ETV Bharat / international

ప్రచ్ఛన్నయుద్ధం నాటి ఘర్షణలు తేవద్దు: చైనా

author img

By

Published : Nov 11, 2021, 10:14 PM IST

xi
షీ జిన్‌పింగ్‌

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో వివిధ మార్గాల్లో ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నాలు విఫలమవుతాయని చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ అన్నారు. పరోక్షంగా 'ఆకుస్‌' కూటమిని హెచ్చరించారు. న్యూజిలాండ్‌ వేదికగా జరిగిన ఆసియా పసిఫిక్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ (APEC) ఫోరం వార్షిక సదస్సులో వర్చువల్​గా పాల్గొని మాట్లాడారు జిన్​పింగ్​.

ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో గత కొంత కాలంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపై చైనా మరోసారి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఈ ప్రాంతంలో ప్రచ్ఛన్న యుద్ధకాలం నాటి ఉద్రిక్త పరిస్థితులను మరోసారి తీసుకురావద్దని హెచ్చరించింది. ఇటీవల అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా దేశాల మధ్య భద్రతా ఒప్పందం జరిగినట్లు ప్రకటన వచ్చిన నేపథ్యంలో.. చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వాటిపై పరోక్ష హెచ్చరిక చేశారు.

న్యూజిలాండ్‌ వేదికగా జరిగిన ఆసియా పసిఫిక్‌ ఎకనామిక్‌ కో-ఆపరేషన్‌ (APEC) ఫోరం వార్షిక సదస్సులో చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వీడియో ప్రసంగం చేశారు. ఈ సందర్భంగా ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో వివిధ మార్గాల్లో ఆధిపత్యాన్ని చెలాయించే ప్రయత్నాలు విఫలమవుతాయన్నారు. ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణ వాతావరణాన్ని తిరిగి తీసుకురావద్దని పలు దేశాలను హెచ్చరించారు. ఈ ప్రాంతంలో సరఫరా వ్యవస్థ సజావుగా సాగేలా చూసుకోవడంతోపాటు వాణిజ్యం, పెట్టుబడులను మరింత సరళీకృతం చేసే చర్యలు చేపట్టాలన్నారు. ఈ సందర్భంగా ఆర్థికాభివృద్ధికి ఊతమిచ్చేందుకు సంస్కరణల అమలుకు చైనా కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. మహమ్మారిపై పోరును కొనసాగించడంతోపాటు దాని నీడ నుంచి సాధ్యమైనంత త్వరగా బయటపడేందుకు ప్రయత్నాలు చేయడమే ఇండో పసిఫిక్‌ ప్రాంతంలో అతిముఖ్యమైన అంశమని షీ జిన్‌పింగ్‌ అభిప్రాయపడ్డారు.

ఇక ఏపీఈసీ(APEC) కూటమిలో అమెరికా, చైనా, తైవాన్‌, రష్యా, ఆస్ట్రేలియాతో సహా మొత్తం 21 దేశాలకు సభ్యత్వం ఉంది. ఇందులో ఉన్న అమెరికా, ఆస్ట్రేలియా దేశాలు బ్రిటన్‌తో కలిసి ఈమధ్యే 'ఆకుస్‌' (AUKUS) పేరుతో ఒక భద్రతా ఒప్పందాన్ని చేసుకున్నాయి. అయితే, దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో చైనా ప్రాబల్యాన్ని ఎదుర్కొనేందుకే ఈ దేశాలు తాజా ఒప్పందాన్ని చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

చైనా కూడా ఈ కూటమి ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించింది. తాజాగా అపెక్‌ సదస్సులోనూ ఈ విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించిన చైనా అధ్యక్షుడు.. ప్రచ్ఛన్న యుద్ధం నాటి ఘర్షణ పరిస్థితులు ఈ ప్రాంతంలో తిరిగి తీసుకురావద్దని హెచ్చరించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.