ETV Bharat / international

సొంతింటికి వెళ్లేందుకూ ట్రంప్​కు ఇక్కట్లు!

author img

By

Published : Dec 18, 2020, 11:42 AM IST

అమెరికా అధ్యక్షుడి హోదా నుంచి దిగిన అనంతరం డొనాల్డ్​ ట్రంప్​.. ఫ్లొరిడాలోని తన పామ్​ బీచ్​ నివాసానికి వెళ్లే అవకాశాలున్నాయి. అయితే దీనిపై ఓ న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ట్రంప్​ అక్కడ ఉండకూడదని గతంలో ఓ ఒప్పందం కుదిరినట్టు వెల్లడించారు. అక్కడే నివాసముంటున్న ఓ స్థానికుడి తరఫున అధికారులకు లేఖ రాశారు.

Trump's move to his Florida estate challenged by neighbour
ట్రంప్​కు తప్పని ఇక్కట్లు- ఈసారి సొంతింటిపై!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్ గత కొంతకాలంగా ఆటుపోట్లు ఎదుర్కొంటూనే ఉన్నారు. కరోనా, ఎన్నికల ఫలితాలు, కోర్టుల రూపంలో అధ్యక్షుడికి ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. తాజాగా ఈ జాబితాలో మరో సమస్య చేరింది.

అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న అనంతరం ట్రంప్​ ఫ్లోరిడాలోని తన నివాసానికి వెళ్లాలనుకున్నారు. దానిని ఓ న్యాయవాది సవాలు చేశారు. ఈ మేరకు అధికారులకు ఓ లేఖ రాశారు. ఆ లేఖలో ఏముంది? అసలు ఎందుకు సవాలు చేశారు?

ఆ ఒప్పందం వల్లే..

ట్రంప్.. గతేడాది తన అధికార నివాసాన్ని న్యూయార్క్​ నుంచి ఫ్లోరిడాలోని పామ్​ బీచ్​కు మార్చుకున్నారు. అక్కడే ఆయనకు మార్​-ఏ-లాగు పేరుతో ఓ క్లబ్​ ఉంది. అధ్యక్షుడిగా దిగిపోయిన అనంతరం అక్కడికే వెళతారని సంబంధిత వర్గాల సమాచారం. దీనికి వ్యతిరేకించారు అటార్నీ రెజినాల్డ్​ స్టాంబాగ్​. దీనిపై పామ్​ బీచ్​ టౌన్​కు లేఖ రాశారు. ఫ్లొరిడాలోని తన ఆస్తిని వ్యాపార కార్యకలాపాల కోసం ఉపయోగించుకునేందుకు 1993లో స్థానికులతో ట్రంప్​ ఓ ఒప్పందం కుదుర్చుకున్నారని పేర్కొన్నారు. దాని ప్రకారం ఆ ప్రాంతంలో తనతో సహా ఎవరూ నివాసం ఉండకూడదని ట్రంప్​ అంగీకరించినట్టు గుర్తు చేశారు.

ఇదీ చూడండి:- 'బైడెన్​, ట్రంప్​లకు కరోనా టీకా ఇవ్వాలి'

పామ్​ బీచ్​ ప్రాంతం నివాసి తరఫున తాను ఈ చర్యలు చేపట్టినట్టు వివరించారు న్యాయవాది. ట్రంప్​ అక్కడ నివాసముంటే.. ఆ ప్రాంతంలో ఆస్తి విలువ తగ్గిపోతుందని ఆ నివాసి ఆందోళన వ్యక్తం చేసినట్టు పేర్కొన్నారు.

అధ్యక్షుడి అధికార నివాసం వద్ద అమెరికా సీక్రెట్​ సర్వీస్​ ఏర్పాటు చేసిన మైక్రోవేవ్​ భద్రత కారణంగానూ తన క్లైంట్​కు అనారోగ్య సమస్యలు తలెత్తినట్టు అందులో పేర్కొన్నారు రెజినాల్డ్​.

ఒప్పందంలో ఏముంది?

ఒప్పందంలోని సభ్యులు మాత్రమే రాత్రి పూట ఉండగలరు. అది కూడా ఏడాదికి 21రోజుల మాత్రమే. అందులోనూ ఒకే వారంలో వరుసగా మూడు రోజులు ఉండకూడదు.

ఇదీ చూడండి:- అమెరికాలో హోంలోన్​ వడ్డీ రేటు ఇంత తక్కువా?

అయితే ట్రంప్​ ఆ ఒప్పందంలో సభ్యుడిగా ఉన్నారా? అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. ఆయన సభ్యుడనే నమ్ముతున్నట్టు అటార్నీ పేర్కొన్నారు. అధ్యక్షుడికి మరో భంగపాటు ఎదురుకాకుండా ఉండటానికే ఈ వ్యాజ్యం వేసినట్టు.. ఫలితంగా ఆయన నివాసం కోసం ట్రంప్​ వేరే ప్రాంతాన్ని వెత్తుకునేందుకు సమయం దక్కుతుందని తెలిపారు.

ట్రంప్​ అసలు వెళతారా?

ఎన్నికల ఫలితాలు వెలువడినా, డెమొక్రాట్​ జో బైడెన్​ను అధ్యక్షుడిగా ఎలక్టోరల్​ కాలేజీ ఎన్నుకున్నా.. ట్రంప్​ మాత్రం తన ఓటమిని అంగీకరించడం లేదు. వచ్చే జనవరి 20న బైడెన్​ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. అయినప్పటికీ తాను శ్వేతసౌధాన్ని విడిచిపెట్టి వెళ్లనని ట్రంప్​ తన సలహాదారులతో చెప్పినట్టు ఓ ప్రముఖ వార్తా సంస్థ కథనం ప్రచురించింది. ఇది వారిని ఆందోళనకు గురిచేసినట్టు పేర్కొంది. అయితే దీనిపై శ్వేతసౌధం ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.

ఇదీ చూడండి:- 'ట్రంప్ న్యాయపోరాటం కొనసాగుతూనే ఉంది'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.