ETV Bharat / international

'ఆందోళనకర స్థాయిలో భూతాపం- ఇక ఏటా విపత్తులు!'

author img

By

Published : Aug 9, 2021, 5:14 PM IST

Updated : Aug 9, 2021, 6:33 PM IST

ipcc report on climate change
ఆందోళనకర స్థాయిలో భూతాపం.. 2030 నాటికి..

భూతాపంపై తక్షణమే తగిన చర్యలు చేపట్టకపోతే భవిష్యత్తులో దానిని కట్టడి చేయలేని స్థాయికి చేరుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. తీర ప్రాంతాల్లో సముద్రమట్టం పెరుగుదల తీవ్రంగా ఉంటుందన్నారు. ప్రస్తుతం ఉన్న భూతాపానికి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్రమైన వేడి ఉష్ణోగ్రతలు ఇక నుంచి పదేళ్లకోసారి నమోదవుతాయని తెలిపారు.

భూతాపం​పై ఐక్యరాజ్య సమితి​ ఆందోళనకర విషయాలను వెల్లడించింది. భారత్ సహా ఉపఖండంలో రానున్న రోజుల్లో వడగాలుల తీవ్రత పెరగడం సహా కరవు కాటకాలు ఎక్కువగా సంభవిస్తాయని ఐక్యరాజ్య సమితి నివేదిక హెచ్చరించింది. దేశంలో తుపానుల సంఖ్య పెరగడం సహా అతివృష్టితో అనేక ప్రాంతాలు అతలాకుతలం అవుతాయని పేర్కొంది. హిందూ మహాసముద్రంలో పెరుగుతున్న ఉష్ణోగ్రతలే ఇందుకు కారణమని తెలిపింది.

un on global warming
తుపాను ధాటికి ధ్వంసమైన ఇల్లు

ప్రపంచవ్యాప్తంగా 100 ఏళ్లకు ఓసారి ఏర్పడి భారీగా సముద్రమట్టం పెరుగుదలకు కారణమయ్యే విపత్తులు.. ఇక నుంచి ఈ శతాబ్దం చివరిలో ప్రారంభమై ఏటా సంభవిస్తాయని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. ఈ ప్రభావం తీర ప్రాంతాలపైన ఎక్కువగా ఉంటుందని తెలిపారు. తీర ప్రాంతాల్లో సముద్రమట్టం పెరుగుదల ఈ శతాబ్దం మొత్తం కొనసాగుతుందని పేర్కొన్నారు. భూతాపంపై ఐరాస​ ఆధ్వర్యంలోని 234 మంది శాస్త్రవేత్తలు కలిసి రూపొందించిన నివేదిక ద్వారా ఈ విషయాలు వెల్లడయ్యాయి. 3 వేలకుపైగా పేజీలు ఉన్న ఈ రిపోర్టును 195 సభ్య దేశాలు ఉన్న ఇంటర్​ గవర్నమెంటల్​ ప్యానెల్​ ఆమోదించింది. ఐరాస​ సోమవారం ఈ నివేదికను విడుదల చేసింది.

పదేళ్లకు ఓసారి.. ఇకనుంచి..

భూతాపం మరో 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్​ దాటితే.. తీవ్రమైన వడగాలులు, సుదీర్ఘ కాలం వేసవి ఉండటం, చలికాలం నిడివి తగ్గడం వంటవి జరుగుతాయని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఇదే 2 డిగ్రీల సెంటీగ్రేడ్​ చేరితే ఈ తీవ్రత మరింత పెరిగి వ్యవసాయం, ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపిస్తుందని హెచ్చరించారు. ప్రస్తుతం ఉన్న భూతాపానికి 50 ఏళ్లకోసారి నమోదయ్యే తీవ్రమైన వేడి ఉష్ణోగ్రతలు ఇక నుంచి పదేళ్లకోసారి నమోదవుతాయని తెలిపారు. భూతాపం మరో డిగ్రీ పెరిగితే ఈ ప్రభావం ప్రతి ఏడేళ్లకు రెండుసార్లు ఉంటుందన్నారు. ఈ భూతాపం ప్రభావం ప్రతి ప్రాంతంపైనా ఉంటుందని నిపుణులు స్పష్టం చేశారు.

un on global warming
వరదలు

ప్రస్తుత పరిస్థితులను చూస్తే..

ఇటీవల కాలంలో భూతాపం వేగంగా పెరుగుతోందని.. ఇదే కొనసాగితే 2030 నాటికే 1.5 డిగ్రీల సెంటీగ్రేడ్​ను దాటే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ప్రపంచ దేశాలు తగిన చర్యలు వేగంగా చేపట్టకపోతే.. కట్టడి చేయలేని స్థాయికి భూతాపం చేరుతుందని హెచ్చరిస్తున్నారు. తక్షణ చర్యలు చేపడితే.. గాలి నాణ్యత పెరుగుతుందని, అయితే భాతాపం తగ్గడానికి 20 నుంచి 30 ఏళ్లు పడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.

un on global warming
భూతాపానికి ఏడారిలా మారుతున్న భూమి

ఇప్పటికీ అవకాశం ఉంది..

మావన తప్పిదాల వల్లే ఈ దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తోందని శాస్త్రవేత్తలు నివేదికలో పేర్కొన్నారు. అయితే దీనిని కట్టడి చేసేందుకు ఇంకా స్వల్ప అవకాశాలు ఉన్నాయన్నారు. భూతాపం మరో 1.5 డిగ్రీలు దాటకుండా ఉండాలంటే తక్షణమే అందుకు తగిన చర్యలు చేపట్టాలని.. అలా అయితే పరిస్థితి మరింత విషమించకుండా ఉండే అవకాశం ఉంటుందన్నారు.

un on global warming
కార్చిచ్చు

"2040 నాటికి ఉద్గారాలు ఉత్పత్తిని పూర్తిగా కట్టడి చేయగలిగితే భూతాపం 1.5 డిగ్రీలు దాటకుండా ఉండేందుకు మనకు మూడులో రెండు వంతులు అవకాశం ఉంది. ఇది సాధించేందుకు మరో పదేళ్లు ఆలస్యం అయితే మూడులో ఒక వంతు మాత్రమే అవకాశం ఉంటుంది. మీథేన్​, కార్బన్​ సహా గ్రీన్​హౌస్​ వాయువులను కట్టడి చేయడం వల్ల గాలి నాణ్యత పెరగడమే కాక దాని వల్ల ఇతర ప్రయోజనాలు కూడా ఉంటాయి."

-డాక్టర్​ ఫ్రైడెరిక్​ ఒట్టో, ఐపీసీసీ నివేదిక సహ రచయిత

భూతాపం పెరిగే కొద్దీ వాతారణ మార్పులే కాక వివిధ రకాలుగా విపత్తులు ఏర్పడతాయని తెలిపారు. కరవు, కార్చిచ్చులతో సతమతం అవుతున్న పశ్చిమ అమెరికానే అందుకు ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.

ఇదీ చదవండి : అమెరికాలో కొవిడ్ విలయం- రోగులతో ఆస్పత్రులు ఫుల్

Last Updated :Aug 9, 2021, 6:33 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.