ETV Bharat / international

ఏడు రోజుల్లో 1.8కోట్ల కేసులు- ఆ దేశాల్లో తగ్గిన ఒమిక్రాన్ వ్యాప్తి!

author img

By

Published : Jan 19, 2022, 7:40 PM IST

WHO counts 18 million virus cases last week as omicron slows
ప్రపంచవ్యాప్తంగా వారం రోజుల్లో 1.8కోట్ల కేసులు

Corona cases in world: ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులు గతవారం తగ్గుముఖం పట్టినట్లు డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. అమెరికా, ఐరోపా దేశాలు ఒమిక్రాన్​ పీక్ దశను అధిగమించాయని పేర్కొంది. అయితే నైరుతి ఆసియాలో కేసులు ఆందోళనకరస్థాయిలో పెరుగుతున్నాయని చెప్పింది.

Corona cases in world: ప్రపంచవ్యాప్తంగా గతవారం 1.8కోట్ల కరోనా కేసులు నమోదైనట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. అంతకుముందు వారంతో పోల్చితే కేసులు 20 శాతమే పెరిగినట్లు నివేదికలో వెల్లడించింది. మరణాల సంఖ్య మాత్రం స్థిరంగా 45వేలుగా ఉన్నట్లు పేర్కొంది. ఆఫ్రికా మినహా ప్రపంచంలోని అన్ని దేశాల్లో కరోనా కేసులు పెరిగినట్లు పేర్కొంది. ఒమిక్రాన్ వ్యాప్తి తగ్గినందు వల్లే కేసుల వృద్ధి శాతం తక్కువ ఉందని అభిప్రాయపడింది. అంతకుముందు వారం, గత నెలలో కేసులు 50శాతం పెరిగాయని గుర్తు చేసింది.

అన్ని ప్రాంతాలతో పోల్చితే నైరుతి ఆసియాలో కేసుల వృద్ధి గణనీయంగా ఉందని డబ్ల్యూహెచ్​ఓ చెప్పింది. ఈ దేశాల్లో కొవిడ్​ కేసులు వారంలో 145శాతం పెరిగినట్లు పేర్కొంది. పశ్చిమాసియాలో ఈ శాతం 68గా ఉన్నట్లు పేర్కొంది.

డబ్ల్యూహెచ్​ఓ నివేదిక ప్రకారం అమెరికా, ఐరోపా దేశాల్లో కేసుల వృద్ధి 17, 10శాతంగానే ఉంది. ఒమిక్రాన్ పీక్ దశకు చేరి తగ్గుముఖం పట్టడం వల్లే కేసులు పెరుగుదల తక్కువగా నమోదైంది. రానురాను ఈ దేశాల్లో కేసులు ఇంకా తగ్గుతాయి.

ఆంక్షలు ఎత్తివేత..

ఒమిక్రాన్ వేరియంట్​ పీక్ దశను అధిగమించినట్లు గణాంకాలు చెబుతున్నాయని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ తెలిపారు. కేసులు తగ్గుముఖం పడుతున్నందున ఒమిక్రాన్ కట్టడి కోసం అమలు చేస్తున్న ఆంక్షలను వచ్చే గురువారం నుంచి ఎత్తివేస్తున్నట్లు ప్రకటించారు.

జపాన్​లో కొత్త ఆంక్షలు

ఒమిక్రాన్ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్న కారణంగా శుక్రవారం నుంచి కొత్త ఆంక్షలు విధించనుంది జపాన్. రాజధాని టోక్యో సహా పలు ప్రాంతాల్లో ఫిబ్రవరి 13వరకు నూతన నిబంధనలను అమలు చేయనుంది. రెస్టారెంట్ల సమయాన్ని తగ్గించనుంది. శుక్రవారం ఇందుకు సంబంధించి ప్రధాని ఫుమియో కిషిదా అధికారిక ప్రకటన చేయనున్నారు.

టోక్యోలో బుధవారం ఒక్కరోజే 7,377 కేసులు వెలుగుచుశాయి. వైరస్ వ్యాప్తి మొదలైనప్పటి నుంచి ఈ స్థాయిలో కేసులు నమోదవ్వటం ఇదే తొలిసారి.

పాకిస్థాన్​లోనూ...

పాకిస్థాన్​లోనూ కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ఆంక్షలు విధించింది ప్రభుత్వం. పాజిటివిటీ రేటు 10శాతానికి పైగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడకుండా నిషేధించింది.

ఆ దేశంలో బుధవారం 5,472 కేసులు వెలుగుచూశాయి. ఈ నెల మొదట్లో ఒక్క శాతంగా ఉన్న పాజిటివిటీ రేటు 9.48శాతానికి పెరిగింది. దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది.

స్లొవేకియాలో..

ఒమిక్రాన్ వ్యాప్తి దృష్ట్యా స్లోవేకియా కూడా బుధవారం నుంచి కొత్త ఆంక్షలు అమలు చేస్తోంది. వివాహాలు, పార్టీలు, ఈత కొలనులకు వెళ్లే వారు బూస్టర్ డోసు లేదా రెండు డోసుల టీకా తీసుకోవాలని స్పష్టం చేసింది. లేకపోతే అనుమతి ఉండదని తేల్చిచెప్పింది.

ఇదీ చదవండి: ఆ మహిళ అదిరే ఫీట్​- మరోసారి బుర్జ్​ ఖలీఫాపై ప్రత్యక్షం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.