ETV Bharat / international

వ్యాక్సిన్​ ఉత్పత్తిలో భారత్​ సాయం కోరిన రష్యా

author img

By

Published : Aug 21, 2020, 5:06 AM IST

కరోనా వ్యాక్సిన్ 'స్పుత్నిక్​-వి' ఉత్పత్తిలో భారత్​ సాయం కోసం ఎదురుచూస్తున్నట్లు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్​మెంట్ ఫండ్ సీఈఓ కిరిల్ దిమిత్రియేవ్ వెల్లడించారు. వ్యాక్సిన్ తయారీకి లాటిన్​ అమెరికా, ఆసియాతో పాటు మరిన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు.

VIRUS-RUSSIA-VACCINE
వ్యాక్సిన్​ ఉత్పత్తి

రష్యా అభివృద్ధి చేసిన కరోనా వ్యాక్సిన్‌ 'స్పుత్నిక్‌-వి' ఉత్పత్తిలో భారత్ భాగస్వామ్యం కోసం ప్రయత్నిస్తోంది ఆ దేశం. ఈ మేరకు రష్యా డైరెక్ట్ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్ (ఆర్‌డీఐఎఫ్) సీఈవో కిరిల్ దిమిత్రియేవ్ తెలిపారు. ఈ వ్యాక్సిన్‌ కరోనాపై ఎంతో ప్రభావవంతంగా పనిచేస్తుందని, స్థిరమైన రోగనిరోధక శక్తిని ఏర్పరుస్తుందని వెల్లడించారు.

ఈ వ్యాక్సిన్‌ను రష్యాకు చెందిన గమలేయా పరిశోధన సంస్థ, రష్యా రక్షణ మంత్రిత్వశాఖ సంయుక్తంగా అభివృద్ధి చేశాయి. ఈ వ్యాక్సిన్‌ తయారీకి లాటిన్ అమెరికా, ఆసియా దేశాలతో పాటు మరి కొన్ని దేశాలు ఆసక్తి చూపుతున్నాయని దిమిత్రియేవ్​ తెలిపారు.

"వ్యాక్సిన్‌ తయారీ అనేది ఎంతో ముఖ్యమైన విషయం. ప్రస్తుతం మేం భారత్‌తో భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాం. వారు గమలేయా వ్యాక్సిన్ ఉత్పత్తి చేయగలరని మేం నమ్ముతున్నాం. ప్రస్తుతం వ్యాక్సిన్‌కు ఉన్న డిమాండ్ దృష్ట్యా వారి భాగస్వామ్యంతోనే వ్యాక్సిన్‌ను మేం సరఫరా చేయగలం."

- కిరిల్​ దిమిత్రియేవ్​

ఇప్పటికే చర్చలు..

గతంలోనే వ్యాక్సిన్‌ ఉత్పత్తికి సంబంధించి భారత్‌తో చర్చలు జరిగాయి. స్పుత్నిక్-వి వ్యాక్సిన్‌కు సంబంధించి ఫేజ్-1, ఫేజ్‌-2 సాంకేతిక వివరాలను ఆర్‌డీఐఎఫ్‌ను భారత కంపెనీలు అడిగాయి. అన్ని అనుమతులు పూర్తి చేసుకున్న అనంతరం దేశీయంగా వ్యాక్సిన్‌ ఉత్పత్తితో పాటు ఎగుమతికి అనుమతి కోరినట్లు మాస్కోలోని భారత రాయబార కార్యాలయ వర్గాలు వెల్లడించాయి. ఈ నేపథ్యంలో దిమిత్రియేవ్ తాజా ప్రకటన చేశారు.

అంతేకాకుండా భారత్‌, యుఏఈ, సౌదీ అరేబియా, బ్రెజిల్‌లో కూడా 'స్పుత్నిక్‌-వి' క్లినికల్ ట్రయల్స్‌ చేయాలని అనుకుంటున్నట్లు వెల్లడించారు దిమిత్రియేవ్. మొత్తం ఐదు దేశాల్లో వ్యాక్సిన్ తయారు చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యంగా ఆసియా, లాటిన్ అమెరికా, ఇటలీలో వ్యాక్సిన్‌కు అధిక డిమాండ్ ఉందని అన్నారు.

ఇదీ చూడండి: కరోనా టీకాపై రష్యాతో డబ్ల్యూహెచ్​ఓ చర్చలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.