ETV Bharat / international

మోడెర్నా టీకాకు ఈయూ ఏజెన్సీ ఆమోదం

author img

By

Published : Jan 6, 2021, 9:26 PM IST

ఐరోపా సమాఖ్యకు రెండో టీకా అందుబాటులోకి రానుంది. మోడెర్నా టీకాను అత్యవసర వినియోగం కోసం అనుమతించాలని ఈయూ ఔషధ నియంత్రణ సంస్థ సిఫార్సు చేసింది. ఇప్పటికే ఫైజర్ వ్యాక్సిన్​కు ఆమోదం తెలిపిన ఈయూ.. తాజాగా మోడెర్నా టీకాను పంపిణీ చేయనుంది. మరోవైపు, నెదర్లాండ్స్​లో టీకా పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాగా.. రష్యాలో పది లక్షల మందికి స్పుత్నిక్ డోసులు అందించారు.

EU agency approves Moderna''s COVID-19 vaccine
మోడెర్నా టీకాకు ఈయూ ఏజెన్సీ ఆమోదం

అమెరికా దిగ్గజ సంస్థ మోడెర్నా తయారు చేసిన కొవిడ్ టీకాకు ఐరోపా సమాఖ్య నియంత్రణ ఏజెన్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఫలితంగా 27 దేశాల ఐరోపా కూటమికి రెండో వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది. ఇప్పటికే ఫైజర్ టీకా అత్యవసర వినియోగానికి ఐరోపా సమాఖ్య అనుమతించింది.

మోడెర్నా టీకా ఆమోదించాలని యూరోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీకి చెందిన మానవ ఔషధ కమిటీ.. ఈయూ ఎగ్జిక్యూటివ్ కమిషన్​కు సూచించింది. మెడిసిన్స్ ఏజెన్సీ సిఫార్సులను ఈయూ కమిషన్ తప్పనిసరిగా ఆమోదించాల్సి ఉంటుంది.

టీకా అనుమతుల కోసం నిపుణుల కమిటీ సిఫార్సు చేయడాన్ని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఉర్సులా వాండర్ లెయెన్ స్వాగతించారు. ఈయూ సభ్యదేశాలకు సత్వరమే టీకా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.

నెదర్లాండ్స్​​లో ఆలస్యంగా

మరోవైపు, ఈయూలోని అనేక దేశాల్లో రెండు వారాల క్రితమే వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా.. తాజాగా నెదర్లాండ్స్​లో టీకా పంపిణీ కార్యక్రమం మొదలైంది. కేర్​హోమ్, వైద్య సిబ్బందికి ముందుగా టీకాలు ఇవ్వనున్నారు. సన్నా ఎల్కాదిరీ అనే మహిళ దేశంలో తొలి టీకా డోసును స్వీకరించారు.

దేశంలో ఆలస్యంగా టీకా పంపిణీ ప్రారంభం కావడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఆక్స్​ఫర్డ్ టీకా పంపిణీ కోసమే అధికారులు ప్రధానంగా ఏర్పాట్లు చేశారని అందువల్లే ఫైజర్ డోసుల పంపిణీ ఆలస్యమైందని నెదర్లాండ్ ప్రధాని మార్క్ రుట్టే పేర్కొన్నారు.

పది లక్షల మందికి స్పుత్నిక్

తమ దేశంలో పది లక్షల మందికి స్పుత్నిక్ వీ టీకాను అందించినట్లు రష్యా విదేశాంగ శాఖ ట్విట్టర్​లో తెలిపింది. స్పుత్నిక్ టీకా ద్వారా వైరస్ నుంచి 96-97 శాతం వరకు రక్షణ ఉంటుందని పేర్కొంది. వైద్య నిపుణులు ఈ విషయాన్ని నిర్ధరించారని తెలిపింది.

యూకేలో బయటపడిన కొత్త స్ట్రెయిన్​పై సైతం ఈ టీకా అత్యంత సమర్థంగా పనిచేస్తుందని స్పుత్నిక్ తయారీలో భాగస్వామి అయిన రష్యన్ డైరెక్ట్ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్ సీఈఓ కిరిల్ దిమిత్రేవ్ పేర్కొన్నారు.

మరోవైపు, టీకా స్వీకరించినవారు 42 రోజులపాటు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలని రష్యా డిప్యూటీ ప్రధాని టాటియానా గోలికోవా సూచించారు.

ఇదీ చదవండి: జార్జియా నుంచి సెనెట్​కు తొల్లి నల్లజాతీయుడు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.