ETV Bharat / international

భారత్​పై నేపాల్​కు ఎందుకంత అక్కసు?

author img

By

Published : Aug 12, 2020, 5:15 AM IST

భారత్​ పట్ల తీవ్ర ప్రతికూల వైఖరిని వ్యక్తం చేస్తున్నారు నేపాల్​ ప్రధాని కేపీ శర్మ ఓలీ. ఆయన పనిగట్టుకుని మరీ వివాదాలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది. మొన్న రాముడి జన్మస్థలం నేపాలోనే ఉందంటూ సరికొత్త రామాయణం వినిపించారు. ఇప్పుడు బుద్ధుడు భారతీయుడు ఎలా అయ్యాడని ప్రశ్నించి మరో అగ్గి రాజేశారు. అసలు ఓలీ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు..భారత్‌పైనే ఎందుకింత అక్కసు.. చైనా ఒత్తిడికి ఆయన తలొగ్గారా?

Why Nepal PM Raising Concerns Towards Lord Rama And Gowtham Buddha
భారత్​పై నేపాల్​కు ఎందుకంత అక్కసు?

చిటికెడు ఉప్పు చాలు, కడివెడు పాలు విరగడానికి..ప్రస్తుతం ఇలానే ఉంది పొరుగు దేశం ప్రధాన మంత్రి కేపీ శర్మ ఓలీ వైఖరి. భారత్‌ పట్ల ప్రతికూల వైఖరితో రగిలిపోతున్న ఆయన తీరు రాన్రాను మరిన్ని వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. పనిగట్టుకుని మరీ వివాదాలు సృష్టిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ సమయంలో ఆయన ఉపయోగించే భాష కూడా ఏ మాత్రం అంగీకరించలేని స్థాయికి చేరుతోంది. మొన్న రాముడి జన్మస్థలం నేపాలోనే ఉందంటూ సరికొత్త రామాయణం వినిపించారు. ఇప్పుడు బుద్ధుడు భారతీయుడు ఎలా అయ్యాడని ప్రశ్నించి మరో అగ్గి రాజేశారు. అసలు ఓలీ ఎందుకిలా ప్రవర్తిస్తున్నారు..భారత్‌పైనే ఎందుకింత అక్కసు.. నేపాల్‌లో తన పట్టు పెంచుకునేందుకేనా ఇదంతా..లేదంటే చైనా ఒత్తిడి మేరకు ఇలా ప్రవర్తిస్తున్నారా..

ఓలి సాహసం

ఖడ్గు ప్రసాద్ శర్మ ఓలీ..కేపీ శర్మ ఓలీగా పిలుచుకునే ఈ నేపాల్ ప్రధాన మంత్రి వైఖిరి అంతుబట్టకుండా ఉంది. భారత్‌తో చిరకాల మైత్రిని, తరతరాల అనుబంధాలను తెగనాడుతూ ఆయన చేస్తున్న వరుస వివాదాస్పద వ్యాఖ్యలే అందుకు కారణం. రోజుకొక వివాదాస్పద వ్యాఖ్య, చర్యల ద్వారా ఆయన భారత్ పట్ల ఘర్షణాత్మక వైఖరిని అవలింబిస్తున్నట్టు కనిపిస్తోంది. కొత్త మార్గాల్లో ఆయన భారత్‌తో ఘర్షణకు దిగుతున్నారు. ఇటీవలే రాముడి జన్మస్థలంపై సందేహాలు వెలుబుచ్చి ఈ వివాదానికి తెరతీశారు. ఇప్పుడు గౌతమ బుద్ధుడు భారతీయుడు ఎలా అవుతాడని ప్రశ్నించడం ద్వారా..మరో తేనే తుట్టె కదిపారు. ఈ విషయంలో ఓలీ నేరుగా వ్యాఖ్యలు చేయనప్పటికీ.. పరోక్షంగా ఆయన ఇందుకు శ్రీకారం చుట్టినట్టు కనిపిస్తోంది. బుద్ధుడిని, భారతదేశాన్ని వేరుచేసి చూడాలన్న సాహసం ఎందుకు చేస్తున్నారో కూడా చాలామందికి అర్థం కావడంలేదు.

ఆ ప్రకటనే కారణమా?

గౌతమబుద్ధుడు భారతీయుడు ఎలా అవుతాడని నేపాల్ సందేహాలు లేవనెత్తడానికి అసలు కారణం విదేశాంగ మంత్రి జైశంకర్ చేసిన ప్రకటన. భారతీయులంతా గుర్తుంచుకోవాల్సిన మహా పురుషులు ఇద్దరు ఉన్నారు. వారిలో ఒకరు గౌతమ బుద్ధుడు, మరొకరు మహాత్మ గాంధీ అని జైశంకర్‌ సీఐఏ సమావేశంలో వ్యాఖ్యానించారు. అయితే ఆ మాటను కలహానికి కారణంగా మార్చుతోంది నేపాల్ నాయకత్వం. గౌతమ బుద్ధుడు నేపాల్‌లోని లుంబినిలో జన్మించాడని, ఇది తిరుగులేని వాస్తవమని, దీనికి చారిత్రక, పురావస్తు ఆధారాలున్నాయని నేపాల్ విదేశాంగశాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. బుద్ధుని జన్మస్థలం లుంబిని, బౌద్ధ మతానికి కేంద్రం. దీనికి యునెస్కో వారసత్వ సంపదల్లో ఒకటిగా గుర్తింపు ఉంది. గౌతమ బుద్ధుడి గురించి భారత విదేశాంగ మంత్రి చేసిన ప్రకటన అభ్యంతరకరమని నేపాల్ మాజీ ప్రధాని మాధవ కుమార్‌ నేపాల్ కూడా అన్నారు. బుద్ధుడు నేపాల్‌లోనే జన్మించాడన్న భారత విదేశాంగ మంత్రి చేసిన ప్రకటనపై తనకు తీవ్ర అభ్యంతరాలు ఉన్నాయని, ఇది చారిత్రక వాస్తవాలకు విరుద్ధమని నేపాలీ కాంగ్రెస్‌ ప్రతినిధి విశ్వప్రకాశ్‌ శర్మ అన్నారు.

థోరిలో తవ్వకాలు

అంతేకాకుండా 2004లో మోదీ నేపాల్ పర్యటనను తన ప్రకటనలో ప్రస్తావిస్తూ బుద్ధుడు లుంబినిలో జన్మించినట్లు ప్రధాని మోదీ పేర్కొన్నట్లు ఆ ప్రకటనలో నేపాల్ విదేశాంగ శాఖ వెల్లడించింది. అయితే వివాదాన్ని మరింత సాగదీయకుండా అక్కడితో ముగించేందుకు భారత్ వివరణ కూడా ఇచ్చింది. బుద్ధుడు లుంబినిలో జన్మించాడనడంలో సందేహంలేదని ఆ ప్రకటనలో పేర్కొంది. బుద్ధుడి జన్మస్థలంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడానికి ఒక రోజు ముందే రాముడి జన్మస్థలంపై ఆధారాలు సేకరించాలని పురాతత్వశాఖకు ఓలీ ఆదేశాలు జారీ చేసినట్లు నేపాల్ మీడియా పేర్కొంది. ఇందుకనుగుణంగానే పురాతత్వశాఖ థోరిలో తవ్వకాలు మొదలు పెట్టినట్లు తెలుస్తోంది.

చైనా ఒత్తిడి ఉందా?

ఇటీవల జరిగిన కవి భానుభక్త 207వ జన్మదినోత్సవంలో పాల్గొన్న ఓలీ నిజమైన అమోధ్య నేపాలోని బీర్‌గంజ్‌కు సమీపంలోని థోరీ గ్రామమని వ్యాఖ్యానించారు. ఇక్కడే రాముడు పుట్టాడని ఆయన అన్నారు. వాస్తవాలను వక్రీకరించారని, నిజమైన రామజన్మభూమి నేపాల్‌లోనే ఉందని, రామాయణం రచించిన వాల్మీకి ఆశ్రమం కూడా నేపాల్‌లోనే ఉందని చెప్పుకొచ్చారు. అలానే దశరథుడు పుత్రకామేష్ఠి యాగం చేసిన ప్రాంతం కూడా తమ దేశంలోనే ఉందని, ఆయన నేపాల్‌ రాజేనని అన్నారు. అయితే ఓలీ ప్రకటనపై సాధు సంధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ దానిని ఖండించారు. దీంతో నేపాల్ విదేశాంగ శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఎవరి మనోభావాలు దెబ్బతీయడానికి ప్రధాని ఈ వ్యాఖ్యలు చేయలేదని, రాముడు జన్మస్థలం గురించి అనేక అభిప్రాయాలు ఉన్నాయని..రామాయణంపై విస్తృతమైన సాంస్కృతిక, భౌగోళిక అధ్యయనం జరపాల్సిన అవసరం ఉందని మాత్రమే ప్రధాని చెప్పారని ప్రకటనలో పేర్కొంది. ఏదేమైనప్పటికీ నేపాల్ ప్రకటనల వెనక చైనా ఒత్తిడి ఉందనే సందేహం ఇప్పుడు అందరిలోను తలెత్తోంది.

ఇదీ చూడండి: దేశానికి కొత్త రాజ్యాంగం అవసరం: ప్రధాని

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.