ETV Bharat / international

'కరోనాపై ఆ భావన ప్రమాదకరం.. భవిష్యత్​లో మరిన్ని వేరియంట్లు'

author img

By

Published : Jan 24, 2022, 7:29 PM IST

WHO chief
టెడ్రోస్​ అధనోమ్ గెబ్రెయెసస్

WHO on pandemic end: కరోనా మహమ్మారి చివరి దశలో ఉన్నామని, ఒమిక్రాన్ వేరియంట్​ చివరిదిగా భావించటం చాలా ప్రమాదకరమని హెచ్చరించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. భవిష్యత్తులో మరిన్ని వేరియంట్లు ఉద్భవించేందుకు అవకాశం ఉందని పేర్కొంది. అయితే.. డబ్ల్యూహెచ్​ఓ నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవటం ద్వారా వైరస్​కు ముగింపు పలకొచ్చని సూచించింది.

WHO on pandemic end: ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా మహమ్మారి కట్టడికి తగిన చర్యలు తీసుకోవాలని, మరిన్ని వేరియంట్లు ఉద్భవించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్లు హెచ్చరించించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఒమిక్రాన్​ వేరియంట్​ చివరిదిగా భావించటం లేదా చివరి దశలో ఉన్నామనుకోవటం చాలా ప్రమాదకరమని ఆందోళన వ్యక్తం చేసింది. కొన్ని కీలక లక్ష్యాలను చేరుకుంటే ప్రస్తుతం వణికిస్తున్న కొవిడ్​ దశ ఈ ఏడాది చివరి నాటికి ముగుస్తుందని అంచనా వేసింది.

డబ్ల్యూహెచ్​ఓ ఎగ్జిక్యూటివ్​ బోర్డు మీటింగ్​ ప్రారంభం సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్​ అధనోమ్ గెబ్రెయెసస్​. పొగాకు వినియోగం తగ్గింపు, యాంటీ మైక్రోబయల్​ చికిత్సలపై పోరాటం, మనుషుల ఆరోగ్యంపై పర్యావరణ మార్పుల ప్రభావం వంటి కీలక అంశాల్లో సాధించిన విజయాలు, ఆందోళనలను వెల్లడించారు​. ప్రస్తుత కొవిడ్ దశకు ముగింపు.. దేశాలు కలిసికట్టుగా తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందన్నారు.

"కరోనా మహమ్మారి ప్రస్తుత దశ ముగింపుతో పాటు.. పూర్తిస్థాయిలో తరిమేసేందుకు విభిన్న పరిస్థితులు ఉన్నాయి. కానీ, ఒమిక్రాన్​ చివరి వేరియంట్​ అని.. లేదా మనం చివరి దశలో ఉన్నామని భావించటం చాలా ప్రమాదకరం. దేశాలవారీగా, అంతర్జాతీయంగా మరిన్ని వేరియంట్లు ఉద్భవించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి. గ్లోబల్​ ఎమర్జెన్సీగా కొవిడ్​-19కు ముగింపు పలకొచ్చు. ప్రతి దేశంలో 70 శాతం మందికి టీకా అందించటం, అధిక రిస్క్​ ఉన్న ప్రజలపై దృష్టి సారించటం, పరీక్షల సామర్థ్యాన్ని పెంచటం, కొత్త వేరియంట్లు నిశితంగా పరిశీలించటం వంటి డబ్ల్యూహెచ్​ఓ లక్ష్యాలను చేరుకోవటం ద్వారా ఈ ఏడాదే చేయొచ్చు."

- టెడ్రోస్​ అధనోమ్​, డబ్ల్యూహెచ్​ఓ అధినేత.

భవిష్యత్​లో కొవిడ్​తో కలిసి జీవిస్తామనేది నిజమన్నారు టెడ్రోస్​. అయితే.. కొవిడ్​తో కలిసి జీవిచటం అంటే దానిని వదిలేయటం కాదని, వారానికి 50వేల మరణాలు సంభవించేందుకు ఆస్కారం కల్పించటం కాదన్నారు. డబ్ల్యూహెచ్​ఓను బలోపేతం చేయాలని, తగిన నిధులను సమకూర్చాలని ప్రపంచ దేశాలను కోరారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇదీ చూడండి: ఏడు రోజుల్లో 1.8కోట్ల కేసులు- ఆ దేశాల్లో తగ్గిన ఒమిక్రాన్ వ్యాప్తి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.