ETV Bharat / international

పోస్టు కార్డులో వీర్యం- సంతానోత్పత్తిలో సఫలం!

author img

By

Published : Aug 8, 2021, 4:49 PM IST

జపాన్ శాస్త్రవేత్తలు సరికొత్త పద్ధతిని కనుగొన్నారు. ఎలుక వీర్యం నమూనాలను గ్లాస్ బాటిళ్లలో కాకుండా.. ప్లాస్టిక్ షీట్లలో ఇతర ప్రాంతాలను తరలిస్తున్నారు. దీనివల్ల బాటిళ్లు పగిలి వీర్యం నిరుపయోగమయ్యే సమస్య ఉండదు. అంతేగాక నిర్వహణ ఖర్చు కూడా చాలా తక్కువగా అవుతున్నట్లు పరిశోధకులు చెప్పారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం ఆగస్టు 5న ఐసైన్స్​ జర్నల్​లో ప్రచురితమైంది.

Researchers in Japan have developed a way to freeze dry sperm of mice on a plastic sheet
పోస్టు కార్డులో వీర్యం- సంతానోత్పత్తిలో సఫలం

ఎలుక వీర్యంతో శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. దీన్ని అంతరిక్షానికి తరలించి.. అక్కడ ఎలుక పిల్లలపై రేడియేషన్ ప్రభావం ఎలా ఉంటుందని పరిశోధనలు జరుపుతుంటారు. ఈ వీర్యాన్ని గ్లాస్ బాటిళ్లలోనే ఒక చోట నుంచి మరో చోటకు పంపుతుంటారు. ఒక్కో సారి బాటిళ్లు పగిలి వీర్యం నిరుపయోగమవుతుంది.

అయితే ఈ సమస్యను అధిగమించేందుకు జపాన్​ శాస్త్రవేత్తలు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. ఎలుక వీర్యాన్ని ప్లాస్టిక్ షీట్లలో భద్రపరిచి సురక్షితంగా ఇతర ప్రాంతాలకు తరలించే విషయంలో సఫలీకృతమయ్యారు. ఈ కొత్త పద్ధతి ద్వారా నిర్వహణ ఖర్చు తగ్గడమే గాక, అత్యంత సులభంగా రవాణా చేయవచ్చని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అధ్యయనం ఆగస్టు 5న ఐసైన్స్ జర్నల్​లో ప్రచురితమైంది. జపాన్​లోని యమనాషి యూనివర్సిటీ ఈ పరిశోధన నిర్వహించింది. డయ్యూ ఇటో దీనికి నేతృత్వం వహించారు. ఇతర పద్ధతులతో పోల్చితే ఇది అత్యంత చౌకైనదని ఆయన చెప్పారు.

ఎలుక పిల్లలపై అంతరిక్షంలో రేడియేషన్​ ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకునేందుకు తెరుహికో వకయామా ల్యాబ్ నిర్వహించిన ప్రయోగంలో డయ్యూ ఇటో కూడా సభ్యులుగా ఉన్నారు. ఎలుక వీర్యాన్ని బాటిళ్లలో అంతరిక్షానికి తరలించి సఫలీకృతమైన తొలి ల్యాబ్ కూడా ఇదే.

అయితే గ్లాస్​ బాటిళ్ల పద్ధతిలో ఒక్కోసారి అవి పగిలిపోవడమే కాకుండా, వాటికి ఎక్కువ చోటు కేటాయించాల్సి వస్తోంది. దీంతో కొత్త పద్ధతిపై వకయామా ల్యాబ్ దృష్టి సారించింది. తొలుత ప్లాస్టిక్ షీట్లలో ఎలుక వీర్యాన్ని భద్రపరిచింది. అయితే ప్లాస్టిక్​ వల్ల వీర్యం విషపూరితమైంది. దీంతో ప్లాస్టిక్​ కవర్​ లోపల ఇతర పదార్థాన్ని ఉపయోగించి వీర్యాన్ని భద్రపరచాలని భావించారు. కవర్​ లోపల బరువైన కాగితాన్ని చొప్పించారు. దానిలో ఎలుక వీర్యం నమూనాలు ఉంచి పోస్టు కార్డు ద్వారా ఇతర ప్రాంతానికి తరలించారు. అనంతరం ఈ వీర్యాన్ని ఉపయోగించగా ఆడ ఎలుకలు సంతానాన్ని పొందాయి. దీంతో తమ శ్రమకు ఫలితం దక్కిందని శాస్త్రవేత్తలు తెలిపారు. భవిష్యత్తులో ప్రపంచదేశాలన్నీ ఇదే పద్ధతిని ఉపయోగించి ప్రయోగాలు చేపడతాయని ఆశిస్తున్నట్లు చెప్పారు.

స్పర్మ్​ బుక్​..

ఈ కొత్త పద్ధతిలో ప్లాస్టిక్ కవర్ పేజీలున్న ఓ బుక్​లో అనేక రకాల ఎలుక జాతుల వీర్యాన్ని శాస్త్రవేత్తలు భద్రపరచవచ్చు. 'స్పర్మ్​ బుక్' అని నామకరణం చేసిన ఈ పుస్తకాన్ని మైనస్ 30 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద నిల్వచేయవచ్చు. ఈ నమూనాలను పోస్టు కార్డులుగా వందల కిలోమీటర్ల దూరానికి పంపవచ్చు.

ప్రయోగం అనంతరం ఓ శాస్త్రవేత్త న్యూ ఇయర్ గిఫ్ట్​కు ఎలుక వీర్యాన్ని జతచేసి మరో శాస్త్రవేత్తకు పంపారు. భవిష్యత్తులో సాధారణ గది ఉష్ణోగ్రతలో ఎలుక వీర్యాన్ని భద్రపరిచేలా ఈ పద్ధతిని అభివృద్ధి చేస్తామని వారు చెప్పారు.

ఇదీ చూడండి: అంగారకుడిపై జీవాన్వేషణలో కీలక ఘట్టం పూర్తి.. కానీ..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.