ETV Bharat / international

ట్రంప్ x బైడెన్: ఫలితం ఎన్నటికి తేలేనో!

author img

By

Published : Nov 3, 2020, 7:25 AM IST

అమెరికా ఎన్నికల ఫలితం ఓటింగ్ ముగిసిన కొద్ది గంటల్లోనే తేలే అవకాశం లేదని తెలుస్తోంది. మెయిల్​ ఇన్ బ్యాలెట్ ఓటింగ్ భారీగా పెరగడం వల్ల... వాటి లెక్కింపు అంత త్వరగా పూర్తయే సూచనలు కనిపించడం లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన నిబంధనలు అమల్లో ఉండటమూ ఇందుకు మరో కారణం.

how much time it will take for us election results
ట్రంప్ x బైడెన్: ఫలితం ఎన్నటికి తేలేనో!

అమెరికాకు కాబోయే అధ్యక్షుడెవరు? ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్న ప్రశ్న ఇదే. మంగళవారం ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో మరికొన్ని గంటల్లో ఈ ప్రశ్నకు సమాధానం దొరికేస్తుందని చాలామంది భావిస్తున్నారు. కానీ, అది సాధ్యం కాకపోవచ్చు! ఎప్పట్లా ఈ దఫా అగ్రరాజ్య అధినేతను త్వరగా తేల్చేయడం వీలు కాకపోవచ్చు. గతంతో పోలిస్తే మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్‌ ఓటింగ్‌ భారీగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణం.

పెరిగిన మెయిల్ ఇన్​ ఓటింగ్

సాధారణంగా పోలింగ్‌ రోజు ఓటింగ్‌ కేంద్రానికి రాలేనివారి కోసం మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్‌ (పోస్టల్‌/ఆబ్సెంటీ ఓటింగ్‌) అవకాశాన్ని కల్పిస్తారు. సైన్యంలో పనిచేసేవారు, వయోవృద్ధులు, తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నవారు దాన్ని ఉపయోగించుకుంటుంటారు. ఈ దఫా కరోనా ముప్పు నేపథ్యంలో మెయిల్‌ బ్యాలెట్లను ఆశ్రయించిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. దాదాపు 50 శాతం ఓటర్లు పోలింగ్‌ రోజుకు ముందే ఈ విధానంలో తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు అంచనా. సాధారణ ఓట్లతో పోలిస్తే మెయిల్‌ బ్యాలెట్లను లెక్కించడానికి అధిక సమయం అవసరమవుతుంది. ఈ సారి వాటి సంఖ్య గణనీయంగా పెరిగిన నేపథ్యంలో పోలింగ్‌ రోజు ఫలితం వెలువడే అవకాశాలకు తెరపడింది!

ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా..

పేరుకు దేశాధ్యక్ష ఎన్నికలైనా వాటి నిర్వహణపై అమెరికాలో ఏకరూపత లేదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో రకమైన నిబంధనలు అమల్లో ఉన్నాయి. కొన్ని రాష్ట్రాలు ఎవరైనాసరే పోస్టల్‌ బ్యాలెట్‌ను ఉపయోగించుకోవచ్చని చెబుతుంటే, మరికొన్ని రాష్ట్రాలు పరిమితులు విధిస్తున్నాయి. సరైన కారణం లేకపోతే మెయిల్‌ ఇన్‌ విధానాన్ని ఆశ్రయించకూడదని స్పష్టం చేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో ఈ ఎన్నికల్లో మెయిల్‌ ఇన్‌ బ్యాలట్‌కు రాష్ట్రాలు పెద్దగా అడ్డుచెప్పకపోయినా.. వాటిని స్వీకరించే గడువు, లెక్కింపును ప్రారంభించే సమయం విషయంలో తేడాలున్నాయి.

స్వీకరణలో అంతరాలు

తపాలా శాఖ మోసుకొచ్చే మెయిల్‌ బ్యాలెట్ల స్వీకరణ విషయంలో రాష్ట్రాల్లో నిబంధనలు వేర్వేరుగా ఉన్నాయి. సాధారణంగా ఎన్నికల తేదీ నాటికి వచ్చిన పోస్టల్‌ ఓట్లనే లెక్కిస్తారు. తర్వాత వచ్చిన వాటిని పక్కనబెడతారు. అయితే- ఎన్నికల తేదీ తర్వాత వచ్చే ఓట్లను కూడా స్వీకరించాలంటూ ఇటీవల డెమొక్రాట్లు గట్టిగా డిమాండ్‌ చేశారు. కొన్ని రాష్ట్రాల్లో కేసులు కూడా వేశారు. ట్రంప్‌కు లబ్ధి చేకూర్చేందుకుగాను తపాలా శాఖ గడువులోగా ఓట్లను లెక్కింపు కేంద్రాలకు చేర్చకపోవచ్చన్నది వారి ప్రధాన ఆందోళన. డెమొక్రాట్ల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమయిన నేపథ్యంలో ఎన్నికల తేదీ తర్వాత వచ్చే బ్యాలెట్లనూ పరిగణనలోకి తీసుకోవాలని పలు రాష్ట్రాలు నిర్ణయించాయి. నార్త్‌ కరోలినా ఈ నెల 12 వరకు, ఒహాయో ఈ నెల 13 వరకు బ్యాలెట్లను స్వీకరించనున్నాయి! ఓట్ల విషయంలో తేడాలొస్తే స్థానిక కోర్టులను పార్టీలు ఆశ్రయించే అవకాశం ఉంది. ఇందుకోసం రెండు పార్టీలూ నిపుణులను సిద్ధంగా ఉంచుకున్నాయి.

  • ఫ్లోరిడాలో పోలింగ్‌ ముగిసిన కొన్ని గంటల వ్యవధిలోనే దాదాపుగా పూర్తిస్థాయి ఫలితాలు వెలువడతాయి. జార్జియా, టెక్సాస్‌లలో గురువారం వరకు లెక్కింపు కొనసాగే అవకాశముంది.
  • విస్కాన్సిన్‌లో విజేత ఎవరో బుధవారం ఉదయం వరకు తేలిపోతుంది.
  • మిషిగన్‌, పెన్సిల్వేనియాల్లో వారాంతం వరకు లెక్క తేలకపోవచ్చు.

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.