్​సీఓ సదస్సులో పుతిన్‌తో సమావేశమైన మోదీ ఇది యుద్ధాల యుగం కాదంటూ సూచన చేశారు. అమెరికాసహా పశ్చిమ దేశాలు మోదీ సూచనపై హర్షం వ్యక్తం చేశాయి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.