ETV Bharat / international

మనోళ్లు భారత్​ను చూసి నేర్చుకోవాలి: పాక్ ప్రధాని

author img

By

Published : May 6, 2021, 2:05 PM IST

విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయాలు.. పాకిస్థాన్ దౌత్య కార్యాలయాల కంటే మెరుగ్గా పనిచేస్తున్నాయని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ తెలిపారు. తమ పౌరుల కోసం చక్కగా పనిచేసే భారత దౌత్యవేత్తలను చూసి.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్థాన్ రాయబారులు నేర్చుకోవాలని ఇమ్రాన్ హితబోధ చేశారు.

pakistan pm imran khan
పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్

విదేశాల్లో ఉన్న పాకిస్థాన్ రాయబార కార్యాలయాల కంటే.. భారత రాయబార కార్యాలయాలే చక్కగా పని చేస్తాయంటూ సాక్ష్యాత్ పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కితాబిచ్చారు. ఇప్పటికైనా పాకిస్థాన్ రాయబారులు.. వలసవాదం తాలూకు వాసనలు వదిలి విదేశాల్లో ఉన్న పాకిస్థానీలకు అండగా ఉండాలని ఇమ్రాన్‌ సూచించారు. విదేశాల్లో ఉన్న తమ ప్రవాసులకు సాయం చేయడంలో కానీ.. స్వదేశానికి పెట్టుబడులు సాధించడంలో కానీ.. భారత రాయబారులను చూసి నేర్చుకోవాలంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాకిస్థాన్ రాయబారులకు ఇమ్రాన్ హితబోధ చేశారు.

సౌదీ రాజధానిలో తమ పట్ల పాకిస్థాన్ రాయబార కార్యాలయం ఉద్యోగులు కఠినంగా వ్యవహరించారంటూ రియాద్‌లో పనిచేసే కార్మికులు ఇచ్చిన ఫిర్యాదుతో.. ఇమ్రాన్ సర్కారు చర్యలు తీసుకుంది. ఆ కార్యాలయంలో పనిచేసే రాయబారితో పాటు.. మరో ఆరుగురు అధికారులను వెనక్కి పిలిపించింది.

విదేశాల్లోని పాకిస్థానీలకు ఆ దేశ రాయబార కార్యాలయాలు అండగా ఉంటున్నాయా లేదా అనే విషయంపై నివేదిక సమర్పించాలని విదేశీ వ్యవహారాల శాఖను ఇమ్రాన్ ఆదేశించారు. ఆయా దేశాల్లో పని చేస్తున్న పాకిస్థానీ కార్మికుల పట్ల తమ రాయబార కార్యాలయాల వ్యవహారశైలి మారాల్సి ఉందని స్పష్టం చేశారు.

"విదేశాల్లో ఉన్న రాయబార కార్యాలయాల ప్రథమ కర్తవ్యం.. అక్కడున్న తమ ప్రవాసుల కష్టాలు తీర్చడం. ఆ తర్వాత దృష్టి సారించాల్సింది.. విదేశీ పెట్టుబడులు రాబట్టడంపై. ప్రస్తుతం మన దేశం చాలా ఆర్థిక సమస్యల్లో ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విదేశీ పెట్టుబడులు తీసుకురావడానికి ఏం చేయాలి అన్నదానిపై దృష్టి పెట్టాలి. ఆ విషయంలో మనం ఎంత చైతన్యంగా ఉన్నాం? మనకు ఇంకా వలసవాదం తాలూకు వాసనలు పోలేదు. ఇంగ్లండ్‌లో ఓ రాయబారి ఉంటారు. ఆంగ్లేయులను కలవడం అతడికి చాలా సంతోషాన్ని ఇస్తుంది. కానీ అక్కడున్న ప్రవాస పాకిస్థానీల గురించి మాత్రం పట్టించుకోరు. విదేశీ పెట్టుబడులు తీసుకురావడం పట్టదు. అందుకే నేను ఓ విషయం స్పష్టంగా చెప్పాలని అనుకుంటున్నాను. పాకిస్థాన్ రాయబార కార్యాలయాలతో పోల్చితే.. భారత రాయబార కార్యాలయాలు.. భారత్‌కు విదేశీ పెట్టుబడులు సాధించే విషయంలో ఎంతో బాగా పనిచేస్తుంటాయి."

-ఇమ్రాన్‌ఖాన్‌, పాకిస్థాన్ ప్రధాని

ఇవీ చదవండి: 'అభిమానులారా.. భారత్​కు మన సహకారం అవసరం'

భారత్‌ త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా: ఇమ్రాన్‌

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.