ETV Bharat / international

అమెరికా దాడితో ఐఎస్​ చీఫ్‌ ఆత్మాహుతి- కుటుంబమంతా మృతి

author img

By

Published : Feb 5, 2022, 7:40 AM IST

Islamic State leader killed in US raid
అమెరికా దాడితో ఐఎస్​ చీఫ్‌ ఆత్మాహుతి

Islamic State leader: ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) గ్రూప్‌ చీఫ్‌ అబూ ఇబ్రహీం అల్‌-హషిమీ అల్‌-ఖురేషీ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో ఖురేషీతో పాటు అతని కుటుంబంలోని మహిళలు, పిల్లలు దుర్మరణం చెందారు. అమెరికా దళాలు కొన్ని నెలల నుంచి ఐఎస్‌ చీఫ్‌ ఖురేషీపై నిఘా పెట్టాయి. అతి కష్టం మీద అతడు ఉంటున్న ఇంటిని గుర్తించాయి.

Islamic State leader: సిరియాలో అమెరికా దళాలు చుట్టుముట్టడంతో ఇస్లామిక్‌ స్టేట్‌(ఐఎస్‌) గ్రూప్‌ చీఫ్‌ అబూ ఇబ్రహీం అల్‌-హషిమీ అల్‌-ఖురేషీ తనను తాను పేల్చేసుకున్నాడు. ఈ ఘటనలో ఖురేషీతో పాటు అతని కుటుంబంలోని మహిళలు, పిల్లలు దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని అధ్యక్షుడు జో బైడెన్‌ గురువారం ప్రకటించారు. అమెరికా కమాండోల దాడిలో ఇస్లామిక్‌ స్టేట్‌ కీలక నేత అబూ బకర్‌ అల్‌ బగ్దాది హతమయ్యాక 2019 అక్టోబరు 31న ఖురేషీ అతని స్థానంలోకి వచ్చాడు.

సిరియా- టర్మీ సరిహద్దుకు సమీపంలో అత్మేహ్‌ పట్టణ శివారులోని ఓ వ్యవసాయ క్షేత్రంలో ఖురేషీ ఉన్నట్టు నిర్ధారించుకున్న అమెరికా ప్రత్యేక దళాలు మెరుపు దాడి చేశాయి. హెలికాప్టర్లతో ఆ భవనంపైకి దిగిన అమెరికా సైనికులకు, లోపలున్న ఉగ్రవాదులకు రెండు గంటలకు పైగా కాల్పులు జరిగినట్టు ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. దాడుల్లో అమాయకులెవరూ చనిపోరాదని బైడెన్‌ ఆదేశించడం వల్లే వైమానిక దాడులు జరపలేదని తెలుస్తోంది. భవనంలో జరిగిన పేలుడులో తొలుత ఖురేషీతో పాటు ఆరుగురు పిల్లలు, నలుగురు మహిళలు సహా 13 మంది మరణించినట్టు వార్తలొచ్చాయి. అయితే ఖురేషీ జరిపిన పేలుడులో ఎంతమంది మృతిచెందారో కచ్చితంగా తెలియదని, మృతదేహాల డీఎన్‌ఏను విశ్లేషించాకే ఖురేషీ మృతిని ధ్రువీకరించినట్టు అమెరికా అధికారులు తెలిపారు. దాడుల అనంతరం తిరిగి వెళ్తుండగా ఓ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య తలెత్తగా దాన్ని ధ్వంసంచేశారు.

డిసెంబర్‌లోనే ప్లాన్​.. ఫిబ్రవరిలో అమలు

అమెరికా దళాలు కొన్ని నెలల నుంచి ఐఎస్‌ చీఫ్‌ ఖురేషీపై నిఘా పెట్టాయి. అతి కష్టం మీద అతడు ఉంటున్న ఇంటిని గుర్తించాయి. డిసెంబర్‌లో ఖురేషీ పై దాడికి ప్లానింగ్‌ చేశాయి. కానీ, సమయం కోసం వేచి చూస్తూ మాటు వేశాయి. గురువారం అమెరికా అధినాయకత్వం నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ రాగానే.. ఓ గుర్తు తెలియని స్థావరం నుంచి ప్రత్యేక కమాండోల పటాలం, డ్రోన్లు బయల్దేరి సిరియా-టర్కీ సరిహద్దులకు సమీపంలోని అత్మేహ్‌ వైపు పయనమయ్యాయి. ఈ ప్రదేశం ఇస్లామిక్‌ స్టేట్‌ కీలక నేత అబూ బకర్‌ అల్‌ బగ్దాదీ ఎన్‌కౌంటర్‌ జరిగిన ప్రదేశానికి కొన్ని మైళ్ల దూరంలోనే ఉంది.

ఖురేషీ నిక్‌నేమ్‌ ‘డెస్ట్రాయర్‌’..!

ఖురేషీపై అమెరికా 10 మిలియన్‌ డాలర్ల బహుమతిని ప్రకటించింది. గత ఐసిస్‌ చీఫ్‌ అబు బకర్‌ అల్‌ బగ్దాదీ మాదిరిగా కాకుండా.. ఖురేషీ బాహ్యప్రపంచానికి అతి తక్కువ సార్లు కనిపించాడు. అతడిని ఐసిస్‌ గత కొన్నేళ్లుగా నాయకత్వ బాధ్యతలు అప్పగించేందుకు సిద్ధం చేసింది. 2019లో బగ్దాదీ ఎన్‌కౌంటర్‌ జరిగిన నాలుగు రోజులకు ఖురేషీ నాయకత్వ బాధ్యతలు చేపట్టాడు. ప్రధాన యుద్ధ క్షేత్రానికి దూరంగా ఉంటూ కేవలం కొరియర్ల ద్వారానే ఐసిస్‌ ఉగ్ర సంస్థను నిర్వహిస్తున్నాడు.

అత్యంత క్రూరుడిగా ఖురేషీకి పేరుంది. ఐసిస్‌లో నాయకత్వ బాధ్యతలు చేపట్టిన నాన్‌ అరబ్‌ ఇతడే. సద్దామ్‌ హుస్సేన్‌ సమయంలో ఇరాక్‌ సైన్యంలో పనిచేశాడు. సద్దామ్‌ పాలన తర్వాత అల్‌-ఖైదాలో చేరాడు. 2003లో అమెరికా సైన్యం ఖురేషీని బందీగా పట్టుకొని క్యాంప్‌ బుక్కా జైల్లో ఉంచింది. అక్కడ ఏర్పడిన పరిచయాలతో ఆ తర్వాత ఇస్లామిక్‌ స్టేట్‌ను ఏర్పాటు చేశారు. అల్‌ బగ్దాదీ మోసూల్‌ పట్టణం స్వాధీనం చేసుకోవడానికి ఖురేషీ సాయం చేశాడు. ఆ తర్వాత వేగంగా ఐసిస్‌లో టాప్ ర్యాంక్‌కు చేరుకొన్నాడు.

అల్‌-బగ్దాదీని వ్యతిరేకించిన వారిని క్రూరమైన విధానాలను అనుసరించి తప్పించేవాడు. ఖురేషీ నేతృత్వంలోని యజిదీ తెగ నరమేధాన్ని చేపట్టింది. ఆ తెగ మహిళలను చిత్ర హింసలు పెట్టి విక్రయించడం, పేలుళ్లకు పాల్పడటం వంటి దారుణాలకు పాల్పడింది.

అప్పుడప్పుడు స్నానానికి తప్పితే బయటకు రాడు..

సిరియాలోని అత్మేహ్‌ పట్టణంలో ఓ మూడంతస్తుల భవనంలో ఖురేషీ నివసిస్తున్న విషయాన్ని అమెరికా ఇంటెలిజెన్స్‌ సంస్థలు పసిగట్టాయి. కానీ, ఖురేషీ అత్యవసర పరిస్థితుల్లో మాత్రం బయటకు వచ్చేవాడు. అదే భవనంలో కింది ఫ్లోర్‌లో ఉండే ఒక ఐసిస్‌ ఉగ్రనాయకుడి సాయంతో లేఖలను కేడర్‌కు పంపించేవాడు. కొన్ని సార్లు ఆ భవనం మూడో అంతస్తులో ఆరుబయట స్నానం చేయడానికి వచ్చేవాడు. ఈ నేపథ్యంలో భవనంపై వైమానిక దాడి చేస్తే ఖురేషీతోపాటు అమాయకులు మరణిస్తారు. ఇక ఆ భవనం గ్రౌండ్‌ ఫ్లోర్‌లోని వారికి ఖురేషీ ఐసిస్‌ చీఫ్‌ అన్న విషయం తెలియదు. ఈ నేపథ్యంలో కమాండోలను దింపి ఆపరేషన్‌ నిర్వహించాలని నిశ్చయించారు. అటువంటి ఇంటిని కృత్రిమంగా నిర్మించి పేలుళ్లలో ఈ ఇల్లు ఏస్థాయిలో దెబ్బతింటుందో అంచనావేశారు.

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌కు డిసెంబర్‌లో ఈ ఆపరేషన్‌ గురించి క్షుణ్ణంగా వెల్లడించారు. ఈ నేపథ్యంలో గురువారం బైడెన్‌ నుంచి గ్రీన్‌ సిగ్నల్‌ లభించింది. దీంతో ఓ గుర్తుతెలియని స్థావరం నుంచి అమెరికా గన్‌షిప్‌ హెలికాప్టర్లు, డ్రోన్లు , కమాండోలు రాత్రి 10 గంటల సమయంలో అత్మేహ్‌కు చేరుకొరుకొన్నాయి. ఈ క్రమంలో అమెరికా కమాండోలకు స్థానికంగా కొంత ప్రతిఘటన ఎదురైంది. కానీ, ప్రతిఘటించిన వారిని అమెరికా దళాలు అణచివేసి ముందుకు వెళ్లాయి. ఇక ఖురేషీ ఉంటున్న ఇంటిలోని గ్రౌండ్‌ ఫ్లోర్‌ నుంచి 10మందిని దళాలు రక్షించాయి. ఆ ఇంటిపై దాడి మొదలు కాగానే..అతడు మూడో ఫ్లోర్‌లో ఆత్మాహుతి జాకెట్‌తో పేల్చేసుకొన్నాడు. ఇక అమెరికా దళాలు రెండో ఫ్లోర్‌లో ఉంటున్న ఖురేషీ అనుచరుడు, అతని భార్యను మట్టుబెట్టాయి. పేలుడు అనంతరం వేలిముద్రలు, డీఎన్ఏ ఆధారంగా ఖురేషీని నిర్ధారించారు.

ఇదీ చదవండి: Ukraine Tension: 'ఉక్రెయిన్​పై దాడికి రష్యా కుట్ర'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.