ETV Bharat / international

మయన్మార్‌లో ఆందోళనకారుల విడుదల

author img

By

Published : Mar 25, 2021, 5:47 AM IST

మయన్మార్​లో మిలటరీ పాలకుల వైఖరిలో అనూహ్య మార్పు చోటు చేసుకుంది. సైనిక చర్యను నిరసిస్తూ నిర్బంధానికి గురైన ఆందోళనకారులను విడుదల చేశారు. ఈ క్రమంలో యాంగోన్​లోని ఓ జైలు నుంచి పెద్దఎత్తున యువకులు ఉత్సాహంగా బయటకు వచ్చారు.

Myanmar junta frees hundreds held for anti-coup protests
మయన్మార్‌లో ఆందోళనకారుల విడుదల

మయన్మార్‌లో గత నెల జరిగిన సైనిక చర్యను నిరసిస్తూ ప్రదర్శనల్లో పాల్గొని నిర్బంధానికి గురైన ఆందోళనకారులను బుధవారం విడుదల చేశారు. దేశంలో దాదాపు రెండు నెలలుగా మిలటరీ పాలకులు అనుసరిస్తున్న అణచివేత ధోరణిలో ఇది అనూహ్యమైన మార్పు. యాంగోన్‌లోని ఇన్‌సెయిన్‌ జైలు నుంచి పెద్దసంఖ్యలో యువకులు ఉత్సాహంగా బయటికి రావడం కనిపించింది. వీరిలో పలువురు విజయసంకేతంగా మూడువేళ్లను చూపించారు. మొత్తం 628 మందిని విడుదల చేసినట్టు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే టీవీ ఛానల్‌ వెల్లడించింది.

రాజకీయ ఖైదీల సమాచారం..

ఆంగ్‌ సాన్‌ సూకీ నేతృత్వంలోని ఎన్నికైన ప్రభుత్వాన్ని కాదంటూ వారిని నిర్బంధించి, ఫిబ్రవరి 1న మయన్మార్‌ మిలటరీ పాలకులు అధికారాన్ని హస్తగతం చేసుకున్నారు. మయన్మార్‌లో రాజకీయ ఖైదీలుగా ఉన్న నేతల అనుచరుల సమాచారం మేరకు.. సైనిక కుట్ర తర్వాత జరిగిన అణచివేతలో కనీసం 275 మందిని చంపి ఉంటారని అనుమానాలు వ్యక్తం చేశారు. మొత్తం 2,812 మందిపై అభియోగాలు మోపడం, కొందరిని అరెస్టు చేయడం వంటివి చేశారన్నారు. ఇపుడు కస్టడీలో ఉన్నవారు, అభియోగాలు ఎదుర్కొంటున్నవారి లెక్క చూస్తే 2,418 మాత్రమే ఉందంటూ ఈ వర్గాలు గణాంకాలు వెల్లడించాయి.

మంగళవారం కూడా మాండలేలో ముగ్గురిని చంపారని వీరు తెలిపారు. ఈ నేపథ్యంలో బుధవారం నుంచి ఆందోళనల శైలి మార్చారు. ఇళ్లలోనే ఉంటూ నిరసన తెలపాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ చిత్రాలన్నీ సామాజిక మాధ్యమాల్లో పెట్టారు. వీధులన్నీ నిర్మానుష్యంగా మారాయి.

ఇదీ చదవండి: 'భారత్​లోనే ఉంటాం..సాయం చేయండి'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.