ETV Bharat / international

గబ్బిలాల నుంచి మరో కొత్త కరోనా వైరస్?

author img

By

Published : Jun 13, 2021, 6:59 AM IST

కొవిడ్ మహమ్మారి యావత్ ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న వేళ.. మరో ఆందోళనకర అంశం వెలుగులోకి వచ్చింది. మహమ్మారి పుట్టుకపై అన్వేషణ సాగుతున్న దశలోనే గబ్బిలాల్లో మరో కొత్తరకం కరోనా వైరస్‌ను చైనా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వైరస్ సార్స్‌కోవ్‌-2ను పోలి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిశోధనకు సంబంధించి సెల్‌ అనే జర్నల్‌లో అధ్యయనం ప్రచురితమైంది.

new corona virus in china
గబ్బిలాల నుంచి మరో కొత్త కరోనా వైరస్??

యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి పుట్టుకపై పరిశోధన జరుగుతున్న సమయంలోనే చైనా పరిశోధకుల అధ్యయనంలో మరో ఆందోళనకర అంశం వెలుగు చూసింది. గబ్బిలాల్లో కొత్త రకపు కరోనా వైరస్‌ను చైనా పరిశోధకులు గుర్తించారు. ఇది ప్రస్తుతం ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొవిడ్-19 వైరస్‌ను జన్యుపరంగా పోలి ఉన్నట్లు వెల్లడించారు. కొవిడ్ -19 వైరస్‌కు అతిదగ్గరగా ఉన్న రెండో వైరస్‌గా పేర్కొన్నారు. యునాన్ ప్రావిన్స్‌లోని షాన్‌డోంగ్‌ విశ్వవిద్యాలయానికి చెందిన వీఫింగ్ షి, అతని సహచరుల పరిశోధనలో ఈ విషయం వెలుగుచూసింది.

గబ్బిలాల్లో ఎన్నిరకాల కరోనా వైరస్‌లు ఉన్నాయి, వాటిలో ఎన్నింటికి మనుషులకు విస్తరించే సామర్థ్యం ఉంది అనే అంశంపై వీఫింగ్ షి, అతని సహచరులు అధ్యయనం జరిపారు. మే 2019 నుంచి 2020 నవంబర్ వరకూ వీరి పరిశోధన సాగింది. చిన్న గబ్బిలాలు, అటవీ ప్రాంతంలో ఉండే గబ్బిళాల నుంచి నమూనాలను సేకరించి పరిశీలించారు. గబ్బిలాల మూత్రం,మలంతోపాటు నోటిలో నుంచి నమూనాలు సేకరించి పరిశోధనలు జరిపారు.

ఈ పరిశోధనలో వివిధ జాతులకు చెందిన గబ్బిళాల జన్యువుల్లో 24 రకాల కరోనా వైరస్‌లను గుర్తించారు. వీటిలో.. నాలుగు సార్స్‌కోవ్-2 వైరస్‌లు ఉన్నాయి. రైనోలోఫస్ పుసిల్లస్ అనే హార్స్‌షూ జాతి గబ్బిలాల్లో గుర్తించిన ఆర్​పీవైఎన్​06(RpYN06) అనే వైరస్‌.. సార్స్‌ కోవ్‌-2 వైరస్‌కు జన్యుపరంగా పోలిఉన్నట్లు ఈ పరిశోధనలో వెల్లడైంది. అయితే రెండింటికి స్పైక్ ప్రోటీన్‌లో జన్యుపరంగా కొన్నివ్యత్యాసాలు ఉన్నట్లు తేలింది. ఈ వైరస్‌ను జూన్ 2020లో థాయిలాండ్ నుంచి సేకరించిన సార్స్ కోవ్-2 వైరస్‌ను పరిశీలిస్తే గబ్బిలాల జనాభాలో సార్స్‌కోవ్‌-2 వైరస్‌ విస్తరిస్తున్న విషయం స్పష్టమవుతుందని.. పరిశోధకులు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో ఈ వ్యాప్తి ఎక్కువగా ఉన్నట్లు వివరించారు.

ఇవీ చదవండి: 2019 అక్టోబర్​లోనే వుహాన్​లో కరోనా ఆనవాళ్లు!

ఇదీ చదవండి: వుహాన్​ ల్యాబ్​పైనే వారి అనుమానం- తీవ్ర ఒత్తిడిలో చైనా!

నమూనాల్లో ఎక్కువ భాగం హార్స్‌ షూ జాతికి చెందిన గబ్బిళాల నుంచి సేకరించగా.. వీటిలో గుర్తించిన వైరస్.. 2017లో యునాన్‌లోని ఓ గుహలో వెలుగుచూసిన సార్స్‌కోవ్ వైరస్‌ను పోలి ఉంది. వీటితో పాటు మరో మూడు వైరస్‌లు సార్స్‌ వైరస్‌తో జన్యుపరంగా పోలి ఉన్నట్లు పరిశోధకులు వెల్లడించారు. మనుషులకు తీవ్ర వ్యాధులను కలిగించే వివిధ రకాల వైరస్‌లకు గబ్బిలాలు ఆవాసంగా ఉన్నాయన్న పరిశోధకులు.. హెండ్రా వైరస్, మార్‌బర్గ్‌, ఎబోలా, కరోనా వైరస్‌లు గబ్బిలాల్లో ఉన్నట్టు వివరించారు. కరోనా వైరస్ గబ్బిలాలు, మనుషులతో పాటు.. పందులు, పశువులు, ఎలుకలు, పిల్లులు, కుక్కలు, కోళ్లు, జింకలు సహా అనేక రకాల దేశీయ, వన్యప్రాణులకు సోకుతుందని వెల్లడించారు.

ప్రపంచ ఆరోగ్యసంస్థ నివేదికలు సైతం సార్స్‌కొవ్‌-2 వైరస్ జంతువుల నుంచి వ్యాపించి ఉండొచ్చని పేర్కొంటున్నాయి. ముఖ్యంగా గబ్బిలాల నుంచే వైరస్ వ్యాపించి ఉండొచ్చని డబ్ల్యూహెచ్​ఓ నివేదికలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో గబ్బిలాల్లోనే కొత్త రకపు కరోనా వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తోంది.

ఇవీ చదవండి: 'వుహాన్ ల్యాబ్​ నుంచే కరోనా లీక్- ఇదే సాక్ష్యం..'

Wuhan Lab: అమెరికాకు ఏడాది క్రితమే తెలుసా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.